వైసిపి డొల్ల ప్రచారం...!
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే..వైకాపా 200సీట్లతో గెలుస్తుందని ఆ పార్టీలో కీలకనేత సజ్జల రామకృష్ణారెడ్డి ఇటీవల చెప్పుకుంటున్నారు. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో సీట్ల సంఖ్య పెరుగుతుందని, దాంతో..200 సీట్లు వస్తాయని ఆయన సెలవిస్తున్నారు. రాష్ట్రంలోని ఎన్‌డిఏ ప్రభుత్వంపై ప్రజల్లో విపరీతమైన అసంతృప్తి ఉందని, జగన్ వల్లే తమకు లాభమని, చంద్రబాబు ఏమీ చేయడం లేదని, ఆయన పాలన బాగాలేదని మెజార్టీ ప్రజలు అంటున్నారని, పలు సర్వేలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని వైకాపా నేతలు, ఆ పార్టీ కార్యకర్తలు, కొందరు పెయిడ్ మేధావులు సోషల్ మీడియా వేదికగా రచ్చ రచ్చ చేస్తున్నారు. వాళ్లేనా.. ఆ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి కూడా అదే రీతిలో చెప్పుకుంటున్నారు. చంద్రబాబు పచ్చిమోసగాడని, ఆయన ఇస్తానన్న సూపర్ సిక్సూ లేదూ సెవనూ లేదంటూ..ఆయన చేతులు తిప్పుకుంటూ, అర్థనేత్రాలతో వల్లవేస్తున్నారు. వాళ్ల పార్టీ కార్యకర్తలదీ, సానుభూతిపరులదీ మరీ అరాచకం. ఎన్నికలు జరిగి వైకాపాకు 88 సీట్లలో మెజార్టీ వస్తోందనే మాట రాగానే రప్పా...రప్పా..నరికేస్తామంటూ..ఊరూ వాడా..ప్లెక్సీలను హోరెత్తిస్తున్నారు.
అయితే..రాష్ట్రంలో వారు అంచనా వేస్తోన్న పరిస్థితి ఉందా..? ప్రజల్లో ఇప్పుడున్న ఎన్‌డిఏపై అంత అసంతృప్తి, అసహ్యం వ్యక్తం అవుతోందా..? అంటే..సమాధానం లేదనే. కొన్ని వర్గాల ప్రజల్లో ప్రభుత్వంపై అసంతృప్తి, అసహనం ఉన్న మాట నిజమే. ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయలేదనే భావన ఉంది. ముఖ్యంగా టిడిపి కార్యకర్తల్లో, సానుభూతిపరుల్లో ఈ అసంతృప్తి తీవ్రంగా ఉందనేది కాదనలేని నిజం. దీన్నే వైకాపా మద్దతుదారులు అతిశయోక్తులు జోడించి చెబుతున్నారు. ఉద్యోగుల్లో సమయానికి జీతాలు రావడం లేదని, అమరావతి రైతులు తమకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చలేదని, రైతులకు గిట్టుబాటు ధరలు లభించడం లేదని, నిరుద్యోగులకు వెంటనే ఉద్యోగాలు రావడం లేదని, వ్యాపారాలు అంతగా లేవని వ్యాపారస్తులు, ఊరూరా బెల్ట్‌షాపుల వ్యవహారం మహిళల్లో అసంతృప్తిని పెంచుతోంది. అదే సమయంలో మహిళలకు ఇస్తానన్న రూ.1500 ఇవ్వకపోవడం, కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు అవినీతి, అరాచక వ్యవహారాలు ప్రజలకు ఇబ్బంది కల్గిస్తున్నాయి. అయితే...ఇవన్నీ ఇప్పటికిప్పుడు ఎన్‌డిఏని చిత్తుగా ఓడించే వ్యవహారాలు కావు. ప్రస్తుతానికి ప్రజలు మౌనంగానే ఉన్నారు. వాళ్లేమీ తమ అసంతృప్తిని కానీ, అసహనాన్ని కానీ ప్రదర్శించడం లేదు. ఆంధ్రా ప్రజలు ఎన్నికల వరకూ మౌనంగానే ఉంటారు. అవకాశం వచ్చినప్పుడు కర్రుకాల్చి వాతపెడతారు. అయితే...రెండేళ్ల ఎన్‌డిఏ పాలన వైకాపా తొలి రెండేళ్ల కంటే బ్రహ్మాండంగానే ఉందనే భావన మెజార్టీ ప్రజల్లో ఉంది.
151 సీట్లతో బ్రహ్మాండమైన మెజార్టీని అందించి జగన్మోహన్‌రెడ్డిని ప్రజలు ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టారు. అయితే..ఆయన వారి అంచనాలను వెంటనే తుంచేశారు. తొలి రెండేళ్లలోనే ఆయన ప్రజలకు దూరం అయ్యారు. తొలుత మూడు రాజధానులు, తరువాత ప్రభుత్వ కార్యాలయాలకు వైకాపా పార్టీ రంగులు, ప్రత్యర్థి పార్టీ నాయకుల హత్యలు, దాడులతో రాష్ట్రం రావణకాష్టంలా తయారైంది. చెత్తపన్ను, కరెంటు ఛార్జీల పెంపు, నాసిరకం మద్యం, చెత్త బ్రాండ్లు, ఇసుక ధరల పెంపు, కంపెనీల తరిమేత..ప్రతిపక్ష నాయకుడిపై దాడులు, ఇలా ఒకటా రెండా..? సవాలక్ష వ్యవాహారాలతో..ప్రజలు తొలి రెండేళ్లలోనే వైకాపా ప్రభుత్వాన్ని ఓడించాలనే బలమైన నిర్ణయానికి వచ్చారు. ఆ తరువాత మూడేళ్లలో వారి అసంతృప్తి, అసహనం, అసహ్యం పెరగిపోయిందే కానీ..ఏ మాత్రం తగ్గలేదు. దీంతో చివరకి వైకాపా 11 సీట్లకు పరిమితమైన తరువాతే..వారి ఆగ్రహం తగ్గలేదు. అయితే..ఇప్పుడా పరిస్థితి లేదు. ఈ రెండేళ్లలో వైకాపా ఉద్యమించే ఒక్క అవకాశం కూడా ఏన్‌డిఏ ప్రభుత్వం వారికి ఇవ్వలేదు. ఒక్క ప్రజా సమస్యపై వైకాపా ఉద్యమించడానికి అవకాశమే రాలేదు. చివరకు మెడికల్ కళాశాలల విషయంలో ఒక్క అవకాశం దొరికితే..దాన్ని కూడా జగన్ సద్వినియోగం చేసుకోలేకపోయారు. ఎవరైతే మెడికల్ కళాశాలలును తీసుకుంటారో వారిని జైల్లో వేస్తానని బెదిరింపులకు దిగడంతో..ఆయన సెల్ఫ్‌గోల్ వేసుకున్నారు. దీంతో దొరికిన అవకాశం కూడా పోయింది. మొత్తం మీద..వైకాపా రెండేళ్ల పాలన..ఎన్‌డిఏ రెండేళ్ల పాలన పోల్చుకుంటే..నక్కకూ నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని ప్రజలే అంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వైకాపా తనకు అలవాటైన డొల్ల ప్రచారానికి తెరతీసింది. ఈ ప్రచారం..వల్ల వారికి ఉపయోగం ఏమీ ఉండదు. జనంలో నవ్వులపాలవడం తప్ప.