I&PR డైరెక్ట‌ర్‌గా కె.ఎస్‌.విశ్వ‌నాథ‌న్ బాధ్య‌త‌ల స్వీకారం

13, Oct 2025


రాష్ట్ర స‌మాచార పౌర సంబంధాల శాఖ డైరెక్ట‌ర్‌గా కె.ఎస్‌.విశ్వ‌నాథ‌న్ సోమ‌వారంనాడు బాధ్య‌త‌ల‌ను స్వీక‌రించారు. ఈరోజు ఉద‌యం రాష్ట్ర కార్యాల‌యంలో ఆయ‌న బాధ్య‌త‌ల‌ను స్వీక‌రించారు. రాష్ట్ర స‌మాచార‌శాఖ డైరెక్ట‌ర్‌గా ఉన్న హిమాన్ష్ శుక్లా నెల్లూరు క‌లెక్ట‌ర్‌గా బ‌దిలీ కావ‌డంతో ఆయ‌న స్థానంలో ప్ర‌భుత్వం కె.ఎస్‌.విశ్వ‌నాథ‌న్‌ను డైరెక్ట‌ర్‌గా నియ‌మించింది. విశ్వ‌నాథ‌న్‌ను విశాఖ మెట్రోపాలిట‌న్ రీజియ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ అధారిటీ క‌మీష‌న‌ర్ గా ఉన్నారు. త‌మిళ‌నాడుకు చెందిన విశ్వ‌నాథ‌న్ ఆంధ్రా క్యాడ‌ర్‌ను ఎంచుకున్నారు. ఆయ‌న ఇప్ప‌టికే స‌బ్‌క‌లెక్ట‌ర్‌గా, జాయింట్ క‌లెక్ట‌ర్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌హించారు.  మీడియా రంగంలో వ‌స్తోన్న మార్పుల‌కు అనుగుణంగా యువ‌త అయితే..ఇప్పుడున్న సోష‌ల్ మీడియా, డిజిట‌ల్ మీడియాల‌పై అవ‌గాహ‌న ఉంటుంద‌న్న భావ‌న‌తో ప్ర‌భుత్వ పెద్ద‌లు యువకుడైన విశ్వ‌నాథ‌న్‌వైపు మొగ్గుచూపింది. గ‌తంలో ప‌నిచేసిన హిమాన్ష్‌శుక్లా వ‌లే..డిజిట‌ల్‌, సోష‌ల్ మీడియా, ఇత‌ర ప్లాట్‌ఫామ్‌ల‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఉప‌యోగించుకుని ప్ర‌భుత్వానికి మైలేజ్ తెస్తార‌నే ఉద్దేశ్యంతో ప్ర‌భుత్వం యువ ఐఏఎస్ అధికారిని స‌మాచార‌శాఖ డైరెక్ట‌ర్‌గా నియ‌మించింది. 

అక్రిటేష‌న్ల‌పై దృష్టి పెట్టాలి

కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చి ఏడాదిన్న‌ర అవుతున్నా జ‌ర్న‌లిస్టుల‌కు అక్రిడిటేష‌న్లు ఇవ్వ‌లేక‌పోయింది. గ‌త వైకాపా ప్ర‌భుత్వం ఇచ్చిన అక్రిడిటేష‌న్లే ఇప్ప‌టికీ చ‌లామణిలో ఉన్నాయి. గ‌తంలో డైరెక్ట‌ర్‌గా ప‌నిచేసిన హిమ‌న్ష్ శుక్లా అక్రిడిటేష‌న్లు ఇవ్వ‌డానికి చొర‌చూపినా..అనేక కార‌ణాల వ‌ల్ల అవి వాయిదా ప‌డుతూ వ‌స్తున్నాయి. సోష‌ల్ మీడియాకు, యూట్యూబ్ ఛానెల్స్‌కు అక్రిడిటేష‌న్లు ఇవ్వాల‌నే ప్ర‌భుత్వ పెద్ద‌ల కోరిక‌తో అక్రిడిటేష‌న్లు వాయిదా ప‌డుతూ వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే దీనిపై ప్ర‌భుత్వం జీవో తీసుకువ‌చ్చింది. అయితే..నూత‌న ఏడాది నాటికైనా..ఈ అక్రిడిటేష‌న్ల‌ను ఒక కొలిక్కి తెస్తారా..?  లేదా..అనే సందేహాలు జ‌ర్న‌లిస్టువ‌ర్గాల్లో వ్య‌క్తం అవుతోంది. అదే విధంగా జ‌ర్న‌లిస్టుల ఇళ్ల‌కు సంబంధించి అంశం కూడా పెండింగ్‌లోనే ఉంది. ప్ర‌భుత్వ పెద్ద‌లు ఈ విష‌యంలో నిర్ణ‌యం తీసుకున్నామ‌ని చెబుతున్నా..అది ప‌ట్టాలెక్క‌డం లేదు. గ‌త వైకాపా ప్ర‌భుత్వం జ‌ర్న‌లిస్టులు ఇళ్ల స్థ‌లాలు ఇస్తామ‌ని చెప్పి..ఎన్నిక‌ల‌కు మూడు నెల‌లు ముందు జీవో ఇచ్చింది. కానీ..అది అమ‌లు కాలేదు. ఇప్పుడున్న కూట‌మి ప్ర‌భుత్వంపై జ‌ర్న‌లిస్టులు ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నారు. దీనిపై నూత‌న డైరెక్ట‌ర్ దృష్టిసారించాల్సిన అవ‌స‌రం ఉంది. ఇక క‌రోనాతో చ‌నిపోయిన జ‌ర్న‌లిస్టుల కుటుంబాల‌కు రూ.5ల‌క్ష‌లు ఇస్తామ‌ని గ‌త వైకాపా ప్ర‌భుత్వం జీవోను విడుద‌ల చేసింది. అయితే..త‌రువాత దాన్ని ప‌క్క‌కు పెట్టారు. దీనిపై కూడా విధాన నిర్ణ‌యం తీసుకోవాల్సి ఉంది. 


(1)
(0)

Comments