రాజకీయనేతలు-వ్యక్తిగత సహాయకులు...!
అదేదో వెంకటేష్ సినిమాలో పిఏ గారి ఎమ్మెల్యే అంటూ..ఒక పాత్ర సంబోధిస్తుంది. అదేమిటి...? ఎమ్మెల్యేగారి పిఏ అని అనాలి కదా..అంటే..అదంతే.. అంటాడు.. ఎమ్మెల్యే పాత్రధారి. ఎందుకు ఇలా..అంటే..మా బొక్కలన్నీ పిఏలకే తెలుసు కనుక వారు ఆడమన్నట్లు ఆడాల్సిందే అంటాడు. అచ్చం ఇప్పుడు రాష్ట్రంలోని పలువురు ఎమ్మెల్యేలు, ఎంపిలు, ఐఏఎస్ అధికారులు, ఇతర అధికారులు దగ్గర పనిచేసే వ్యక్తిగత సహాయకులదే పెత్తనం. గత వైకాపా ప్రభుత్వంలోనూ వీళ్లదే హవా. అయితే..ఇటీవల కాలంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై కూటమి ప్రభుత్వం విచారణ జరిపిస్తుంటే.. దీనిలో నిందితులైన రాజకీయనాయకులతో పాటు, వారి వ్యక్తిగత సహాయకుల అక్రమాలు కూడా బయటకు వస్తున్నాయి. తాజాగా టీటీడీ కల్తీ లడ్డూ వ్యవహారంలో టీటీడీ మాజీ ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డితో పాటు, ఆయన పిఎ అప్పన్న పాత్ర ఉందనే విషయం బయటకు వచ్చింది. ఈ అప్పన్న వ్యవహారాలపై మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ అప్పన్న వై.వి.సుబ్బారెడ్డి పిఏ కాదని, ఆయన తెలుగుదేశం పార్టీ ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పిఏ అని మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్‌రెడ్డి చెబుతున్నారు. నిన్నటి మీడియా సమావేశంలో ఆయన అప్పన్న అనే వ్యక్తి సుబ్బారెడ్డి పిఏ కాదని, ఆయన వేమిరెడ్డికి దగ్గరి వాడని ఇప్పుడూ ఏపీ భవన్‌లో పనిచేస్తున్నారని, నెల నెలా వేమిరెడ్డి నుంచే అతను జీతం పొందుతున్నాడని వెల్లడించారు. అయితే..ఆయన చెప్పేది కొంత వరకూ నిజమే. ఇప్పుడు అప్పన్న అనే వ్యక్తి వేమిరెడ్డికి వ్యక్తిగతంగా సహాయకుడిగా ఉండవచ్చు. అయితే..అంతకు ముందు..తిరుమలలో లడ్డు కల్తీ జరిగినప్పుడు ఈ అప్పన్న అనే వ్యక్తి వై.వి.సుబ్బారెడ్డి వద్దే ఉన్నాడు. దాన్ని దాచిపెట్టి జగన్మోహన్‌రెడ్డి అప్పన్న వేమిరెడ్డి పిఏ అంటూ అలవోకగా అసత్యాలు చెప్పేస్తున్నారు.
వాస్తవానికి ఈ పిఏలు ఎవరి దగ్గరగా నిలకడగా ఉండరు. అధికారం మారినప్పుడు గతంలో మంత్రులు, ఎమ్మెల్యేలు దగ్గర పనిచేసిన వారు..అధికారంలోకి వచ్చిన పార్టీ నేతల వద్ద చేరతారు. దీనికి అధికారంలోకి వచ్చిన వారు కూడా సహకరిస్తారు. కొంత మంది అయితే..ఫలానే వ్యక్తే పిఏగా ఉండాలంటూ ముందే నిర్ణయం తీసుకుని అతనినే పెట్టేసుకుంటారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత..పాత వ్యక్తిగత సహాయకులను తీసుకోవద్దంటూ..ముఖ్యమంత్రి చంద్రబాబు పదే పదే చెప్పినా..ఎవరూ వినిపించుకోలేదు. కొందరు మంత్రులైతే..తెలంగాణకు చెందిన వారి కోసం పట్టుపట్టి ప్రత్యేక అనుమతి తీసుకుని తెప్పించుకున్నారు. ఇలా వారే ఎందుకంటే..వారికి ఉన్న అనుభవమే కారణం. ఏ ఫైల్‌కు ఎంత రేటు తీసుకోవచ్చు..ఎక్కడ అక్రమాలు చేయవచ్చు..ఎలా సంపా దించుకోవచ్చు...సంపాదించింది ఎలా దాచుకోవచ్చనేది వారికే తెలుసు కనుక వారి కోసం ఈ నాయకులు పట్టుపడుతుంటారు. అప్పన్న వ్యవహారంలాగా చాలా మంది మంత్రుల వద్ద, ఎమ్మెల్యేల వద్ద..ఇలాంటి వారే ఉన్నారు. గతంలో వైకాపా మంత్రుల, ఎమ్మెల్యేల వద్ద చేసిన వారు..ఇప్పుడు కూటమి మంత్రుల వద్ద పిఏలుగా, పిఎస్‌లుగా, ఓఎస్టీలుగా వెలగబెడుతున్నారు. వీరి వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తున్నా..ప్రభుత్వం మాత్రం వారిని తొలగించడానికి వెనకాడుతోంది. కాగా వైకాపాలో పిఏల వ్యవహారం మరీ గమ్మత్తుగా ఉంటుంది. ముందు సజ్జల రామకృష్ణారెడ్డి వద్ద పిఏగా చేసిన వ్యక్తి తరువాత విజయసాయిరెడ్డి చేరతారు..తరువాత అదే వ్యక్తి వై.వి.సుబ్బారెడ్డి వద్దకు..అలా రంగుల రాట్నంలా తిరుగుతూనే ఉంటారు. ఇలా ఎందుకంటే..అదో వ్యూహం..ఏదైనా అవినీతి, అక్రమాలు బయటకు వచ్చినప్పుడు పిఏల మీద ఏసేసి..అతను తమవద్ద లేడని, తమకు సంబంధం లేదని తప్పించుకోవడానికి ఇదో ఎత్తుట. మొత్తం మీద..ఇప్పుడు అప్పన్న వ్యవహారం మిగతా పిఏల వ్యవహారాలను బయటకు తెస్తోంది.