ఉద్యోగుల్లో అస‌హ‌నం...!

06, Dec 2025

రాష్ట్రంలోని కూట‌మి ప్ర‌భుత్వం త‌మ స‌మ‌స్యల ప‌రిష్కారం విష‌యంలో స‌రిగా స్పందించ‌డం లేద‌ని, జీతాలు స‌కాలంలో ఇవ్వ‌డం లేద‌ని, ఐఆర్‌, పెండింగ్ డిఏల విష‌యంలోనూ స‌రైన విధానాన్ని అనుస‌రించ‌డం లేద‌ని, ఎన్నిక‌లకు ముందు ఇచ్చిన వాగ్ధానాల‌ను నిలుపుకోవ‌డం లేద‌ని ఉద్యోగులు రాష్ట్ర ప్ర‌భుత్వంపై అస‌హ‌నాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. గ‌త జ‌గ‌న్ ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రించిన రీతిలోనే ఈ ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని కొంద‌రు ఉద్యోగులు అంటున్నారు. జ‌గ‌న్‌కూ..ఈ ప్ర‌భుత్వానికి పెద్ద‌గా తేడాలేద‌నే భావ‌న వారిలో ఇప్పుడిప్పుడే వ్య‌క్తం అవుతోంది. ముఖ్యంగా జీతాలు విష‌యంలోనూ, డిఏల విష‌యంలోనూ, ఐఆర్ విష‌యంలోనూ ఏమి మారింద‌ని వారు ప్ర‌శ్నిస్తున్నారు. జ‌గ‌న్ పాల‌న‌లో జీతాలు మొద‌టి తేదీ ఇవ్వ‌లేద‌ని, ఇప్పుడూ అదే విధంగా ఉంద‌ని వారు అంటున్నారు. ఈ నెల‌లో ఇప్ప‌టి వ‌ర‌కూ జీతాలు అంద‌లేద‌ని, కొన్నిశాఖ‌ల‌కు చెందిన ఉద్యోగుల‌కు మాత్ర‌మే జీతాలు వ‌చ్చాయ‌ని వారు చెబుతున్నారు. ముఖ్యంగా హెచ్ఓడీల్లో ప‌నిచేసే ఉద్యోగుల‌కు జీతాలు రాలేద‌ని, పోలీసు, టీచ‌ర్లుకు మాత్రం జీతాలు వ‌చ్చాయ‌ని చెబుతున్నారు. శ‌నివారం, ఆదివారం జీతాలు వ‌చ్చే ప‌రిస్థితి లేద‌ని, ఇక సోమ‌వార‌మే జీతాలు వ‌స్తాయో..లేదో తెలియ‌దంటున్నారు. కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌రువాత మొద‌టి ఆరు నెల‌లు స‌కాలంలోనే జీతాలు ఇచ్చార‌ని, త‌రువాత నుంచి ఇబ్బందులు పెడుతున్నారంటున్నారు. ఇప్పుడు ప్ర‌తి నెలా ఐదు లేదా ఆరు లేదా ప‌దో తేదీ వ‌ర‌కూ జీతాలు రావ‌డం లేదంటున్నారు. విచిత్ర‌మైన విష‌యం ఏమిటంటే జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో హెచ్ఓడీల్లో ప‌నిచేసే ఉద్యోగుల‌కు నెల‌లో మొద‌టివారంలోనే జీతాలు ఇచ్చేవార‌ని, టీచ‌ర్ల‌కు మాత్రం ఇబ్బందులు పెట్టార‌ని, ఇప్పుడు కూట‌మి ప్ర‌భుత్వం మాత్రం టీచ‌ర్ల‌కు ఠంచన్‌గా జీతాలు ఇస్తూ..  హెచ్ఓడీల‌కు మాత్రం జీతాలు ఆపేస్తుంద‌ని వారు చెబుతున్నారు.  జీతాలపై ఆధార‌ప‌డి జీవిస్తోన్న చాలా మంది ఉద్యోగులు నెల వారీ కిస్తీలు, ఇఎంఐలు, ఇత‌ర అవ‌స‌రాల‌కు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. గ‌తంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వమూ ఇదే విధంగా ఇబ్బంది పెట్టింద‌ని, ఇప్పుడు వీళ్లూ అంతే స్థాయిలో ఇబ్బంది పెడుతున్నార‌నే అస‌హ‌నం వారిలో వ్య‌క్తం అవుతోంది. జ‌గ‌న్ క‌నిపించే నియంత అయితే..వీరు క‌నిపించ‌ని నియంత‌ల్లా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఇద్ద‌రిలో పెద్ద‌గా తేడా లేద‌ని అంత‌రంగిక చ‌ర్చ‌ల్లో చెబుతున్నారు. ఎన్నో ఆశ‌ల‌తో చంద్ర‌బాబు ప్ర‌భుత్వాన్ని గెలిపించుకుంటే వీళ్లు మాత్రం త‌మ‌ను చుల‌క‌న‌గానే చూస్తున్నార‌ని వారు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. జ‌గ‌న్ ఉద్యోగుల‌తో పెట్టుకుని దానికి మూల్యం చెల్లించుకున్నాడ‌ని, వీళ్లు కూడా అదే విధంగా వ్య‌వ‌హ‌రిస్తే చ‌రిత్ర పున‌రావృతం అవుతందంటున్నారు. మొత్తం మీద అనుభ‌వ‌జ్ఙుడు అని చంద్ర‌బాబుని తెచ్చుకుంటే..ఆయ‌న కూడా జ‌గ‌న్ రీతిలో వ్య‌వ‌హ‌రిస్తున్నాడ‌ని, ఇది స‌రికాద‌ని వారు అంటున్నారు. 


(2)
(0)

Comments