జగన్‌ను పక్కన పెడతారా...!?
గత రెండు రోజుల నుంచి వైకాపా అధినేత వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి భార్య భారతీరెడ్డి రాజకీయాల్లోకి వస్తున్నారని, ఆమె పార్టీ నాయకులతో మాట్లాడుతున్నారని, నేడో...రేపో..ఆమె రాజకీయాల్లోకి వచ్చేస్తారని మెయిన్ మీడియాలో, సోషల్ మీడియాలోనూ ఒకటే చర్చ జరుగుతోంది. అయితే.. ఈ వార్తను వైకాపా వర్గాలు అటు కాదనడం లేదు..ఇటు అవుననడం లేదు. తమపై అధినేత భార్యపై పచ్చ మీడియా వార్తలు రాస్తోందని విమర్శలు గుప్పించారు తప్ప..ఆమె రాజకీయాల్లోకి రావడం లేదని నేరుగా చెప్పలేకపోయారు. కాగా వైకాపాకు మద్దతు ఇచ్చే కొన్ని సోషల్ మీడియా ఛానెల్స్ ఆమె రాజకీయాల్లోకి వస్తున్నారని చెబుతున్నాయి. వైకాపాను సమర్థించే తెలంగాణకు చెందిన ప్రొఫెసర్ కూడా ఇదే మాట చెప్పాడు. అయితే..మీడియాలో వార్తలు ఏమి వచ్చినా..రాకున్నా...వైకాపా పార్టీని నడిపించేది..ఆ ముగ్గురే. ఒకరు వై.ఎస్.జగన్ కాగా..మరొకరు..భారతీరెడ్డి..ఇంకొంకరు సజ్జల రామకృష్ణారెడ్డి. అయితే..ఇప్పుడు వైకాపా నేతల్లోనూ..ఒకటే సందేహం వ్యక్తం అవుతోంది. అవినీతి కేసుల్లో జగన్మోహన్‌రెడ్డి జైలుకు వెళితే..భారతీరెడ్డి రాజకీయాల్లోకి వస్తారా..? లేక ఆయన ఉన్నప్పుడే రాజకీయాల్లోకి వస్తారా..? అనే దానిపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల కాలంలో జగన్‌మాటి మాటికి రాజీనామా చేస్తానని చెబుతున్నారు. పులివెందుల ఎమ్మెల్యేగా ఆయన రాజీనామా చేస్తే..ఆయన స్థానంలో భారతీ పోటీ చేస్తారనే ప్రచారం ఉంది. ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేస్తే గెలుస్తారని, అదే సమయంలో జగన్మోహన్‌రెడ్డి కడప ఎంపిగా పోటీ చేస్తారని, ప్రస్తుతం ఎంపిగా ఉన్న అవినాష్‌రెడ్డి రాజీనామా చేసి తప్పుకుంటారనే ప్రచారం ఉంది. అయితే..ఇవేవీ నిర్ధారనైన వార్తలు కావు. ఇవన్నీ అంచనాలే. అయితే..జగన్ వ్యవహారం చూస్తుంటే మాత్రం పార్టీలో ఏదో జరుగుతోందనే భావన ఆ పార్టీ కార్యకర్తల్లోనే ఉంది. ప్రతిపక్షస్థానంలో ఉండి..ప్రజాసమస్యలపై జగన్మోహన్‌రెడ్డి పెద్దగా స్పందించడం లేదు. లేస్తే..బెంగుళూరు వెళ్లిపోతున్నారు. అక్కడే కాలం గడిపేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో..భారతిరెడ్డి క్రియాశీలకం అయ్యారనే వార్తలు రావడంతో..ప్రస్తుతానికి జగన్‌ను పక్కన పెట్టేస్తారా..అనే అనుమానాలు కొందరు కార్యకర్తల్లోనూ,నాయకుల్లోనూ వ్యక్తం అవుతోంది. వాస్తవానికి జగన్‌కు ఆయనను అభిమానించే వర్గాల్లో మంచి ఆదరణ ఉంది. అయితే..ఆయన చేస్తోన్న ప్రసంగాలు, ఆయన వ్యవహారశైలి తదితరకారణాల వల్ల ఆయన ప్రజల్లో చులకన అవుతున్నారు. ఈ పరిస్థితుల్లో..భారతి ముందుకు వస్తోందని, ఆమె సజ్జల సహాయంతో...పార్టీని నడుపుతారనే ప్రచారం జరుగుతోంది.
వైకాపా గెలిస్తే..భారతే సిఎం...!
వాస్తవానికి 2019లో వైకాపా గెలిచిన తరువాత జగన్మోహన్‌రెడ్డి పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు. బటన్ నొక్కే కార్యక్రమాలన్నీ ఆయన ఇంటి నుంచే చేసేవారు. బటన్ నొక్కడం...చప్పట్లు కొట్టడం..తరువాత ఇంట్లోకి వెళ్లిపోవడం..ఇదే ఆయన పాలన. అయితే..మిగతా వ్యవహారాలన్నీ..సజ్జల, భారతినే చూశారని వైకాపాలో పనిచేసి బయటకు వచ్చిన కొందరు నాయకులు ఇప్పుడు చెబుతున్నారు. అప్పట్లో జగన్ చేత చేయించాల్సిన తప్పులన్నీ వీరు చేయించారని, తద్వారా ఆయనను ప్రజల్లో చులకన చేశారని వారు అంటున్నారు. 2019 ఎన్నికలకు ముందే జగన్ కాకుండా భారతినే సిఎంను చేయాలని చూశారని కానీ...అప్పట్లో అది కుదరలేదని, అయితే...ఆమె సిఎం కాకపోయినా..వెనుక ఉండి అంతా ఆమే చేశారని వారు చెబుతున్నారు. ఒక పద్దతి ప్రకారం జగన్ కుటుంబీకులని తరిమేశారని, ముందు వై.ఎస్.షర్మిలను, తరువాత విజయమ్మను పంపించేశారని, ఇప్పుడు వారెవరూ జగన్ కోసం రారు కనుక..ఇక భారతే..ముందుండి నడిపిస్తుందంటున్నారు. జగన్ పాలనను చూసిన ప్రజలు ఇప్పుట్లో ఆయనపై ఉన్న కోపాన్ని మరిచిపోరని, ఆయనైతే..పార్టీ మళ్లీ గెలవదని, దాంతో భారతిని ముందుకు తెస్తున్నారంటున్నారు. అయితే..ఇదంతా ఒక పద్దతి ప్రకారం జరుగుతోందని, ఒక వ్యూహం ప్రకారమే జగన్‌ను రాజకీయాలనుంచి తప్పిస్తారని వారు చెబుతున్నారు. వాళ్లు అనుకున్నది..అనుకున్నట్లు జరిగితే..వచ్చే ఎన్నికల్లో వైకాపా గెలిస్తే..భారతే సిఎం అవుతారని కూడా వారు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తం మీద..వైకాపా వ్యవహారాలు రాజకీయ, అధికార వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. వీరితో పాటు..సామాన్యప్రజలు కూడా దీనిపై చర్చించుకుంటున్నారు.