నరేంద్ర మోడీ వారసుడు...నారా లోకేష్...!
రాయిటర్స్ సంచలన కథనం...!
టిడిపి విలీనంతోనే అది సాధ్యం...!
పిచ్చి కథనంగా కొట్టిపడేస్తోన్న టిడిపి వర్గాలు..!
ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ ఓ సంచలన కథనాన్ని ప్రచురించింది. భారత ప్రధాని నరేంద్రమోడీ వారసుడిగా తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు లేక..ఆయన తనయుడు నారా లోకేష్ అయ్యే అవకాశం ఉందని పేర్కొంది. 2029 నాటికి మోడీకి 79ఏళ్లు వస్తున్నాయి కనుక..ఆయన 2029లో మళ్లీ ప్రధాని అవరని, ఆయన స్థానంలో ప్రస్తుత హోంమంత్రి అమిత్‌షా లేక మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్రపడ్నవిస్‌లు ప్రధాని అయ్యే అవకాశం ఉందని, వాళ్లు కాకపోతే..ఇప్పుడు ఎన్‌డిఏలో కీలక భాగస్వామి అయిన టిడిపి అధినేత చంద్రబాబునాయుడు కానీ..లేదా ఆయన తనయుడు ఆంధ్రప్రదేశ్ మానవవనరులశాఖ మంత్రి నారా లోకేష్ ప్రధాని అయ్యే అవకాశం ఉందని ఒ సంచలన కథనాన్ని ప్రచురించింది. అయితే..ఈ కథనంపై పలు విమర్శలు వస్తున్నాయి. వాస్తవానికి రాయిటర్స్ వార్తా సంస్థ ప్రపంచంలోనే అత్యుత్తమైన వార్తా సంస్థగా పేరుగాంచింది. అయితే..ఈ సంస్థనుంచి వచ్చిన ఈ వార్తపై పలు విమర్శలు వస్తున్నాయి. వారు పేర్కొన్నట్లుగానే..మోడీ 2029లో ప్రధాని కాకపోతే..ఆయన స్థానంలో అమిత్‌షా ప్రధాని అవుతారనే అంచనాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. 2029 ఎన్నికల్లో బిజెపి మెజార్టీ స్థానాలు సాధిస్తేనే అది సాధ్యం అవుతుంది. ఇప్పటికే మూడుసార్లు వరుసగా కేంద్రంలో బిజెపి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు అయి కొనసాగుతోంది. అయితే..2029లో బిజెపి విజయం అంత సులభం కాదనే వాదనలు ఉన్నా..ఇటీవల కాలంలో ఆపార్టీ వరుసగా పలు రాష్ట్రాల్లో సంచలన విజయాలు సాధిస్తూ..ముందుకు సాగుతోంది. ఇదే రీతిలో ఈ మూడేళ్లూ కొనసాగితే..మరోసారి ఆ పార్టీ విజయం సాధించడం సులభమే. అయితే..మరోసారి బిజెపి విజయం సాధిస్తే..ఆ పార్టీ తరుపున మళ్లీ మోడీనే ప్రధాని అవుతారు. ఆయన ఇప్పటి వరకూ..ఎక్కడా తాను మరోసారి ప్రధాని పదవి చేపట్టనని కానీ, రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నానని కానీ ఎక్కడా పేర్కొనలేదు. ఈ పరిస్థితుల్లో ఆయన వారసుడి గురించి రాయటర్స్ కథనం ప్రచురించడంపై పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. వాస్తవానికి బిజెపిలో మోడీ తరువాత అమిత్‌షానే ప్రధాని అవుతారనే అంచనాలు మెండుగా ఉన్నాయి. ఒక వేళ ఆయన కాకపోతే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాధ్ దాస్ అవుతారనే భావన ఆ పార్టీతో పాటు, రాజకీయవర్గాల్లో ఉంది. అయితే..ఇప్పుడు రాయిటర్స్ వీరందరినీ కాదని ఎన్‌డిఎలో భాగస్వాములైన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కానీ ఆయన కుమారుడు కానీ ప్రధాని అవుతారని పేర్కొనడం సంచలనానికి కారణమైంది.
విలీనంతోనే అది సాధ్యం...!
ప్రధాని మోడీ వారసుడిగా చంద్రబాబు కానీ ఆయన కుమారుడు లోకేష్ అవుతారనే దాని వెనుకో దాగిన రహస్యం ఉందనే వారు ఉన్నారు. రాయిటర్స్ అన్యాపదేశంగా, అనాలోచితంగా ఆ వార్తను ప్రచురించలేదనే వాదన ఉంది. కొన్ని వర్గాలు ఇస్తోన్న సమాచారం ప్రకారం వచ్చే ఎన్నికల నాటికి టిడిపిని బిజెపిలో విలీనం చేయాలనే మోడీ కోరుతున్నారనే ప్రచారం ఉంది. దానిలో భాగంగానే ఇప్పుడు ఇలాంటి వార్తలను వదులుతున్నారని వారు అంటున్నారు. ఇటీవల కాలంలో చంద్రబాబుకు ఆయన కుమారుడికి దేశరాజధానిలో గతంలో ఎప్పుడూ లేనంత ప్రాధాన్యత దక్కుతోంది. వారు కూడా పదే పదే ఢిల్లీకి వెళ్లివస్తున్నారు. వారు అడిగిన పనులు కూడా వెంట వెంటనే జరిగిపోతున్నాయి. మోడీ ప్రభుత్వం వారిపై ఆధారపడినందువల్లే..ఇలా జరుగుతుందని చాలా మంది అనుకుంటున్నారు. కానీ...అక్కడ ఏదో జరుగుతుందని చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన వారు తమ సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తున్నారు. వారి వ్యాఖ్యలు ఇప్పుడు రాయిటర్స్‌లో వచ్చిన వార్తను బేరీజు వేసుకుంటే తెరవెనుక జరుగుతోన్నఅనుమానాలకు బలం చేకూరుతోంది. అయితే...చంద్రబాబు వంటి సీనియర్ రాజకీయవేత్త అంత తేలిగ్గా మోడీ బుట్టలో పడతారా..? అనే అనుమానాలు ఉన్నాయి. 2019-24 సమయంలో టిడిపిని బలవంతంగా బిజెపిలో విలీనం చేసుకోవడానికి మోడీ, అమిత్‌షాలు చేయని ప్రయత్నం లేదు. అయితే అప్పట్లో చంద్రబాబు మొండి ధైర్యం, క్యాడర్ కసి వల్ల అది సాధ్యపడలేదు. అప్పుడు బలవంతం కాని పనిని ఇప్పుడు సఖ్యతతో చేయబోతున్నారా..? అనే అనుమానాలు కొందరిలో వ్యక్తం అవుతున్నాయి. వాస్తవానికి దక్షిణాదిలో టిడిపికి గట్టిపట్టు ఉంది. బిజెపి అంటే ఇష్టపడే వర్గాలకు చెందిన ఓటర్లే టిడిపికి కూడా మద్దతు ఇస్తుంటారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ వర్గంలో గట్టి పట్టున్న చంద్రబాబు, లోకేష్‌లను బిజెపిలోకి చేర్చుకుంటే..దక్షిణాదిలో బిజెపికి తిరుగు ఉండదనే భావన బిజెపి పెద్దలో ఉంది. దానిలో భాగంగనే ఇప్పుడు మోడీ వారసుడు చంద్రబాబు, లోకేష్‌లు అంటూ..అంతర్జాతీయ వార్తా సంస్థల్లో ప్రచారాన్ని ప్రారంభించారు. ఏది ఏమైనా..మోడీ, షాల కపటినాటకంలో..చంద్రబాబు ఇరుక్కుని చరిత్రలో చేయకూడని తప్పు చేస్తారా...? లేక వారి కుటిలనాటకాలను తిప్పికొడతారో..కాలమే సమాధానం చెబుతుంది.