అరాచకానికి కేరాఫ్ జోగి...!?
మాజీ మంత్రి జోగి రమేష్ వ్యవహారాలు మామూలుగా ఉండవు. ఉమ్మడి కృష్ణాజిల్లాకు చెందిన ఈ రాజకీయనాయకుడు అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా..అరాచకానికి మారుపేరుగా నిలిచారు. యూత్ కాంగ్రెస్ లీడర్‌గా రాజకీయాల్లోకి వచ్చిన జోగి రమేష్ కాంగ్రెస్ నుంచే తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో పెడన నుంచి ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచారు. తరువాత 2014లో మైలవరంలో దేవినేని ఉమా మహేశ్వరరావు చేతిలో ఓడిన ఆయన 2019 ఎన్నికల్లో పెడన నుంచి గెలిచి జగన్మోహన్‌రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా చేరారు. అప్పట్లో మంత్రి పదవి కోసం ఆయన అప్పటి ప్రతిపక్షనేత, ఇప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇంటిపై దాడి చేశారు. ఒక ప్రతిపక్షనేత ఇంటిపై దాడి చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. అంతే కాదు..అప్పట్లో వైకాపాను వ్యతిరేకించిన రఘురామకృష్ణంరాజుపై రాయడానికి వీలు లేని భాషలో దూషించారు. ఆయనే కాదు..అప్పట్లో వైకాపాలో ఉండే మైలవరం ఎమ్మెల్యే కృష్ణప్రసాద్‌పై చీటికి మాటికి లొల్లిపెట్టుకునేవారు. జోగి బాధ తప్పించుకోవడానికే..కృష్ణప్రసాద్ టిడిపిలో చేరిపోయారు. అప్పట్లో జగన్మోహన్‌రెడ్డి అండ చూసుకుని ఆయన తనకు నచ్చవారి నందరినీ వేధింపులకు గురిచేశారు. అయితే.. 2024 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన ఆయన తనను కూటమి ప్రభుత్వం వేధిస్తోందని, బీసీలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అయితే..కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆయనను పల్లెత్తు మాట అనలేదు. తన ఇంటిపై దాడి చేసినా..చంద్రబాబునాయుడు మాత్రం ఆయనపై కక్షసాధింపు చర్యలకు పాల్పడలేదు. దీన్ని అలుసుగా తీసుకుని కూటమి ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేయడానికి నకిలీ మద్యం తయారీదారులతో కలిసి జోగి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రలకు తెరదీశారు.
ఈ విషయాన్ని కల్తీ మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్థన్‌రావే వెల్లడించారు. వైకాపా పాలనలోనే నకిలీ మద్యం తయారీ జరిగిందని, అయితే..కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నకిలీ మద్యం తయారీ ఆగిందని, అయితే మాజీ మంత్రి జోగి రమేష్ తనకు ఫోన్ చేసి మళ్లీ నకిలీ మద్యం తయారీని ప్రారంభించాలని చెప్పారని, దీన్ని మీడియాకు రిలీజ్ చేసి..కూటమి ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేయాలనే కుట్ర చేశారని ఆయన వెల్లడించారు. నకిలీ మద్యాన్ని మొదట ఇబ్రహీంపట్నంలో ప్రారంభించాలని భావించగా జోగి రమేష్ జోక్యం చేసుకని తంబళ్లపల్లెలో చేయాలని చెప్పారని, అక్కడైతే చంద్రబాబుపై బురద చల్లడానికి వీలుగా ఉంటుందని జోగి వ్యూహం రచించారని, అంతే కాకుండా జోగి తనకు ఆర్థిక సహాయం చేస్తానని కూడా చెప్పారని అద్దేపల్లి వెల్లడించారు. తనను ఒక వ్యూహం ప్రకారం ఆఫ్రికా పంపించారని, తాను లేనప్పుడు నకిలీ మద్యం తయారీ ప్రదేశాన్ని రైడ్ చేయించి, దాన్ని మీడియాకు లీక్ చేశారని, తనపై కేసులు పెట్టించి తరువాత ప్రభుత్వాన్ని బదనాం చేయాలనేదే జోగి వ్యూహమని ఆయన తెలిపారు. ఈ మొత్తం వ్యవహారంలో జోగి రమేష్ ఎంత పకడ్బందిగా ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేశారో అర్థం అవుతోంది. వైకాపా హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి తీవ్ర ఇక్కట్లలో ఉన్న పరిస్థితుల్లో ఆయనను రక్షించేందుకు జోగి నకిలీ మద్యాన్ని తయారు చేయించారంటే జోగి అరాచకం ఏమిటో అర్థం అవుతోంది. ఇలాంటి వ్యక్తిపై కూటమి పెద్దలు దృష్టిపెట్టకపోవడం..గతంలో అతను చేసిన అవినీతి వ్యవహారాలను, అరాచకాలను చూసీ చూడనట్లు వదిలేయడంతోనే..ఇప్పుడు జోగి ఇంతటి అరాచకానికి పాల్పడ్డారని, కూటమి పెద్దల చేతకానితనంతోనే..జోగి లాంటి సంఘవిద్రోహశక్తులు రెచ్చిపోతున్నాయని టిడిపి నాయకులు, కార్యకర్తలు వాపోతున్నారు. ఇప్పటికైనా కూటమి పెద్దలు..ఇటువంటి వారి విషయంలో కఠిన చర్యలు తీసుకోకపోతే..రాబోయే కాలంలో ఇలాంటివే మరిన్ని కుట్రలు జరుగుతాయనడంలో ఎటువంటి సందేహం లేదు.