వీళ్లిద్దరూ చాలు...!
నిన్న అసెంబ్లీలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు రాజకీయ, సినీవర్గాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. బిజెపి ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ గత జగన్ పాలనలో సినీ నటులను ఆయన ఎలా అవమానించింది..చెబుతూ..చిరంజీవిని, ఇతర సినీ ప్రముఖులను అవమానించిన విధానం గురించి సభలో వివరించారు. అయితే..దీనిపై బాలకృష్ణ జోక్యం చేసుకుంటూ..కామినేని చెప్పేది సరికాదంటూ..అప్పట్లో జగన్మోహన్‌రెడ్డిని ఎవరూ గట్టిగా నిలదీయలేదని, ఆయన చెప్పేదంతా తప్పనట్లు మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాజీ సిఎం జగన్మోహన్‌రెడ్డిని ఉద్దేశించిన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఒక సీనియర్ ఎమ్మెల్యే అయి ఉండి ఈ విధంగా మాట్లాడవచ్చునా..? ఇది సరైనా..అనే భావన అధికార కూటమిలోనే వ్యక్తం అవుతున్నాయి. బాలకృష్ణ తీరు సరిగా లేదని, ఆయన వల్ల కూటమి నేతలకు ఇబ్బందులు వచ్చాయనే భావన వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌కు దీని వల్ల ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. కూటమిలో చిరంజీవి తమ్ముళ్లు ఇద్దరూ పనిచేస్తున్నారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సిఎంగా, ఆయన సోదరుడు నాగబాబు ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో చిరంజీవిని చిన్నబుచ్చే మాటలు బాలకృష్ణ మాట్లాడడం కూటమిలో ఇబ్బందులకు కారణం అవుతున్నాయి. ఇప్పటికే కులచిచ్చు పెట్టడానికి వైకాపా ఎన్నో ఎత్తులు వేస్తోన్న సందర్భంలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు వారికి కలిసివచ్చేలా ఉన్నాయి. నిన్న బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను ఇప్పడు వైకాపా మీడియా వాటంగా వాడేసుకుంటోంది. చిరంజీవిని అనరాని మాటలు అన్నారంటూ..ఈ పార్టీ మీడియా బ్యానర్‌లో వేసేసింది. అంతేనా..తన సోషల్ మీడియాను రంగంలోకి దించి బాలకృష్ణ, చిరంజీవి అభిమానుల మధ్య చిచ్చురేపుతోంది. దీంతో..ఇప్పుడు కూటమిలో కుంపటి రగిలినట్లే అయింది. బాలకృష్ణ చిరంజీవిని ఉద్దేశించిన చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ నాగబాబు కనుక స్పందిస్తే..పరిస్థితి మరింత విషమం అవుతుంది. అసలే నాగబాబుకు, బాలకృష్ణకు మధ్య తీవ్రమైన విభేదాలు ఉన్నాయి. ఒకరంటే ఒకరికి పడదు. గతంలో ఇదే నాగబాబు బాలకృష్ణ గురించి చాలా అనుచితంగా మాట్లాడారు. అప్పట్లో..దీనిపై బాలకృష్ణ అభిమానులు, మెగా అభిమానులు ఒకరిపై ఒకరు కత్తులు నూరుకున్నారు. తాజాగా ఇప్పుడు బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు మరోసారి వారి మధ్య గొడవకు కారణమయ్యేలా ఉన్నాయి. మొత్తం మీద కూటమిలో కుంపటి పెట్టడానికి బాలకృష్ణ, నాగబాబులు సరిపోతారు. జగన్ ఎటువంటి ప్రయత్నాలు చేయకుండానే కూటమిలో చిచ్చు రేగేటట్లు ఉంది. కాగా..ఇప్పుడు బాలకృష్ణ వ్యాఖ్యలపై నాగబాబు ప్రతిస్పందించలేదు. ఆయన మాట్లాడకుంటే..ఇది సమిసిపోయే అవకాశం ఉంది. చూద్దాం ఏమవుతుందో..?