రెండు అంశాలతో రచ్చ చేస్తోన్న వైకాపా...!?
ఏడాదిన్నర క్రితం ఘోర పరాజయానికి గురైన వైకాపా కోలుకోవడానికి యత్నిస్తోంది. ఆ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి ఏడాదిన్నర నుంచి ఏదైనా చిన్న అంశం దొరికినా..దాన్ని రచ్చ చేయడానికి యత్నిస్తున్నారు. ఘోర ఓటమిని జీర్ణించుకోవడానికి ఆయన తన ఓటమిని ఈవిఎం మిషన్లపైకి నెట్టేశారు. ఈవిఎంల వల్లే ఓడిపోయామని తన పార్టీ కార్యకర్తలకూ, నాయకులకూ నచ్చ చెప్పుకుంటున్నారు. ఈవిఎంలు లేకపోతే..తామే గెలిచేవారమని, తనకు ప్రజల్లో ఇమేజ్ తగ్గలేదని, పోగేసుకున్న జనాలతో వారిని మభ్యపెడుతున్నారు. వాస్తవానికి ఈ ఏడాదిన్నర నుంచి జగన్ ప్రజా సమస్యలపై పెద్దగా జనంలోకి రాలేదు. వివిధ కేసుల్లో అరెస్టు అయిన తన పార్టీ నాయకులను పరామర్శించేందుకు జైళ్ల వద్దకు వెళ్లి పరామర్శించారు. ఈసందర్భంగా పోగేసుకున్న జనాలతో సిఎం..సిఎం అంటూ నినాదాలు చేయించుకుంటున్నారు. ఒకటీ రెండు ప్రజా సమస్యలపై ఆయన ప్రజల్లోకి వెళ్లినా..అవి వివాదాస్పదం అయ్యాయి. అయితే...ఏడాదిన్నరలో అవినీతి కేసుల్లో వరుసగా తన పార్టీలో అత్యంత సీనియర్ నాయకులు, ఇతర స్థాయి నాయకులు అరెస్టులు కావడం, పార్టీ మనగడ ఏమవుతుందోనన్న భయంతో పార్టీ కార్యకర్తలు ఆందోళనకు గురవుతున్నారు. అయితే..ఏడాదిన్నర తరువాత అధికార కూటమి చేసిన తప్పులతో..ఇప్పుడు రెండు అంశాలు వైకాపాకు దొరికాయి. వాటిలో ప్రధానమైనది కల్తీ లిక్కర్ కాగా, మరోటి మెడికల్ కాలేజీలు ప్రవేట్ అంశం. తాను అధికారంలో ఉన్నప్పుడు మెడికల్ కాలేజీలు కట్టకుండా పెండింగ్‌లో పెట్టి...ఇప్పుడు వాటిపై ఆయన రచ్చ రచ్చ చేస్తున్నారు. ఈరోజు ఆయన నర్సీపట్నంలో నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీని సందర్శించనున్నారు. కూటమి ప్రభుత్వం పిపిపి మోడల్‌లో మెడికల్ కాలేజీలను నిర్మిస్తామని చెబుతోండడంతో..అలా చేయడానికి వీలు లేదని, దీనిపై ప్రజాఉద్యమాన్ని నిర్మిస్తామని ఆయన హెచ్చరిస్తున్నారు. కోటి మంది సంతకాలతో గవర్నర్ కలుస్తామని, ప్రభుత్వం తన తీరు మార్చుకోకుంటే..కూటమి సంగతి తేలుస్తామంటున్నారు.
కల్తీమద్యంతో జగన్‌కు ఊరట...!?
కాగా మరో అంశమైన కల్తీమద్యంతో వైకాపా అధినేత వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి ఊరట చెందుతున్నారు. చిత్తూరు జిల్లాలో దొరికిన కల్తీ మద్యం డెన్‌తో వైకాపాలో సంబరాలు మిన్నంటాయి. దీనిలో టిడిపికి చెందిన నియోజకవర్గస్థాయి నాయకులు ఉండడంతో..రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ మద్యాన్ని టిడిపి నేతలు అమ్ముతున్నారని, ఇది వేల కోట్ల కుంభకోణమని వైకాపా నాయకులు విమర్శిస్తున్నారు. ఈ విషయంలో వైకాపా దూకుడుగా వెళుతోంది. అందివచ్చిన అవకాశాన్ని వైకాపా నాయకులు పూర్తిగా వడిసిపట్టుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో..వేల కోట్ల మద్యం స్కామ్ జరిగింది. దీనిపై కూటమి ప్రభుత్వం సిట్‌తో విచారణ చేయిస్తోంది. ఈ కేసుల్లో ఇప్పటి వరకూ సిట్టింగ్ ఎంపి మిధున్‌రెడ్డి, అప్పటి సిఎంఓ ఇన్‌ఛార్జి ధనుంజయరెడ్డి, అప్పటి ముఖ్యమంత్రి పిఎస్ కృష్ణమోహన్‌రెడ్డితో పాటు, జగన్‌కు అత్యంత ఆప్తులైన మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, గోవిందప్ప బాలాజీ, కసిరెడ్డి వంటివారు అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో వేల కోట్ల అవినీతి జరిగిందని దీనిపై నియమించిన సిట్ ఇప్పటికే తన ఛార్జిషీట్‌లో పేర్కొంది. ఈ కేసులో అసలైన లబ్దిదారులు వేరే ఉన్నారని, వారెవరో కాదు..వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి దంపతులేనని టిడిపి నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. నేడో..రేపో ఈ కేసులో వారు అరెస్టు అవుతారనే ప్రచారంతో వైకాపా అధినేత జగన్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దేశ వ్యాప్తంగా ఈ కేసు గురించి చర్చ కూడా జరుగుతోంది. ఇటువంటి క్లిష్టసమయంలో కల్తీ మద్యాన్ని టిడిపి నేతలు అమ్ముతున్నారనే ఆరోపణలు రావడం జగన్‌కు ఊరట కల్గిస్తోంది. ఇప్పుడు తన పరివారం మొత్తాన్ని ఆయన దీనిపై మొహరించారు. టిడిపి నేతలే వేల కోట్ల మద్యం కుంభకోణానికి పాల్పడ్డారని, తన హయాంలో..నీతిగా మద్యం అమ్మకాలు జరిగాయని ఆయన తనకు తానే సర్టిఫికేట్ ఇచ్చుకుంటున్నారు. ఆయన ఇచ్చుకుంటోన్న సర్టిఫికేట్‌ను ప్రజలు నమ్మకపోయినా..వైకాపా క్యాడర్‌లో మాత్రం కొంత స్థైర్యాన్ని నింపుతోంది. మద్యాన్ని తామే కాదూ..టిడిపి నేతలూ కల్తీ చేసి అమ్ముతున్నారని, తమకూ వారికీ పెద్ద తేడాలేదనే సంగతిని ప్రజలు తెలుసుకుంటారని వారు అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో దీనిపై దూకుడుగా ప్రజల్లోకి వెళ్తున్నారు. ఒకవైపు ప్రభుత్వం కల్తీ మద్యం వ్యవహారంలో స్వంత పార్టీ వారిపై కూడా కఠినంగా చర్యలు తీసుకుంటుంటే..వైకాపా అధినేత మాత్రం దానిపై తన పార్టీ, సోషల్ మీడియాతో రచ్చ రచ్చ చేయిస్తున్నారు. ఈ వ్యవహారాన్ని మరింత సీరియస్‌గా చేస్తే..తన మద్యం కేసులపై ప్రజలకు ఆసక్తిపోతుందని, పైగా టిడిపిపై దుమ్మెత్తిపోసి ఆ పార్టీ అధినేతను చికాకు గురిచెయ్యాలనే వ్యూహం ఆయనలో ఉంది. అందుకే ఈ వ్యవహారంలో టిడిపి అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు మంత్రి అయిన లోకేష్‌పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. మొత్తానికి ఏడాదిన్నర తరువాత వైకాపాకు రెండు అంశాలు దొరికాయి. వీటిపై సాధ్యమైన మైలేజ్ సాధించాలని, పనిలో పనిగా తన మద్యం కేసును పలుచన చేయాలనే వ్యూహం దీనిలో ఉంది. మరి ప్రజలు దీన్ని నమ్ముతారో..లేదో చూడాలి.