ముసుగు జర్నలిస్టులపై టిడిపి ఎదురుదాడి...!?
టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు మీడియాకు అతి ప్రాధాన్యం ఇస్తారు. ఆయన అధికారంలో ఉన్నా లేకున్నా జర్నలిస్టులకు, మీడియాకు ఆయన ప్రత్యేక గౌరవం ఇస్తారు. వాళ్లు తనకు వ్యతిరేకంగా వ్యవహరించినా..ఆయనేమీ వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని యత్నించరు. అయితే..దీన్ని అలుసుగా తీసుకుని కొందరు జర్నలిస్టు టిడిపిని, ఆపార్టీని ఇబ్బంది పెడుతుంటారు. ఇది ఇప్పుడు కొత్తగా జరుగుతున్నదేమీ కాదు. ఆయన అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అలాంటివి చాలానే జరిగాయి. ఎన్టీఆర్ నుంచి ఆయన పదవిని స్వీకరించిన తరువాత నుంచి ఆయనకు వ్యతిరేకంగా కొన్ని మీడియా సంస్థలు, కొందరు జర్నలిస్టులు పనిగట్టుకుని విష ప్రచారం చేసినా..ఆయన వారిపై ఎప్పుడూ ప్రతీకార చర్యలకు పాల్పడలేదు. ఆయన ముఖ్యమంత్రి అయిన కొత్తల్లో కాంగ్రెస్‌కు అనుకూలంగా వ్యవహరించే వార్త, ఆంధ్రభూమి, దక్కన్‌క్రానికల్ వంటి సంస్థలు ఆయనపై ఆరోపణలతో దండెత్తేవి. కొంత మంది జర్నలిస్టులు కూడా అలానే వ్యవహరించేవారు. ఆయన అధికారం కోల్పోయిన తరువాత కూడా అదే విధంగా వారు ప్రవర్తించేవారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సాక్షి, నమస్తే తెలంగాణ వంటి సంస్థలు ఆయనను లక్ష్యంగా చేసుకుని అసత్యప్రచారాలు చేసేవి. దీంతో..అప్పట్లో ఆ పత్రికలను టిడిపి మీడియా సమావేశాలకు పిలవలేదు. రాష్ట్ర విభజన తరువాత కూడా చంద్రబాబుకు ఇటువంటి పత్రికలతో కొంత మంది జర్నలిస్టులతో ఇబ్బందులు ఏర్పడ్డాయి. అదే పనిగా రాజధాని అమరావతి, చంద్రబాబుపై ఇష్టారాజ్యంగా అసత్య, అసమగ్ర కథనాలను ప్రచురించి ఆయనకు వ్యతిరేకంగా వ్యవహరించేవారు. అయితే..అప్పట్లో కూడా చంద్రబాబు వారిపై చర్యలు ఏమీ తీసుకోలేదు. దాన్ని అదనుగా భావించి ఇప్పుడు కొన్ని వందల యూట్యూబ్ ఛానెల్స్ చంద్రబాబుపై, ఆయన ప్రభుత్వంపై ఇష్టారాజ్యంగా దండెత్తుతున్నారు.
వైకాపాకు అనుకూలంగా వ్యవహరించే ఈ ఛానెల్స్ తెలంగాణ నుంచి ఆంధ్రాపై బురద చల్లుతున్నాయి. ముఖ్యంగా అసత్యాలను వండివార్చడమే లక్ష్యంగా వీరు పనిచేస్తున్నారు. తెలంగాణలో ఉండి..ఆంధ్రాలో ఏమి జరుగుతుందో తెలుసుకోకుండా వైకాపాకు మేలు చేయడమే లక్ష్యంగా వీరు పనిచేస్తున్నారు. ఇటీవల కాలంలో అమరావతి మునిగిపోయిందంటూ కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ ఇష్టారాజ్యంగా వ్యవహరించాయి. మరోవైపు మెడికల్ కాలేజీల విషయంలోనూ అలానే వ్యవహరిస్తున్నాయి. తెలంగాణకు చెందిన ఓ మహిళా యూట్యాబర్ ప్రసారంచేసిన కథనంపై టిడిపి సోషల్ మీడియా తీవ్రస్థాయిలో ఎదురుదాడి చేస్తోంది. ఆ మహిళా జర్నలిస్టు వైకాపాకు అనుకూలంగా పనిచేస్తున్నారని, వీడియోకు ఇంత తీసుకుని పనిచేస్తున్నారని టిడిపి దండెత్తుతోంది. గతంలో జగన్మోహన్‌రెడ్డి చేసిన అరాచకాలపై సదరు మహిళ ఎప్పుడైనా వీడియోలు చేశారా..? ఆయన అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఎప్పుడైనా ఆయనను పన్నెత్తి మాట అన్నారా..? ఇప్పుడు ఏమీ లేకపోయినా..ప్రభుత్వంపై విషప్రచారం చేస్తారా..? అంటూ వాళ్లు ఎదురుదాడి చేస్తున్నారు. ఈమె ఒక్కరే కాదు..మరో జర్నలిస్టు వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డిని హత్య చేయడానికి హంతకులు వచ్చారంటూ..ఓ కథనాన్ని ఒండివార్చారు. దానికి ఆధారాలు ఇవ్వమని పోలీసులు అడిగితే..హైదరాబాద్ మెట్రోలో ఎవరో అనుకుంటే విన్నానని, దాన్నే తాను వార్తగా ఇచ్చానని సిగ్గూ ఎగ్గూలేకుండా చెప్పారు. ఇది వీళ్లస్థాయి. అంత సీనియర్ జర్నలిస్టు అయి ఉండి..జగన్మోహన్‌రెడ్డిని ఎవరో హత్య చేస్తారని మాట్లాడుకుంటున్నారట..? దాన్ని తీసుకుని ప్రభుత్వంపై బురద జల్లారట. ఇక మరో ఆయనదీ అదే దారి. మైనార్టీ వర్గానికి చెందిన ఈయనగారు..ఏదో ఒక విషయాన్ని తీసుకుని చంద్రబాబుపై ఆయన ప్రభుత్వంపై విష ప్రచారానికి తెరతీస్తున్నారు. ఇక విజయవాడకు చెందిన మరో జర్నలిస్టుదీ అదే దారి. ఆయనకు వైకాపా నుంచి ప్యాకేజ్ వస్తుందని, దాంతో..ఆయన టిడిపికి వ్యతిరేకంగా నిమిషానికో వీడియో వదులుతుంటారు. అయితే..ఇన్నాళ్లూ చూసీ చూడనట్లు వదిలేసిన టిడిపి ఇప్పుడు వీరిపై ఎదురుదాడి చేస్తోంది. తమ సోషల్ మీడియా ద్వారా వాస్తవాలు చెబుతూ..వారు ఎందుకోసం ఇటువంటి ప్రచారాన్ని చేస్తున్నారో...ప్రజలకు వివరిస్తున్నారు.
కొసమెరుపుః - ఒకవైపు వీళ్లు చేస్తోన్న విషప్రచారాన్ని టిడిపి సోషల్ మీడియా ఆధారాలతో ఖండిస్తుంటే..టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మానవవనరులశాఖ మంత్రి నారా లోకేష్ మాత్రం సదరు జర్నలిస్టులు ఏదైనా విషయంపై సహాయం అడిగితే..ఆగమేఘాలపై స్పందిస్తున్నారు. వారు అడిగిన కోర్కెలను వెంటనే తీర్చేస్తున్నారు. విజయవాడకు చెందిన జర్నలిస్టు ఇంట్లో ఏదో జరిగితే...నారా లోకేష్ ఆయనను పరామర్శించారు. అదే విధంగా..తెలంగాణ మహిళా జర్నలిస్టు అడిగిన కోర్కెలను కూడా తీర్చేశారు. అయినా..వాళ్లు మాత్రం..టిడిపికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగానే..విష ప్రచారం చేస్తున్నారు. ఒకవైపు సదరు జర్నలిస్టుల ముసుగు టిడిపి సోషల్ మీడియా తీసేస్తుంటే..మరోవైపు మాత్రం నారా లోకేష్ వారికి ఆపద్భాందవుడిలా వారి కోర్కెలను తీరుస్తున్నారు. ఇలా అయితే..తాము ఎంతగా వారిపై ఎదురుదాడిచేసినా ఉపయోగం ఏమిటనే ప్రశ్న టిడిపి సోషల్ మీడియా వర్గాల నుంచి వస్తోంది.