ముగిసిన అసెంబ్లీ సమావేశాలు...కూటమిలో అలజడి
ప్రతిపక్షాలను మించి నిలదీసిన స్వంత సభ్యులు
ముందు దూళ్ళిపాళ్ల నరేంద్ర, కూన రవికుమార్‌లు
తరువాత బోండా ఉమామహేశ్వరరావు, సుధీర్‌రెడ్డిలు..!
బాలకృష్ణ రంగప్రవేశంలో కూటమిలో అలజడి
మండలిలో రెచ్చిపోయిన వైకాపా...!
ధీటుగా సమాధానం ఇచ్చిన లోకేష్...!
తొమ్మిదిరోజుల పాటు జరిగిన రాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఈరోజు ముగిసాయి. అయితే..ఈ సమావేశాల్లో ప్రత్యర్ధి పార్టీ అయిన వైకాపా సభ్యులు ఎప్పటిలానే పాల్గొనలేదు. అయితే వారు లేని లోటును అధికార కూటమి సభ్యులే తీర్చారు. ప్రతిపక్ష సభ్యుల కన్నా..అధికార పక్ష సభ్యులే ప్రభుత్వాన్ని తీవ్ర ఇరకాటంలోకి నెట్టారు. ఒకరిని మించి ఒకరు పదే పదే ప్రశ్నలడుగుతూ, ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వాళ్లు చేసిన ప్రసంగాలు, నిలదీతలు..అధికార కూటమి పెద్దలను ఇరకాటంలో పడేశాయి. ముందుగా పొన్నూరు శాసనసభ్యుడు ధూళ్లిపాళ్ల నరేంద్ర డిజిటల్ కార్పొరేషన్‌లో జరిగిన అవినీతిపై చర్యలు ఏవి అంటూ రాష్ట్ర సమాచారశాఖ మంత్రి కొలుసుపార్థసారధిని నిలదీశారు. వైకాపా హయంలో జరిగిన అవినీతిపై ఇంకా ఎన్నాళ్లు మీనమీషాలు లెక్కిస్తారంటూ..ఆయన ప్రభుత్వాన్ని పదే పదే ప్రశ్నించారు. దీనిపై మంత్రి దాటు వేటు సమాధానం ఇచ్చారు. తరువాత ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ టిడిఆర్ బాండ్ల వ్యవహారంలో మున్సిపల్ మంత్రి నారాయణను నిలదీశారు. టిడిఆర్ బాండ్ల వ్యవహారంలో జరిగిన అవినీతిని తేల్చాలంటూ, అప్పటి మున్సిపల్ శాఖ కార్యదర్శి అవినీతిపై విచారణ జరిపించాలని ఆయన మంత్రిని ప్రశ్నించి ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా ప్రభుత్వ పెద్దలను తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. ప్రభుత్వం వచ్చి ఏడాది అవుతున్నాన..స్థానికి సిఐని బదిలీ చేయలేకపోయామని, ఇది ప్రభుత్వ తీరు..అంటూ ఆయన ప్రభుత్వాన్ని అసెంబ్లీ సాక్షిగా ఎండగట్టారు. దీంతో..ప్రభుత్వ పెద్దలు నివ్వెరపోయారు. వీళ్లు అధికార పార్టీ ఎమ్మెల్యేలా లేక ప్రతిపక్ష పార్టీకి చెందిన వారా..? అంటూ వారు ఆశ్చర్యపోయి..తరువాత వారిని పిలిపించుకుని వారిని మందలించినట్లు వార్తలు వచ్చాయి.
డిప్యూటీ సిఎం X బోండా ఉమా...!
విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శాఖకు సంబంధించి చేసిన వ్యాఖ్యలు కూటమిలో కలకలం సృష్టించాయి. పవన్ కళ్యాణ్ శాఖలో పని జరగాలంటే సొమ్ములు ముట్టచెప్పాలని, పొల్యూషన్ కంట్రోల్‌బోర్డు ఛైర్మన్ అవినీతికి కొమ్ముకాస్తున్నారని, పవన్ సరిగా శాఖను పట్టించుకోవడం లేదంటూ..ఆయనచేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఆయన వ్యాఖ్యలకు పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇవ్వడం..బ్లాక్‌మెయిల్ చేస్తే..ఊరుకోనని హెచ్చరించడం..సంచలనమయ్యాయి. బోండా వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారని తెలుస్తోంది.
బాలకృష్ణ బాంబు...!
ఆ అసెంబ్లీ సమావేశాల్లో అన్నిటికంటే..హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కూటమిని తీవ్ర ఇబ్బందులు పాలుచేసింది. కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ చిరంజీవిని జగన్ అవమానించారని, ఆయన ఇంటికి వస్తే..జగన్ కలవలేదని, చిరంజీవి గట్టిగా మాట్లాడితే..అప్పుడు జగన్ వచ్చి కలిశారని జగన్ మనస్తత్వానికి ఇది నిదర్శనమని చెబుతుండగా..బాలకృష్ణ లేచి..ఎవరూ జగన్‌ను గట్టిగా ప్రశ్నించలేదని, అదంతా అబద్దమని ఘాటుగా వ్యాఖ్యానించారు. దీంతో..సభలో ఉన్నవాళ్లు సభను చూస్తోన్నవాళ్లందరూ నిర్ఘాంతపోయారు. అసలు చిరంజీవి గురించి ఆయన వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఏముందో ఎవరికీ అర్థం కాలేదు. అంతే కాదు..జగన్ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలూ వివాదాస్పదం అయ్యాయి. జగన్ వ్యాఖ్యల గురించి పెద్దగా పట్టించుకోకపోయినా..చిరంజీవి గురించి చేసిన వ్యాఖ్యలు కూటమిలో అలజడిని రేపాయి. బాలకృష్ణ వ్యాఖ్యలపై చిరంజీవి అభిమానులు, మెగా అభిమానులు సోషల్ మీడియా వేదికగా..మండిపడుతున్నారు. కూటమి విజయానికి కారణమైన పవన్ కళ్యాణ్ సోదరుడి గురించి కూటమిలోని కీలకమైన నేత అయిన బాలకృష్ణ ఆరకంగా మాట్లాడవచ్చునా..అంటూ..వారు ప్రశ్నిస్తున్నారు. అంతేనా..గతంలో బాలకృష్ణ వ్యవహరించిన తీరుపై కూడా వారు విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇది ఒకరకంగా..కూటమిలో ఇబ్బందులకు కారణమైంది. సంబంధం లేని విషయాలపై అనవసరంగా అసెంబ్లీ వేదికగా రచ్చ రచ్చ చేసుకున్నారనే భావన వ్యక్తం అవుతోంది. సున్నితమైన విషయాలను కెలికి వాసన చూశారా..? అంటూ టిడిపి అభిమానులు వాపోతున్నారు. ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా..? అన్న చందాన ఉన్న వైకాపాకు లడ్డూలాంటి ఛాన్స్ బాలకృష్ణ ఇచ్చారని టిడిపి అభిమానులు వాపోతున్నారు. దొరికిన ఛాన్స్‌తో వైకాపా రాష్ట్ర వ్యాప్తంగా రెచ్చిపోతోంది. తమ నేతను బాలకృష్ణ సైకో అన్నారని, చిరంజీవిని అవమానించారని వారు ప్రచారం చేస్తున్నారు. అయితే..వాళ్లెంత ప్రచారం చేసినా..బాలకృష్ణకు ఉన్న ఇమైజ్, ఆయన చేసిన సేవలను చూసిన వారు..వాటి గురించి పట్టించుకోరు. అయితే..చిరంజీవి పట్ల అలా వ్యవహరించడం మాత్రం నిజంగా టిడిపికి మైనస్సే.
మండలిలో రెచ్చిపోయిన వైకాపా...!
శాసనమండలిలో వైకాపా రెచ్చిపోయింది. మండలిలో వైకాపాకు మెజార్టీ ఉండడంతో..వాళ్లు ఇష్టారాజ్య రీతిన సభలో వ్యవహరించారు. ప్రతిదానికి రచ్చ రచ్చ చేశారు. చివరకు మళ్లీ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి పేరును పరోక్షంగా తెస్తూ..టిడిపిని ఇబ్బందులు పాలు చేయడానికి యత్నించారు. అయితే..మానవవనరులశాఖ మంత్రి నారా లోకేష్ వాళ్లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తన తల్లిని అవమానించారని, అప్పుడు వాళ్లు చేసిన దానికి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. వైకాపా సభ్యులు చివరకు ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా అవమానించారు. గౌరవనీయ ముఖ్యమంత్రిని కుప్పం ఎమ్మెల్యే అంటూ..వైకాపా ఎమ్మెల్సీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. అదేమంటే..తమ నేతను పులివెందుల ఎమ్మెల్యే అంటున్నారని, అందుకే తాము కూడా ముఖ్యమంత్రిని కుప్పం ఎమ్మెల్యే అంటున్నామని వాళ్లు వారి వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. అయితే..ఈ సమావేశాల్లోనే వాళ్లు కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు బిల్లులను అడ్డుకున్నారు. చివరకు వైకాపా వారి చేతిలో చనిపోయిన చంద్రయ్య కుటుంబ సభ్యుడికి ఇచ్చే ఉద్యోగాన్ని కూడా రాకుండా అడ్డుకున్నారు. మరోవైపు తమకు నాణ్యమైన కాఫీ ఇవ్వలేదని మండలిలో ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ శనివారం సభలో తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాగా..ఇదే సమావేశాల్లో మరో సంచలనమైన విషయం కూడా జరిగింది. మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య జరిగినప్పుడు అక్కడ ఉన్న సిఐ శంకరయ్య గురించి అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు ప్రస్తావించారని, ఆయన తనపేరును ఎలా ప్రస్తావిస్తారంటూ..సిఐ శంకరయ్య ముఖ్యమంత్రికి పరువునష్టం నోటీసులు పంపించారు. ఒక సిఐ స్థాయి వ్యక్తి..ముఖ్యమంత్రికే పరువు నష్టం నోటీసులు ఇచ్చారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సభలో ప్రస్తావించడం విశేషం. మొత్తం మీద..రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలకు వైకాపా రాకపోయినా..అధికారసభ్యులు ప్రతిపక్షకంటే..మిన్నగా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించింది. ఉమ్మడి రాష్ట్రంలోనూ, విభజిత రాష్ట్రంలోనూ..ఎప్పుడూ ఇటువంటి సంఘటనలు జరిగిన దాఖలాలు లేవు.
Comments
- 2025-09-27 09:45:55
- GV Naidu
Any how no opposition in the assembly it is appreciable to raise the defects of Govt by TDP members.But Balaiah behaviour is deteriate his image and Lt leads to caste struggles
M