ఆటో రయ్...రయ్...!?
ఈ వార్షిక సంవత్సరంలో ఆటో సెక్టార్ దూసుకుపోతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సెక్టార్ ఈ ఐదు నెలల్లో 43శాతం లాభాలను ఆర్జించింది. నిఫ్టీలోని ఆటో సెక్టార్ మొన్న ఏప్రిల్‌లో ఏడాది కనిష్టానికి చేరి..తరువాత పుంజుకుంది. ఆటో రంగానికి సంబంధించిన స్టాక్‌లన్నీ పరుగులు పెడుతున్నాయి. ఏప్రిల్ ప్రారంభమైన ఈ ర్యాలీ ఇప్పుడు ఈ పండుగ సీజ్‌లో మరింత ఊపందుకుంటోంది. దీనికి తోడు కేంద్రప్రభుత్వం ప్రకటించిన జీఎస్టీ వెసులుబాటుతో ఈ రంగంలోని స్టాక్‌లు దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా చిన్న కార్లు, టూవీలర్స్ కొనుగోలు భారీగా ఊపందుకోవడంతో..ఈ రంగం గతంలో కంటే మంచి ఫలితాలను సాధిస్తోంది. ఏప్రిల్ నుంచి నిఫ్టీ ఆటోలోని ప్రధాన స్టాక్‌లు అయిన మారుతీ, మహీంద్రా & మహీంద్రా, బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్స్,అశోక్‌లేలాండ్, హీరో మోటార్స్,ఎంఆర్ ఎఫ్, ఐచర్ వంటి సంస్థలు దూసుకుపోతున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన జీఎస్టీ వెసులుబాటు ఈ జోరును మరింత పెంచుతోంది. సాధారణ సగటు జీవి ఇప్పుడు కారు కొనడం అత్యంత సులభం కానుంది. మారుతీ తన ఎస్‌ప్రెసోను కేవలం మూడున్నర లక్షలకే అమ్ముతోంది. టూవీలర్‌తో జీవితాలను గడుపుతోన్న సగటు కుటుంబీకులకు ఈ ధరతో కారు రావడంతో..చాలా మంది కార్ల షోరూమ్‌ల వద్ద క్యూ కడుతున్నారు. భారీగా ఆర్డర్స్ రావడంతో..డీలర్లు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాబోయే కాలంలో..ఆటో రంగం మరింతగా ముందుకు వెళ్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే..ఇదే సమయంలో..కీలకమైన ఐటి రంగం మాత్రం తిరోగమనంలో వెళుతోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ఐటి రంగానికి తీవ్రమైన ఇబ్బందులను సృష్టిస్తున్నాయి. కాగా..ఫార్మా రంగం కూడా ఒత్తిడికి గురవుతోంది. ఈ రంగాలు వెనుకుబాటులో ఉంటే..ఆటో,మెటల్, సిమెంట్ వంటి రంగాలు మార్కెట్‌ను నిలదొక్కుకునేలా చేస్తున్నాయి.