జగన్ మారథాన్ ప్రెస్ మీట్...!?
మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి ఈరోజు తాడేపల్లిలో నిర్వహించిన పత్రికా విలేకరుల సమావేశం (ఎంపిక చేసిన కొందరు జర్నలిస్టులు మాత్రమే) రికార్డు సృష్టించింది. ఆయన నిర్వహించిన ఈ సమావేశం దాదాపు రెండున్నర గంటలపాటు సాగింది. పలు అంశాలపై ఆయన తమ పార్టీ విధానాలను, తాము చేసిన మంచి పనులను, ఇప్పుడు ప్రభుత్వం చేస్తోన్న అన్యాయాలను సుధీర్ఘంగా నిర్వహించారు. చాలా రోజుల తరువాత నిర్వహించిన ఈ సమావేశం మీడియా వర్గాలతో పాటు, ఇతర వర్గాలను ఆకర్షించింది. సచివాలయంలోని మీడియా సెల్‌లో మీడియా వర్గాలు ఈ పత్రికా సమావేశాన్ని ఆసక్తిగా తిలకించారు. దాదాపు రెండున్నర గంటల పాటు సచివాలయంలోని మీడియా సెల్‌లో పత్యక్ష ప్రసారం సాగింది. ఇలా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పత్రికా సమావేశాన్ని కూడా మీడియా సెల్‌లో చూపించరేమో..? ఎందుకో ప్రతిపక్ష నేత సమావేశానికి మీడియా అంత ప్రాధాన్యత ఇచ్చిందో తెలియదు. కొందరు మీడియా వ్యక్తులు దీనిపై ఆసక్తిని చూపించగా, మరి కొందరు మాత్రం విముఖత వ్యక్తం చేశారు. అయితే..కొందరు జర్నలిస్టులు మాత్రం ఆయన ఏమి చెబుతారో..అనేదాని ఆసక్తిని ప్రదర్శించారు. అయితే..పగవాడిని పంచాగం అడిగితే..పగలే పోతావు అని చెప్పినట్లు..జగన్ పత్రికా సమావేశంలో పరనింద, ఆత్మస్థుతి తప్ప ఇంకేమీ లేదు. తిరుమలలో జరుగుతోన్న లడ్డూ కల్తీ వ్యవహారాన్ని ఆయన చిన్నదొంగతనంగా చిత్రీకరించారు. టీటీడీ మాజీ ఛైర్మన్ సుబ్బారెడ్డి వద్ద పనిచేసిన వ్యక్తి నెల్లూరు టిడిపి ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి మనిషి అని..వారే కల్తీ చేస్తారు..వారే నిందలు వేస్తారంటూ..తిరుమల కల్తీ వ్యవహారాన్ని టిడిపిపైకే నెట్టేశారు. అదే విధంగా ఉద్యోగులపై అవాజ్యప్రేమ కురిపించారు. అధికారంలో ఉన్నప్పుడు వారికి కరివేపాకులా తీసేసిన ఆయన ఇప్పుడు కూటమి ప్రభుత్వం వారికి అన్యాయం చేస్తోందని, తమ హయాంలో 1వ తేదీనే జీతాలు ఇస్తే..ఇప్పుడు రెండు నెలలకు కూడా జీతాలు ఇవ్వడం లేదని, ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు రూ.30వేల కోట్లు ఉన్నాయని..వాటిని చెల్లించడం లేదని గుండెలు బాదుకున్నారు. ఈ రూ.30వేల కోట్లలో రూ.25వేల కోట్లు..జగన్ హయాంలోనివే..అయితే..ఆ విషయం చెప్పకుండా...ఉద్యోగులకు అన్యాయం జరుగుతుందని పెడబొబ్బలు పెట్టారు.
ఇక కల్తీ మద్యం విషయంలో జోగి రమేష్‌ని ఇరికించారట. అదే విధంగా..ప్రవేట్ మెడికల్ కళాశాలల విషయంలో, విద్యార్థులకు రావాల్సిన బకాయిల విషయంలోనూ..పదే పదే అర్థసత్యాలను వల్లించారు. మాచర్లకు చెందిన పిన్నెల్లి సోదరులు అమాయకులట. నోట్లో వేలేస్తే కొరకలేని వారట. వారిపై అక్రమ కేసులు పెట్టారట. రాష్ట్రంలో రెడ్‌బుక్ వెర్రితలలు వేస్తోందట..సూపర్‌సిక్స్ అమలు చేయలేదు..వాగ్థానాలను నిలబెట్టుకోకుండా గ్లోబల్ ప్రచారం చేస్తున్నారంటూ..విమర్శలు గుప్పించారు. మొత్తం మీద..జగన్మోహన్‌రెడ్డి ప్రెస్ మీట్ మారథాన్ రేస్‌లా గంటలు గంటలు సాగడం విశేషం. వాస్తవానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా సుదీర్ఘ ప్రెస్ మీట్‌లు నిర్వహిస్తుంటారు. అయితే..ఇప్పుడు ఆయనకు పోటీగా జగన్ కూడా సుధీర్ఘంగా ప్రసంగిస్తున్నారు. అయితే..గతంలో వలే..ఈ ప్రెస్ మీట్‌లో జగన్ పెద్దగా తడబడలేదు. ముందుగా బాగానే ప్రిపేర్ అయినట్లున్నారు. ఈసారి ఆయన ప్రెస్‌మీట్‌లో దళిత నేతలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన పక్కన తొలిసారి ఓ దళితనేతను కూర్చోబెట్టుకున్నారు. ముందుగా మాజీ మంత్రి పేర్నినాని ఆయన పక్కన కూర్చుంటే..ఆయనను పక్కకు పంపించి ఓ దళిత నేతను తన పక్కన కూర్చోబెట్టుకుని ప్రాధాన్యత ఇవ్వడం ఈ ప్రెస్‌మీట్‌లోని ఆసక్తికరమైన అంశం. జగన్ చెప్పేవాటిలో సగం నిజాలు..సగం అసత్యాలు ఉన్నా..ఎందుకో ఆయన ప్రెస్ మీట్‌పై రాజకీయ, మీడియా, అధికార వర్గాల్లో ఆసక్తి నెలకొంది. కాగా జగన్ సుధీర్ఘ ప్రెస్ మీట్‌పై ఓ జర్నలిస్టు మాట్లాడుతూ..ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారు..తరువాత ప్రతిపక్ష నేతలుగా మారినప్పుడు ఇలాంటి మారథాన్ ప్రెస్‌మీట్‌లు పెడుతుంటారని, గతంలో చంద్రబాబునాయుడు కూడా ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలానే సుధీర్ఘ ప్రెస్ మీట్‌లు నిర్వహించారని, ఇప్పుడు ఇది జగన్ వంతు అయిందని వ్యాఖ్యానించారు. మరోవైపు జగన్ ప్రెస్‌మీట్‌పై కొందరు వైకాపా నాయకులు వ్యాఖ్యానిస్తూ..ఇలాంటి ప్రెస్‌మీట్ తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ పెడితే..ఈ 11 సీట్లు వచ్చేవి కాదని అంతరంగిక సంభాషణల్లో వ్యాఖ్యానించారు.
తాజా కలంః మూడు రాజధానులపై మీ పార్టీ విధానం ఏమిటని ఓ జర్నలిస్టు జగన్‌ను ప్రశ్నించగానే.. ఇప్పటికే చాలా సమయం అయింది...ఇప్పుడు దాని గురించి వద్దులే..అంటూ లేచి వెళ్లిపోయారు.