ఇవేం పొడిగింపులు...!
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి అంటే దాదాపు ముఖ్యమంత్రి పదవితో సమానం. రాష్ట్ర ప్రభుత్వం తరుపున అధికార వ్యవహారాలన్నీ ఆయన పేరు మీదే జరుగుతాయి. ముఖ్యమంత్రి తరువాత అంత ప్రధాన్యత కలిగిన ఈ పోస్టు ఇటీవల కాలంలో..రాజకీయ, అధికార వర్గాల్లో చులకనైపోతోంది. ఒకప్పుడు నిజాయితీ కలిగిన ప్రతి ఐఏఎస్ తన చివరి సర్వీసు మజిలీ ఈ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవితో ముగించాలని ఆరాటపడుతుంటారు. దీని కోసం వారు తమ సర్వీసంతా నిజాయితీ, నిబద్ధతో పనిచేస్తారు. అయితే..ఇటీవల కాలంలో ఈ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి రాజకీయ జూదంగా మారిపోయింది. ఈ పదవిలో ఉన్నవారు..అధికారంలో ఉన్న పార్టీ ప్రయోజనాలను కాపాడడమే ధ్యేయంగా పనిచేస్తున్నారు. అంతేనా..ఆయా పార్టీలకు ఊడిగం చేయడానికి కూడా వీరు వెనుకాడడం లేదు. తమకు నచ్చిన రాజకీయ పార్టీలకు ఎన్నికల ఫండ్లు కూడా ఇప్పిస్తున్నారు. దీని ద్వారా వారు ఆర్థికంగా వేల కోట్లు కొల్లగొట్టారనే ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నారు. ఇలాంటి వారి వల్ల ఈ పదవికి వన్నె తగ్గిపోతుందనే భావన పలు వర్గాల్లో వ్యక్తం అవుతోంది. అయితే..ఇలాంటి వారిని ఆయా ప్రభుత్వాలు తమ రాజకీయ, స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నాయి. ముందుగానే ఫలానా ఐఏఎస్‌ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తామని ఎన్నికల ముందే హామీలు ఇచ్చి తరువాత వారిని ఆ పదవిలో కూర్చోబెట్టుకుని తమ ప్రయోజనాలను కాపాడుకుంటున్నాయి. అంతేనా..వారు రిటైర్ అయినా..తరువాత సర్వీసు పొడిగింపులు ఇచ్చి..వారిని ప్రోత్సహిస్తున్నారు. ఇటీవల కాలంలో..ఈ సర్వీసు పొడిగింపులు ఒక రివాజుగా మారిపోయాయి. ఎవరైతే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉంటున్నారో..వారికి మూడు నెలలు, ఆరు నెలలు..కొన్ని చోట్ల అయితే..ఏడాది, రెండున్నర ఏళ్లుగా పొడిగింపులు ఇస్తున్నారు.
తాజాగా ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న విజయానంద్ సర్వీసును ప్రభుత్వం పొడిగించింది. ఆయన గత నెల 30న రిటైర్ అయితే..ఆయన సర్వీసును మరో మూడు నెలలు పొడిగిస్తూ కేంద్రంలోని డిఓపిటి ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో..ఆయన వచ్చే ఏడాది ఫిబ్రవరి ఆఖరి వరకూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తారు. ఇలా సర్వీసులను పొడిగించుకుంటూ పోతే..అర్హులైన కొందరు ఐఏఎస్ అధికారులకు తీరని అన్యాయం జరుగుతుంది. గతంలో ఐఏఎస్ అనే పదానికి అర్థం చెప్పిన శంకరన్ సేవలను అప్పటి ప్రభుత్వం వాడుకోవాలని భావించి ఆయన సర్వీసును పొడిగిస్తామని అంటే..అది సరికాదు..తన వల్ల ఇంకో ఐఏఎస్ అధికారికి అన్యాయం జరుగుతుందని, ఇలా చేయవద్దని అప్పటి ముఖ్యమంత్రికి శంకరన్ సూచించారట. తమ సర్వీసులను వాడుకోవాలంటే..వేరే రకంగా వాడుకోవాలి కానీ..ఇలా కాదని అన్నారట. అయితే ఇలా సర్వీసుల పొడిగింపు ప్రధాని మోడీకి ఇష్టం లేదంటారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక అధికారికి సర్వీసు పొడిగింపు కోరితే..ఇలాంటి బేరాలు వద్దు..అంటూ మోడీ ఘాటుగా స్పందించారంటారు. అయితే...తరువాత ఇదే మోడీ తన స్వార్థ ప్రయోజనాల కోసం ఉత్తరప్రదేశ్‌లో దుర్గాశంకర్ మిశ్రా అనే అధికారికి ఒకటి కాదు..మూడుసార్లు పొడిగింపును ఇచ్చారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మిశ్రా రిటైర్ అయ్యే ఆఖరి రోజు ఆయన సర్వీసును పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. సరే ఎన్నికలు ఉన్నాయనుకున్నా..తరువాత అదే అధికారికి రెండున్నర సంవత్సరాలు సర్వీసును పొడిగించారంటే..ఈ ప్రభుత్వాలను ఏమనాలి. తొలుత 2021లో ఆరు నెలలు, తరువాత 2022లో ఏడాది తరువాత మరికొన్నాళ్లు మొత్తం మీద..ఈ అధికారికి రెండున్నర సంవత్సరాల పాటు సర్వీసును పొడిగించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కొనసాగించారు.
ఇలా ఒకే అధికారికి రెండేళ్లు సర్వీసు పొడిగిస్తే..ఆయన తరువాత స్థానంలో ఉన్నవారికి ఎంత అన్యాయం జరిగింది..? దీనికి ఎవరు బాధ్యులు. ఉత్తరప్రదేశ్‌లోనే కాదు..మన పొరుగు రాష్ట్రం తెలంగాణలోనూ ఇదే రీతిలో జరుగుతోంది. ఇప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న రామకృష్ణారావు సర్వీసును ఏడాదిపాటు ప్రభుత్వం పొడిగించింది. వాస్తవానికి ఆయన ఏప్రిల్ 2025న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. అయితే తరువాత 2025 ఆగస్టులో ఆయన పదవీ కాలాన్ని ఏకంగా 2026 మార్చి 31వరకూ పొడిగించింది. ఇలా జరగడం చాలా అరుదు. సర్వీసు పొడిగింపు ఇవ్వాలంటే..ముందుగా మూడు నెలలు..తరువాత మరో మూడు నెలలు..ఇలా ఇచ్చుకుంటూ పోతారు..తప్ప ఒకేసారి ఏడు నెలలు సర్వీసు పొడిగించడం..విచిత్రం. ఈ పొడిగింపు కేంద్రంలోని డిఓపిటి ద్వారానే వచ్చేసింది. విజయానంద్ సర్వీసు పొడిగింపు వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర ఐఏఎస్‌ల్లో చర్చకు కారణమవుతోంది. ఇలా ప్రతిసారి పొడిగించుకుంటూ పోతే..మిగతా వారికి అన్యాయం జరుగుతుందనే వాదన వారిలో ఉంది. ఇప్పుడు విజయానంద్‌కు ఇచ్చారు....ఇప్పటికే మార్చి నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన సాయిప్రసాద్‌కు కూడా పొడిగింపు ఇస్తారు..ఇలా ఇచ్చుకుంటూ పోతే..ఎలా..అనే ప్రశ్న ఆ వర్గాల ద్వారా వ్యక్తం అవుతోంది. ఇప్పుడు విజయానంద్, రేపు సాయిప్రసాద్, తరువాత..ఇంకెవరో..? ఇటువంటి పద్దతులు ప్రజాస్వామ్యానికి మేలు చేయవు.