పవన్‌ను పరామర్శించిన సిఎంఃఅక్కసుతో వైకాపా విమర్శలు
గత కొన్నిరోజులుగా జ్వరంతో బాధపడుతున్న డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈరోజు పరామర్శించారు. హైదరాబాద్‌లోని పవన్ కళ్యాణ్ ఇంటికి సిఎం చంద్రబాబు స్వయంగా వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు. అయితే..చంద్రబాబు పవన్ కళ్యాణ్‌ను పరామర్శించడంపై ప్రతిపక్ష వైకాపా విమర్శలు చేస్తోంది. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగంలో దీనిపై వ్యంగ్య పోస్టులు పెడుతోంది. ముఖ్యంగా అసెంబ్లీలో బాలకృష్ణ జగన్‌ను ఉద్దేశించిన చేసిన వ్యాఖ్యలు తరువాత చిరంజీవి విషయంలో చేసిన వ్యాఖ్యలను ఆధారంగా చేసుకుని విమర్శలు చేస్తోంది. బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు కూటమిలో సంచలనం కల్గించాయి. ఆయన వ్యాఖ్యల వల్ల కూటమికి నష్టం చేకూరుతుందని, దాన్ని కవర్ చేసే ఉద్దేశ్యంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పవన్ కళ్యాణ్‌ను కలిశారని వైకాపా విమర్శలు చేస్తోంది. అయితే..ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, పవన్ కళ్యాణ్‌ల మధ్య ఎంతో సయోధ్య ఉంది. వారిద్దరూ కలివిడిగానే ఉంటారు. పార్టీల మధ్య విభేదాలు వచ్చేలా వారు వ్యవహరించరు. పార్టీ నాయకుల వల్ల ఏమైనా ఇబ్బందులు వస్తే..వారిద్దరూ కలిసి కూర్చుని పరిష్కరించుకుంటుంటారు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ మరింతగా కృషి చేస్తున్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మరో 15ఏళ్లు టిడిపి, జనసేన కలిసి ఉండాలని ఆయన గట్టిగా చెబుతున్నారు. ఆయన పార్టీ నాయకులకూ ఆయన అదే విధంగా ఆదేశాలు ఇస్తున్నారు. అయితే కొంత మంది జనసేన ముసుగులో వైకాపాకు ఉపయోగపడేలా పోస్టులు పెడుతున్నారు. ఇప్పుడు బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను పట్టుకుని రాద్ధాంతం చేస్తోండడంతో..చంద్రబాబు, పవన్‌లు కలవడంతో..ఇక ఆ వివాదానికి పుల్‌స్టాప్ పెట్టినట్లైంది. ఇక వివాదం చేసే అవకాశం లేకపోవడంతో...వైకాపా సోషల్ మీడియా పవన్‌ను చంద్రబాబు పరామర్శించిన విషయాన్ని రాద్ధాంతం చేస్తోంది. మొత్తం మీద..ధీర్ఘకాల పొత్తుకోరుకుంటోన్న ఇరుపార్టీ నాయకులు..ప్రసంగాలు చేసే సమయంలో..ఆచితూచి మాట్లాడితేనే వారి కోరిక నెరవేరుతుంది. అలా కాకుండా..వ్యవహరిస్తే జగన్మోహన్‌రెడ్డికి మేలు చేసినట్లే అవుతుంది.