అలుగుతున్న ఐఏఎస్‌లు...!?
రాష్ట్రంలో పనిచేస్తోన్న కొందరు అఖిల భారత సర్వీసులు అధికారులు తాము కోరుకున్నవిధంగా పోస్టింగ్ రాలేదని ప్రభుత్వంపై అలకపూనినట్లు ప్రచారం జరుగుతోంది. ఇలా అలుగుతోన్న అధికారుల్లో సీనియర్లతో పాటు జూనియర్లు కూడా ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తమకు ఇస్తానన్న పోస్టింగ్ ఇవ్వలేదని, ప్రాధాన్యత లేని పోస్టు ఇచ్చారని కొందరు, తమకు ప్రాధాన్యత ఇవ్వకుండా, వేరే అధికారులకు పోస్టింగ్ ఇచ్చారని మరి కొందరు ప్రభుత్వ పెద్దలపై అలకబూనుతున్నారట. ముఖ్యంగా జూనియర్ అధికారుల్లో కలెక్టర్ పోస్టింగ్‌లు కోసం చాలా మంది ప్రయత్నించారు. అయితే..కొందరికి మాత్రమే కలెక్టర్ పోస్టులు దక్కగా మిగిలిన వారు చిన్నబుచ్చుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చాలా మంది యువ ఐఏఎస్ అధికారులకు కలెక్టర్లగా అవకాశం ఇచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా ఇదే విషయాన్ని కలెక్టర్ల సమావేశంలో తెలిపారు. యువతకు ప్రాధాన్యత ఇచ్చానని, యువతపైనే తాను నమ్మకం పెట్టుకున్నానని, తన నమ్మకాన్ని నిలబెట్టాలని ఆయన సూచించారు. అయితే..కలెక్టర్ పోస్టులు రాని యువ ఐఏఎస్‌లు తమనెందుకు పట్టించుకోలేదని అంతరంగికుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ముఖ్యంగా కేంద్రంలో ఎంపానెల్‌మెంట్ కోసం ప్రయత్నించే అధికారులు..మరింత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. రెండేళ్లు కలెక్టర్లగా పనిచేస్తేనే కేంద్ర సర్వీసులకు వెళ్లే అవకాశం ఉంటుందనే నిబంధన ఉందని, దాంతో ముందుగా కలెక్టర్‌గా రెండేళ్లు పూర్తి చేయాలనే ఆలోచనతో వారు ఉన్నారు. కాగా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించే ఓ శాఖకు సంబంధించిన అధికారి ఈ విషయంపైనే తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. ముఖ్యమంత్రి కార్యాలయ అధికారి ఒకరు తనకు కలెక్టర్ పోస్టు రాకుండా అడ్డుకున్నారని, ఆయన వల్లే తనకు కలెక్టర్ పోస్ట్ మిస్ అయిందనే భావనతో ఆయన ఉన్నారట. ఆయన వలే మరి కొంత మంది కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారట. మరోవైపు కొందరు సీనియర్ ఐఏఎస్ అధికారులు కూడా అలకపాన్పు ఎక్కారని ప్రచారం జరుగుతోంది. తాము కోరుకున్నపోస్టులు ముఖ్యమంత్రి ఇవ్వలేదని, తమను ఎందుకు అప్రాధాన్యత పోస్టుకు పంపించారనే అసంతృప్తి వారిలో ఉందట. మొత్తం మీద..సీనియర్లు, జూనియర్లనే తేడా లేకుండా ప్రభుత్వ పెద్దలపై సదరు ఐఏఎస్‌లు కినుకతో ఉన్నారట.