“GST 2.0 ప్రభావం… క్యూలలో కార్ల కొనుగోళ్లు”

23, Sep 2025

దేశవ్యాప్తంగా GST 2.0 అమలైన మొదటి రోజునే కార్ల వినియోగదారుల్లో ఉత్సాహం స్పష్టంగా కనిపించింది. ఆటోమొబైల్‌ షోరూమ్‌ల ముందు పెద్ద క్యూలు కనిపించాయి. కొత్త పన్ను విధానంతో ధరలు తగ్గుతాయన్న భావ‌న‌తో కస్టమర్లు ఉదయం నుంచే డీలర్‌షిప్‌ల వద్దకు చేరుకున్నారు. ముఖ్యంగా హ్యుందాయ్‌, మారుతి, టాటా మోటార్స్‌ వంటి ప్రముఖ కంపెనీల షోరూమ్‌లలో అసాధారణ రద్దీ నమోదైంది. హ్యుందాయ్‌ ఒక్కరోజులోనే 11 వేల డీలర్‌ బిల్లింగ్స్‌ చేస్తూ ఐదు సంవత్సరాల తర్వాత అత్యధిక రికార్డు సాధించింది. టాటా మోటార్స్‌ దాదాపు 10 వేల కార్లు డెలివరీ చేయగా, మరో 25 వేలకుపైగా కస్టమర్‌ విచారణలు నమోదైనట్లు సమాచారం. వినియోగ‌దారుల్లో చిన్న కార్లపై ఎక్కువ ఆసక్తి కనిపించింది. GST స్లాబ్‌ మార్పుల కారణంగా ధరలు గణనీయంగా తగ్గడంతో మధ్యతరగతి వినియోగదారులు ముందుగానే బుకింగ్‌లు పూర్తి చేసుకున్నారు. “మేము కొనుగోలు చేసిన కారు మీద దాదాపు లక్ష రూపాయల వరకూ ఆదా అయ్యింది. ఈ GST 2.0 నిజంగా పండుగలా అనిపిస్తోంది” అని ఒక కస్టమర్‌ ఆనందం వ్యక్తం చేశారు. మొదటి రోజే ఇంత ఉత్సాహం కనిపించడంతో రాబోయే రోజుల్లో మరింత డిమాండ్‌ పెరిగే అవకాశం ఉందని డీలర్లు అంచనా వేస్తున్నారు. త‌న 32 సంవ‌త్స‌రాల స‌ర్వీసులో కార్ల కోసం ఇంత‌టి డిమాండ్ ఎప్పుడూ చూడ‌లేద‌ని ఒక షోరూమ్ నిర్వ‌హ‌కుడు అన్నారు.  ఇది చాలా ఆశ్చ‌ర్య‌క‌రంగా, సంతోష‌క‌రంగా ఉంద‌న్నారు. త‌మ షోరూమ్‌కు దాదాపు 80వేల మంది విచార‌ణ కోసం వ‌చ్చార‌ని, తాము దాదాపు 25వేల కార్ల‌ను అమ్మామ‌ని మారుతీ డీల‌ర్ ఒక‌రు  తెలిపారు. 


(0)
(0)

Comments