జర్నలిస్టు కొమ్మినేనికి బెయిల్
జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. శుక్రవారం నాడు కొమ్మినేని బెయిల్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. భవిష్యత్తులో ఇటువంటి వ్యాఖ్యలు చేయవద్దని ఆయనను కోర్టు హెచ్చరించింది. బెయిల్ షరతులను కింది కోర్టు నిర్దేశిస్తుందని, షరతుల విధింపుల తరువాత ఆయనను విడుదల చేయాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. కాగా ఇటీవల సాక్షి టీవీ ఛానెల్‌లో చర్చ సందర్భంగా జర్నలిస్టు కృష్ణంరాజు మాట్లాడుతూ అమరావతి వేశ్యల రాజధానిగా ఉందని వ్యాఖ్యానించారు. దీన్ని యాంకర్‌గా ఉన్న కొమ్మినేని వారించకుండా.. ఆయనను ప్రోత్సహించారనే రాజధాని మహిళలు ఆయనపై కేసు పెట్టారు. ఈ కేసులో అమరావతి పోలీసులు ఆయనను అరెస్టు చేసి జైలుకు పంపించారు. ఇదే కేసులో కృష్ణంరాజును పోలీసులు మొన్న అరెస్టు చేశారు. వీరిద్దరి వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు నిరసన, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు.