తెలుగు రాష్ట్రాల్లో జ‌ర్న‌లిస్టుల అక్రిడిటేష‌న్ గోల‌...!?

23, Dec 2025

రెండు తెలుగు రాష్ట్రాల్లో జ‌ర్న‌లిస్టు వ‌ర్గాల్లో అక్రిడిటేష‌న్ గోల న‌డుస్తోంది. దాదాపు రెండేళ్ల నుంచి రెండు రాష్ట్రాల్లో నూత‌నంగా ఎవ‌రికీ అక్రిడిటేష‌న్ మంజూరు చేయ‌లేదు. తెలంగాణ‌లో కెసిఆర్ ప్ర‌భుత్వం అధికారంలో ఉన్న‌ప్పుడు ఇచ్చిన కార్డుల‌నే పొడిగించుకుంటూపోతున్నారు. అదే ప‌రిస్థితి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనూ నెల‌కొంది. వై.ఎస్‌.జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు ఇచ్చిన కార్డుల‌నే ఇప్పుడూ కొన‌సాగిస్తున్నారు. నూత‌నంగా ఎన్‌డిఏ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చి దాదాపు రెండేళ్లు కావ‌స్తున్నా..ఇక్క‌డ పాత కార్డుల‌నే పొడిగించుకుంటూపోతున్నారు. ఇదిగో..అదుగో అంటూ కాలం గ‌డిపేస్తున్నారు. రాష్ట్ర స‌మాచార‌శాఖ మంత్రి పార్థ‌సార‌ధి జ‌ర్న‌లిస్టుల కార్డులు ఇస్తున్నామ‌ని..ప్ర‌తిసారి చెబుతుంటారు కానీ..అది వాస్త‌వ రూపం దాల్చ‌లేదు. అయితే..ఇటీవ‌ల కాలంలో దీనిపై కొంత క‌స‌ర‌త్తులు చేసి..అక్రిడిటేష‌న్ జీవోను విడుద‌ల చేశారు. త‌రువాత క‌మిటీల నియామ‌కం కోసం నోటిఫికేష‌న్ జారీ చేశారు. జ‌న‌వ‌రి ఆఖ‌రు నాటికి అంద‌రికీ అక్రిడిటేష‌న్‌లు మంజూరు చేస్తామ‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. 

అర్హ‌త లేని సంఘానికి రెండు క‌మిటీల్లో స్థాన‌మా..? 

అయితే..ఇప్పుడు ఈ క‌మిటీల గోల తారాస్థాయికి చేరింది. అర్హ‌త లేని యూనియ‌న్‌ల‌ను, సంఘాల‌ను క‌మిటీల్లో చొప్పించార‌ని, ఆయా యూనియ‌న్లను స‌ద‌రు సంఘాల నుంచి తొల‌గించాల‌ని మంత్రి పార్థ‌సార‌ధికి కొన్ని సంఘాలు ఫిర్యాదుచేశాయి. ఈరోజు మంత్రి మీట్ ది ప్రెస్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న సంద‌ర్భంలోనూ దీనిపై ఆయ‌న‌కు ఫిర్యాదులు వ‌చ్చాయి. అర్హ‌త లేని సంఘాల‌ను క‌మిటీల్లో నియ‌మించార‌ని, ఈ విష‌యంలో రాష్ట్ర స‌మాచార‌శాఖ డైరెక్ట‌ర్‌ను కొంద‌రు అధికారులు త‌ప్పుదోవ ప‌ట్టించార‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. వాస్త‌వానికి క‌మిటీల్లోకి నూత‌న సంఘాల‌ను చేర్చాల‌ని మంత్రి పార్థ‌సార‌ధి ముందే నిర్ణ‌యించారు. అయితే.. ఆయ‌నను, డైరెక్ట‌ర్‌ను త‌ప్పుదారి ప‌ట్టించార‌ని, జ‌ర్న‌లిస్టులే లేని సంఘం ఒక‌దానిని రెండు క‌మిటీల్లో నియ‌మించార‌ని, అదేమంటే లేబ‌ర్ డిపార్ట్‌మెంట్ గుర్తింపు ఇచ్చిన  సంఘాల‌నే క‌మిటీల్లో చేర్చామ‌ని అధికారులు చెబుతున్నారు. అయితే..ఇక్క‌డే.. అస‌లు మ‌త‌ల‌బు దాగి ఉంది. ఆ సంఘం ఇచ్చిన మెంబ‌ర్‌షిష్ జాబితానే..లేబ‌ర్ డిపార్ట్‌మెంట్ తిరిగి..స‌మాచార‌శాఖ‌కు పంపించింది. దాన్ని ప్ర‌మాణికంగా తీసుకుని ఆ సంఘానికి రెండు క‌మిటిల్లో స్థానం క‌ల్పించారు. వాస్త‌వానికి ఒకే వ్య‌క్తికి చెందిన ఒక యూనియ‌న్‌ను రెండు  క‌మిటీల్లోకి తీసుకున్నార‌నే విష‌యం స‌మాచార‌శాఖ డైరెక్ట‌ర్‌కు తెలుసా..?  లేదా అనే సందేహాలు వ్య‌క్తం అవుతున్నాయి. త‌మ‌కు జ‌రిగిన అన్యాయంపై ఇత‌ర సంఘాలు ఇప్పుడు కోర్టును ఆశ్ర‌యించాయి. కోర్టులో ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నిర్ణ‌యం వ‌స్తే..మ‌ళ్లీ నూత‌న అక్రిడిటేష‌న్ కార్డుల ప‌క్రియ ఆగిపోయిన‌ట్లే. 

తెలంగాణ‌లో రెండు ర‌కాల అక్రిడిటేష‌న్లు...!

కాగా తెలంగాణ‌లోనూ ఇదే గోల న‌డుస్తోంది. కెసిఆర్ ప్ర‌భుత్వం ఓడిపోయిన త‌రువాత అధికారంలోకి వ‌చ్చిన కాంగ్రెస్ ప్ర‌భుత్వం జ‌ర్న‌లిస్టుల అక్రిడిటేష‌న్ విష‌యంలో వింత ప‌ద్ద‌తిని పాటిస్తోంది. ఇప్పుడు అక్క‌డ రెండు ర‌కాలైన అక్రిడిటేష‌న్లు మంజూరు చేస్తామ‌ని ప్ర‌భుత్వం జీవో విడుద‌ల చేసింది. దీనిపై జ‌ర్న‌లిస్టు వ‌ర్గాలు మండిప‌డుతున్నాయి. జ‌ర్న‌లిస్టుల్లో చీలిక తేవ‌డానికే రేవంత్‌రెడ్డి ప్ర‌భుత్వం ఈ విధంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని వారు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ‌లో డెస్క్ జ‌ర్న‌లిస్టుల‌కో కార్డు, ఇత‌ర జ‌ర్న‌లిస్టుల‌కు మ‌రో కార్డును అందించాల‌ని జీవో తెచ్చింది. దీని ప్ర‌కారం డెస్క్ జ‌ర్న‌లిస్టుల‌కు బ‌స్సుపాస్‌లు, ఇత‌ర సౌక‌ర్యాలు ఉండ‌వ‌నే అభిప్రాయాలు ఉన్నాయి. వాస్త‌వానికి జ‌ర్న‌లిస్టుల‌పై ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి మండిప‌డుతున్నారు. ముఖ్యంగా యూట్యూబ్ మీడియాల‌పై ఆయ‌న ఇంతెత్తున లేస్తున్నారు. ఆ మ‌ధ్య ఆయ‌న ఒక స‌మావేశంలో మాట్లాడుతూ..ఎవ‌డు జ‌ర్న‌లిస్టో..ఎవ‌డు కాదో..తేల్చాల‌ని ఆయ‌న యూనియ‌న్ నేత‌ల‌ను కోరారు. ఆయ‌న మ‌నోభావాల‌ను అర్థం చేసుకున్న యూనియ‌న్ నేత‌లు ఇప్పుడు అక్రిడిటేష‌న్ల‌లో భారీగా కోత పెడుతున్నార‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. కాగా రేవంత్‌రెడ్డి ప్ర‌భుత్వం  తెచ్చిన ఈ జీవోపై 27వ తేదీ నుంచి ఆయా సంఘాలు అన్ని జిల్లాల క‌లెక్ట‌రేట్‌ల వ‌ద్ద ధ‌ర్నాలు చేస్తామ‌ని ప్ర‌క‌టించింది. మొత్తం మీద రెండు రాష్ట్ర ప్ర‌భుత్వాలు జ‌ర్న‌లిస్టుల అక్రిడిటేష‌న్ల విష‌యంలో..రెండేళ్ల నుంచి కాల‌యాప‌న చేస్తూ కాలం గ‌డిపేస్తున్నాయి. దీనిపై జ‌ర్న‌లిస్టు వ‌ర్గాల్లో..తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం అవుతోంది. 


(2)
(0)

Comments