‘తల్లికివందనం’ సూపర్..డూపర్ హిట్...!
గత ఎన్నికలకు ముందు కూటమి ఇచ్చిన హామీల్లో ప్రధాన హామీ ‘తల్లికివందనం’. ఈ హామీ మహిళా ఓటర్లను కూటమి వైపు మళ్లించేందుకు ఉపయోగపడిందనే రాజకీయవిశ్లేషణలు ఉన్నాయి. తాము అధికారంలోకి వస్తే.. బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏటా రూ.15వేలను ఇస్తామని అప్పట్లో టిడిపి అధినేత చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. గతంలో జగన్ ప్రభుత్వం బడికి వెళ్లే విద్యార్థికి రూ.15వేలు ఇస్తామని, అధికారంలోకి వచ్చిన తరువాత కుటుంబంలో ఒకరికి మాత్రమే అమ్మ ఒడి పేరిట రూ.13వేలు ఇచ్చింది. అయితే చంద్రబాబు తాము అధికారంలోకి వస్తే..బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి రూ.15వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఆయన హామీని నమ్ముతూ ప్రజలు ఆయన కూటమికి బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చి గెలిపించారు. అయితే..ఆయన గెలిచి ఏడాది అవుతున్నా ‘తల్లికివందనం’ అమలు చేయలేదని ప్రతిపక్ష జగన్ పార్టీ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేస్తోంది. చంద్రబాబు మోసగాడని, ఆయన మాటలు నమ్మవద్దని ముందే చెప్పామని, ఆయన ‘తల్లికివందనం’ అమలు చేయరని, నీకు రూ.15వేలు..నీకు రూ.15వేలు..నీకు రూ.15వేలు అంటూ..జగన్ చంద్రబాబు గత ఏడాదిగా ఎద్దేవా చేస్తూ వచ్చారు. అయితే..జగన్ ఎంత రెచ్చగొట్టినా..ఎద్దేవా చేసినా, ఎగతాళి చేసినా, విమర్శించినా చంద్రబాబు పట్టించుకోలేదు.
ఈ పథకం అమలుకు భారీగా నిధులు కావాల్సి ఉండడంతో...ప్రస్తుత ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని చూసినా..ప్రభుత్వం ఇప్పట్లో ఈ హామీని నిలబెట్టుకోలేదేమో అనే అనుమానాలు తటస్తుల్లో కూడా వ్యక్తం అయ్యాయి. అయితే..అందరి అంచనాలను తలకిందులు చేస్తూ..ఈ నెల 12వ తేదీనే..పథకాన్ని అమలు చేస్తున్నామని, దీని కోసం రూ.8745కోట్లు విడుదల చేస్తున్నామని ముఖ్యమంత్రి ప్రకటించారు. అయితే అదంతా మోసమని, చంద్రబాబు అమలు చేయరని జగన్ పత్రిక తాటికాయలంత అక్షరాలతో వార్తలను ప్రచురించింది. 30లక్షల మంది విద్యార్థులకు ‘తల్లికివందనం’ ఎగగొట్టారని, రూ.13వేలే ఇస్తున్నారని, అదీ ఇవ్వరని, అప్పుడు కొంచెం..అప్పుడు కొంచెం ఇచ్చి..మమ అనిపిస్తారని, చంద్రబాబుకు చిత్తశుద్ధిలేదని, ఆయన ప్రజలను మోసం చేస్తున్నారని జగన్ మీడియాతోపాటు కొందరు మేధావులు ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. అయితే..ప్రభుత్వం వైపు నుంచి కూడా కొంత సమాచారలోపమో..లేక వ్యూహాత్మకమో తెలియదు కానీ..ఈ పథకం విషయాన్ని ఎక్కడా బయటకు రాకుండా జాగ్రత్తపడింది. ఒక్కసారిగా ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి ప్రెస్‌మీట్ పెట్టి, నిధులు విడుదల చేశారు. అయితే..వారు నిధులు విడుదల చేసినా..అప్పటికప్పుడే నిధులు విద్యార్థుల తల్లిదండ్రుల ఎకౌంట్‌లోకి రాకపోయేసరికి..మళ్లీ వైకాపా నేతలు విమర్శల వర్షం కురిపించారు. చంద్రబాబు మోసగాడని, అక్కడ నిధులు లేవని కేవలం జీవోలు మాత్రమే ఇచ్చారని..సొమ్ములు రావని సోషల్‌మీడియా, ప్రధాన మీడియాల్లో ప్రచారాన్ని ప్రారంభించారు. అయితే..వీరు ఎంత ప్రచారం చేసినా..ప్రభుత్వం మాత్రం పట్టించుకోలేదు. చేతల ద్వారానే ప్రభుత్వం తాను చేస్తోంది రుజువు చేసింది. నిన్న నిధులు విడుదల చేస్తే..నేడు లబ్దిదారుల ఎకౌంట్లల్లో నిధులు జమ అవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా..ఇదే సందడి..నీకు ఎంత పడింది..? అంటే..నీకు ఎంత పడింది..? ఒక్కో ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే రూ.26వేలు జమవుతున్నాయి. ముగ్గురు ఉంటే రూ.39వేలు..నలుగురు ఉంటే రూ.52వేలు ఇలా ఎంత మంది ఉంటే అంత మందికి రూ.13వేల చొప్పున జమ అవుతున్నాయి. దీంతో..ఒక్కసారిగా నిధులు పొందిన వారిలో ఎక్కడ లేని ఆనందం,ఉత్సాహం, సందడి నెలకొంది. నిన్నటిదాకా అనుమానించిన వారే..ఇప్పుడు జైజేలు కొడుతున్నారు. జగన్‌లా కాకుండా కుటుంబంలో ఎంత మంది చదువుకునేవాళ్లు ఉంటే..అంత మందికి ఇవ్వడం హర్షం వ్యక్తం అవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో దీనిపైనే చర్చించుకుంటున్నారు. ఖచ్చితంగా..పాఠశాలలు తెరిచిన రోజే..సొమ్ములు రావడం..ప్రజల్లో ఈ ఆనందం మరింత రెట్టింపైంది. పాఠశాలలు తెరిచినప్పుడు పిల్లల ఫీజుల కోసం, పుస్తకాలు, డ్రస్సులు, ఇతర అవసరాల కోసం ఈ సొమ్ములు బాగా ఉపయోగపడుతున్నాయని తల్లులు చెబుతున్నారు. గతంలో జగన్ సంక్రాంతి నాడు ఈ నిధులను ఇచ్చేవారని సెలవుల్లో తండ్రులు ఈ నిధులతో కోడిపందాలు ఆడేందుకు, మద్యం తాగేందుకు వినియోగించేవారు. దీంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరేది కాదు. అయితే..ఇప్పుడు పాఠశాలలు తెరిచిన వెంటనే తల్లులకు నిధులు రావడంతో..పిల్లల అవసరాలు తీరుస్తున్నారు.
ఎంతచేసినా..విమర్శలు...!
కాగా తల్లికివందనం పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి సక్సెస్ చేసినా కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా వైకాపా 30లక్షల మందికి ఎగగొట్టారనేది. ఈ విమర్శ అర్థం లేనిదే..! సమాజంలో ఆర్థికంగా అట్టడుగున్న ఉన్న విద్యార్థులను ఆదుకోవాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ధనికులు, టాక్స్‌పేయర్స్, ఉన్నతాధికారులు, ఉద్యోగులు, వ్యాపారస్థులు తదితర వర్గాలు ఈ 30లక్షల మందిలో ఉన్నారు. ఇటువంటి వారికి ఈ పథకాన్ని అమలు చేయాల్సిన అవసరమే లేదు. పైగా ఈ నిబంధనలను..గతంలో వైకాపా అమలు చేసినవే. వారు పెట్టిన నిబంధనలనే యధాతథంగా అమలు చేస్తున్నారు. ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయలేదేమో..దానిపై రాజకీయ లబ్ది సాధించాలను కున్న జగన్‌కు ఈ పథకాన్ని టిడిపి కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా అమలు చేస్తూ ఆయనకు షాక్ ఇచ్చింది. అదే విధంగా రూ.2వేలు తగ్గించడంపై కూడా విమర్శలు వస్తున్నాయి. గతంలో జగన్ రూ.2వేలు తగ్గించి ఆ నిధులను ఎవరికి ఇచ్చారో..తెలియదు. కానీ..ఇప్పుడు రెండు వేలు నేరుగా ఆయా జిల్లాల కలెక్టర్ల ఎకౌంట్‌లో వేస్తున్నారు. దీంతో..ఆయా పాఠశాలల నిర్వహణ, మరుగుదొడ్ల నిర్వహణ, ఇతర అవసరాలకు కలెక్టర్లు వాటిని వాడుతారు. కాగా.. నిధులు లబ్దిదారులకు వెంటనే చేరకపోవడంపై కూడా వైకాపా నేతలు, కార్యకర్తలు, సానుభూతిపరులు 24గంట్లో శునకానందం పొందారు. అయితే.. నిధులను ఆయా ఎకౌంట్ల నుంచి రిజర్వ్‌బ్యాంక్‌కు వెళ్లి రావడానికి కనీసం 24 గంటలు పడతాయని, అందుకే సొమ్ముల లబ్దిదారుల ఎకౌంట్‌లో పడడం ఆలస్యం అయిందని అధికారులు చెప్పారు. సోమవారం నాటికి దాదాపు అందరు తల్లుల ఎకౌంట్‌లో నిధులు జమ అవుతాయని, దీనిలో ఎటువంటి సందేహం లేదని వారు చెబుతున్నారు. మరోవైపు జూలై5వ తేదీ వరకూ తల్లికివందనం నిధులు అందవని చేస్తోన్న ప్రచారం కూడా అవాస్తవమే. ఒకటవ తరగతి, 12వ తరగతి వారికి మాత్రమే ఈ నిధులు ఆలస్యంగా వస్తాయని అధికారులు అంటున్నారు. వారి అడ్మిషన్ ప్రక్రియ ఆలస్యం కావడమే దీనికి కారణం. మొత్తం మీద..అసలు అమలు చేయరని, అరాకొరా..ఇస్తారని జగన్ అండ్ కో చేసిన ప్రచారాన్ని ప్రభుత్వం, ప్రభుత్వ వర్గాలు తిప్పికొడుతూ.. తల్లికివందనం పథకాన్ని సూపర్‌డూపర్ హిట్ చేశారనే ప్రచారం సాగుతోంది. రాష్ట్రంలో ఇప్పుడు ఏ ఇంటికి వెళ్లినా దీనిపైనే చర్చ. మొత్తం మీద ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి, ఉన్నతాధికారులు నిద్రాహారాలు లేకుండా అనుకున్న సమయానికి తల్లికివందనం పథకాన్ని ప్రజలకు చేరవేయడంలో కృతకృత్యులయ్యారు.