కార్లే కాదు...షేర్లూ..డిస్కౌంట్‌లో దొరుకుతున్నాయోచ్...!?
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పుణ్యాన దసరా సందర్భంగా కార్లు కొనాలనకునే వారికి భారీ తగ్గింపు ధరలతో కార్లు లభ్యమవుతున్నాయి. ముఖ్యంగా ఎన్నాళ్ల నుంచో కారు కొనాలనుకునే సగటు కుటుంబీకులకు అతి తక్కువ ధరలో కార్లు లభ్యమవుతున్నాయి. ట్రంప్ దుందుడుకు చర్యలతో భారతదేశంపై టారిఫ్‌లు విధించడం దాన్ని తట్టుకునేందుకు భారత ప్రభుత్వం జీఎస్టీ సంస్కరణలు తేవడంతో...ఒక్కసారిగా కార్ల రేట్లు దిగివచ్చాయి. అప్పటి వరకూ ఉన్న జీఎస్టీలను తగ్గించడంతో అతి చౌకగా కార్లు మార్కెట్‌లో దొరకుతున్నాయి. ఈ పండగ రోజుల్లో దేశ వ్యాప్తంగా కార్ల కొనుగోలు భారీగా పెరిగిందని, గత 30ఏళ్లలో ఇటువంటి పరిస్థితి ఎప్పుడూ లేదని కార్ల డీలర్లు పరమానందంగా చెబుతున్నారు. ఒకే రోజు 30వేల కార్లు అమ్మామని కొన్ని కంపెనీలు ప్రకటించాయి. ఒకవైపు దసరా పండుగ, మరోవైపు అతి తక్కువ ధరలకే కార్లు లభిస్తుండడంతో...వినియోగదార్లు పరమానంద భరితులవుతున్నారు. ఇవి ఒక్కటే కాదు..ఇతర వస్తువుల ధరలు కూడా దిగి వస్తున్నాయి. అభివృద్ధి చెందుతోన్న భారతదేశంలో గతంలో ఎన్నడూ..ఈ రకంగా వస్తువుల ధరల తగ్గడం జరగలేదు. ఎవరూ ఊహించని విధంగా ధరలు తగ్గుతుండడం సగటు కుటుంబాల్లో ఆనందాన్ని నింపుతోంది.
ఇది ఇలా ఉంటే..కేవలం వీటి ధరలకే కాదు..షేర్ మార్కెట్‌లో షేర్ల ధరలు కూడా తగ్గుతున్నాయి. ట్రంప్ పుణ్యాన భారత స్టాక్ మార్కెట్లు తిరోగమన దిశలో పయనిస్తున్నాయి. ట్రంఫ్ టారిఫ్‌లతో ప్రముఖ కంపెనీల షేర్లు డిస్కౌంట్‌లో దొరుకుతున్నాయి. ముఖ్యంగా ఐటి, ఫార్మా ,ఆరోగ్య రంగానికి చెందిన షేర్లు డిస్కౌంట్ ధరల్లో ట్రేడ్ అవుతున్నాయి.మార్కెట్‌పై ఏ మాత్రం అవగాహన ఉన్నవాళ్లెవరైనా..వీటిపై పెట్టుబడులు పెట్టడానికి అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యంగా ఐటి షేర్లు తీవ్రంగా పతనమవుతున్నాయి. ట్రంప్ చర్యల వల్ల ఈ రంగం విపరీతంగా నష్టపోతోంది. గత ఏడాది సెప్టెంబర్‌లో ప్రముఖ ఐటి కంపెనీ టిసీఎస్ షేర్ ధర రూ.4595/- ఉంటే..ఇప్పుడా షేర్ ధర రూ.2899/- వద్ద ట్రేడ్ అవుతోంది. అంటే ఈ షేర్ దాదాపు 37శాతం తగ్గిపోయింది. అయితే..ఇప్పుడే ఈ రంగంలో పెట్టుబడి పెట్టవద్దని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇక్కడ నుంచి ధర ఎంత పతనమవుతుందో అంచనావేయలేకున్నారు. మార్కెట్ స్థిరపడిన తరువాతే..దీనిలో పెట్టుబడులు పెట్టాలని సూచిస్తున్నారు. అయితే మార్కెట్‌లో అనుభవం ఉన్నవారు..ధీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టేవారికి మాత్రం ఈ రంగంలో డిస్కౌంట్‌లో ఈ షేర్లు దొరుకుతున్నట్లే. మొత్తం మీద..దసరా పండుగ సందర్భంగా కార్లు, ఇతర వస్తువుల ధరలే కాకుండా...షేర్లు కూడా డిస్కౌంట్‌లో దొరుకుతుండడం..విశేషం.