మొదటి వరుసలో రెడ్లే ఉండాలా..!?
వైకాపాలో రెడ్లకే అగ్రతాంబూలం...!
మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి మైక్ ముందు భలే సుద్దులు చెబుతుంటారు. తన పాలన బ్రహ్మాండం..తన పాలనలో ప్రజలు బంగారు కంచాల్లో భోంజేశారని, ఇప్పుడు ప్రతి ఒక్కరూ బాధపడిపోతున్నారని పదే పదే చెబుతుంటారు. ఈరోజు కూడా అదే పాట పాడారు. తన హయాంలో నాణ్యమైన మద్యాన్ని అమ్మారట. తన హయాంలో అమ్మినట్లు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమ్మడం లేదట. కల్తీ మద్యాన్ని అమ్ముతున్నారట. అంతేనా..సరైన టైమ్ పెట్టి..సరైన రేటుకు అమ్మామంటూ తన పార్టీ నాయకులకు ముందు యధేచ్ఛగా అబద్దాలు వల్లె వేశారు. అప్పట్లో మద్యం విషయంలో జరిగిన రాద్ధాంతాన్ని రాష్ట్రమంతా చూసింది. నాణ్యత లేని మద్యాన్ని అమ్మి జగన్ ఆయన మద్దతుదారులు వేలకోట్లు దోచుకున్నారని ఇప్పుడు జరుగుతోన్న విచారణలో తేలుతోంది. అప్పట్లో ఆయన మద్యాన్ని తాగలేక మద్యం అలవాట్లు ఉన్నవారు ఇతర రాష్ట్రాల నుంచి దొంగచాటుగా తెచ్చుకుని అత్యధిక రేట్లకు కొనుగోలు చేసుకున్నవైనం ఇంకా కళ్ల ముందే కదలాడుతోంది. జగన్ చేసిన పాపాలు అంత తొందరగా ప్రజలు మరిచిపోలేరు కానీ..జగన్ మాత్రం నమ్మకంగా అసత్యాలను పదే పదే వల్లె వేస్తుంటారు. మద్యం విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల వైకాపా నాయకులే అంతరంగిక సంభాషణల్లో నవ్వుకుంటున్నారు. ఇది ఇలా ఉంటే..ఆయన చెప్పే శ్రీరంగనీతులు ఎలా ఉంటాయో..తాజాగా జరిగిన సమీక్షల్లో తేటతెల్లం అయింది.
పార్టీకి ప్రాణం పెట్టేవారికి ప్రాధాన్యత ఏది..?
జగన్మోహన్‌రెడ్డి ఎక్కడ మీటింగ్ పెట్టినా..నా ఎస్సీలు, నా బిసీలు అంటూ..వాళ్లపై ఎక్కడలేని ప్రేమ కురిపిస్తారు. అయితే..ఆ ప్రేమంతా జనాలను బురిడీ కొట్టించడానికే...ఆయన మనస్సులోమాత్రం వాళ్లు ఎక్కడా ఉండరు. తన కులానికే ఆయన ప్రాధాన్యత ఇస్తారు. ఈరోజు ఆయన ఆధ్వర్యంలో జరిగిన రీజనల్ కో ఆర్డినేటర్స్, నియోజకవర్గ ఇన్‌ఛార్జిల సమావేశంలో..తన కులానికి చెందిన వారికే ప్రాధాన్యత ఇచ్చారు. ఈ సమావేశంలో..మొదటి వరుసలోఆయన కులానికి చెందిన వారే వరుసగా కూర్చున్నారు. వైకాపాకు గంపగుత్తగా ఓట్లు వేసే..మాల సామాజికవర్గం కానీ, మైనార్టీ వర్గానికి చెందిన వారు కానీ, మాదిగ సామాజికవర్గానికి చెందిన వారు కానీ...ఎవరూ ఆయన ముందు కూర్చోబెట్టుకోలేదు. తన ముందు తన సామాజికవర్గానికి చెందిన వారినే కూర్చోబెట్టుకున్నారు. ముందు వరుసలో వరుసగా వైకాపాకు చెందిన రఘునాధరెడ్డి, మేడా రఘునాధరెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, కాకాని గోవర్ధన్‌రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాంభూపాల్‌రెడ్డిలు మాత్రమే కూర్చున్నారు. వీళ్లే కాదు..మరో వరుసలో సజ్జల రామకృష్ణారెడ్డి, సుబ్బారెడ్డిలూ ముందువరుసలోనే...! అయితే..మచిలీపట్నానికి చెందిన పేర్ని నానిని వీళ్ల పక్కన కూర్చోబెట్టుకున్నారు. ఎందుకో మరి తెలియదు. పేర్ని పసుపు రంగ చొక్కాలో వచ్చారు. పార్టీ మారతారమోననే భయంతోనేమో..ఆయనకు మాత్రం కొంచెం ప్రాధాన్యతనే ఇచ్చారు. మాట్లాడితే.. నా ఎస్సీలు, నా బిసీలు అనే జగన్‌కు కనీసం వాళ్లలో ఒక్కరినైనా ముందు వరుసలో కూర్చోబెట్టుకోవాలనే ఆలోచన ఎందుకు కలగలేదు. మాటల్లోనే..నా ఎస్సీలు, నా బిసీలు..పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న మాల సామాజికవర్గానికి చెందిన ఏ ఒక్కరినైనా ముందు కూర్చోబెట్టి గౌరవించాలనే ఉద్దేశ్యమే ఆయనలో లేనట్లుంది. ఓట్లేసేది మాలలు, మాదిగలు, బీసీలు పెత్తనం చేసేది మాత్రం రెడ్లా..?