పత్రికాధిపతిని ప్రసన్నం చేసుకునేందుకేనా...!?
ఓ ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఓ యాడ్ అధికార, రాజకీయవర్గాల్లో ఆశ్చర్యాన్ని,విస్మయాన్ని కల్గిస్తోంది. ప్రభుత్వం పత్రికలకు యాడ్స్ ఇవ్వడం కొత్తమీ కాదు కానీ...అయితే..ఇక్కడ ప్రభుత్వం తరుపున ఇచ్చిన యాడ్ ఆ పత్రికా యాజమాన్యం మెప్పు పొందేందుకు ఇచ్చినట్లు కనిపిస్తోంది. ప్రభుత్వం తరుపు ఇచ్చే యాడ్‌లో ప్రభుత్వాధినేత ఫొటో ఉంటుంది. లేదా...ఆ శాఖకు చెందిన మంత్రి ఫొటో ఉంటుంది. అయితే..ఇక్కడ ప్రభుత్వాధినేత ఫొటోను అతి చిన్నగా..ఆ పత్రికాధిపతి ఫోటో భారీ సైజులో ముద్రించి..ఆ పత్రికకు వార్షికోత్సవ శుభాకాంక్షలు చెప్పేశారు. ఇదెక్కడి విడ్డూరమంటూ..అధికార, రాజకీయవర్గాలు విస్తుపోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఓ కీలకశాఖ ఓ ప్రముఖ దినపత్రిక వార్షికోత్సవానికి సంబంధించి ప్రకటనను విడుదల చేసింది. అయితే..ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన సమాచారంతో పాటు, ప్రభుత్వాధినేత ఫొటోను ప్రముఖంగా ప్రచురించకుండా..సదరు పత్రిక అధినేత ఫోటోను భారీగా ప్రచురించింది. దీనిపై ప్రభుత్వ వర్గాల్లో రకరకాలుగా చర్చ జరుగుతోంది. గతంలో..ఇదే పత్రిక సదరు ప్రకటన ఇచ్చిన మంత్రిపై భారీ ఆరోపణలు చేసింది. ఆయన వారాంతంలో హైదరాబాద్‌లో ఉంటారని, అక్కడే..అన్ని వ్యాపారాలు చేస్తున్నారని, హోటల్స్‌లోనే డీల్స్ చేస్తున్నారని, ఈ విషయం తెలంగాణ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని హెచ్చరించారని, ఆయనను అదుపులో పెట్టుకోవాలని చెప్పారని భారీగా మొదటిపేజీలో వార్తను ప్రచురించింది. అప్పట్లో ఈ వార్త అధికార, రాజకీయవర్గాల్లో సంచలనం సృష్టించింది. డార్లింగ్ మంత్రిగా అభివర్ణించే సదరు మంత్రి ఈ వార్తతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అయితే...ప్రభుత్వ పెద్దలు సదరు వార్తను పెద్దగా పట్టించుకోలేదు. అయితే తరువాత దీని గురించి అందరూ మరిచిపోయారు. అయితే..ఇప్పుడు సదరు మంత్రి ఇచ్చిన ప్రకటన సదరు పత్రికను ప్రసన్నం చేసుకునేందుకే ఇచ్చారంటున్నారు. అయితే...ప్రకటనతోనే ఆయన ప్రసన్నంకారని,...ఆ పత్రికాధిపతిపై తమకు ఉన్న వినయ,విధేయతలను చాటడానికే ఈరకమైన ప్రకటన ఇచ్చారని అధికారవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద..ఈ ప్రకటనపై సోషల్‌మీడియాలో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. పలు వెబ్‌పత్రికలు, సైట్‌లు ఈ అంశాన్ని హైలెట్ చేశాయి.