జర్నలిస్టు అక్రిడిటేషన్ కమిటీల్లో అనర్హులు..!
సొమ్ములిస్తే దారినిపోయే దానయ్యే కమిటీ సభ్యుడు...!
పేరు పత్రికా సంఘంః సభ్యుడు మాత్రం ఎలక్ట్రానిక్ మీడియా..!
ఇదెక్కడి విడ్డూరమంటూ..విస్తుపోతోన్న అధికారులు...!
ప్రతిపాదించిన పేర్లను మార్చాలని సంఘాలకు మెస్సేజ్‌లు...!
స్పందించని సంఘ నేతలుఃఫోన్‌లో దొరకనివైనం...!
చివరకు వాట్సప్ మెస్సేజ్‌లు...! అయినా..అదే వైఖరి...!
వాయిదా పడుతోన్న అక్రిడిటేషన్ల మంజూరు వ్యవహారం...!
రాష్ట్రంలో ఎన్‌డిఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు కావస్తున్నా..జర్నలిస్టులకు ఇంత వరకూ అక్రిడిటేషన్ మంజూరు చేయలేకపోయింది. వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన కార్డులనే కొనసాగిస్తూ వస్తోంది. ప్రతి మూడు నెలలకు ఒకసారి గడువు పెంచుకుంటూ..రెండేళ్లు కాలం గడిపేశారు. జర్నలిస్టు వర్గాల్లో వస్తోన్న అసంతృప్తిని గమనించి చివరకు మొన్నా నడిమధ్య నూతన అక్రిడిటేషన్ జీవోను విడుదల చేశారు. తరువాత జర్నలిస్టు కమిటీల కోసం ప్రతిపాదనలు పంపారు. వివిధ యూనియన్లు, అసోషియేషన్ల నుంచి తమ ప్రతినిధులను ఎంపిక చేసి పంపాలని రాష్ట్ర సమాచారశాఖ ఆయా యూనియన్లకు లేఖలు రాసింది. దీనిపై కొన్ని సంఘాలు వారు అడిగిన 24 గంటల్లో ఎంపికను పూర్తి చేసి సమాచారశాఖకు పంపించేశారు. అయితే..కొన్ని సంఘాలు మాత్రం ఇంత వరకూ తమ ప్రతినిధులను ఎంపిక చేయకుండా అధికారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. రాష్ట్ర సమాచారశాఖ డైరెక్టర్ అక్రిడిటేషన్ వ్యవహారంపై సమీక్షలు, వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తూ పక్రియను వేగవంతం చేస్తుంటే..కొన్ని యూనియన్లు, అసోషియేషన్లు మాత్రం తమ ప్రతినిధుల పేర్లను ఇప్పటికీ ఇవ్వలేదు. కొన్ని సంఘాలు ఇచ్చినా..వారు చాలా విచిత్రంగా తమ ప్రతిపాదనలను పంపారు. పత్రికా సంఘంగా రిజిష్ట్రేషన్ చేసుకున్న యూనియన్లు తమ ప్రతినిధులుగా పత్రికల్లో పనిచేసేవారినే ప్రతిపాదించాలి. కానీ విచిత్రంగా ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తోన్న వారి పత్రికా సంఘం తరుపున ప్రతినిధులుగా ప్రతిపాదనలు పంపారు. దీనిపై సమాచారశాఖ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ..వారి ప్రతిపాదనలను తిరస్కరిస్తూ వారికి లేఖలు పంపారు. మీరు పత్రికా సంఘంగా అక్రిడిటేషన్ కమిటీలో ఎంపిక అయ్యారు..ఆ విభాగం నుంచే..ఎంపిక చేయాలని పదే పదే కోరుతున్నా సదరు సంఘాలు స్పందించడం లేదు. ముఖ్యంగా రెండు మూడు సంఘాలు..ఇలా వ్యవహరిస్తున్నాయి. దీనిపై అధికారులు వారికి ఫోన్ చేస్తున్నా..వారి ఫోన్ ఎత్తకుండా..దాట వేస్తున్నారు. అలా కాదని అధికారులు వారికి వాట్సప్ మెస్సేజ్‌లు పంపించినా..వారు స్పందించడం లేదు. దీనితో ఏమి చేయాలో అధికారులకు పాలుపోవడం లేదు. ఒకవైపు సమాచారశాఖ డైరెక్టర్ దీనిపై ప్రత్యేకంగా దృష్టిసారించి పరుగులు పెట్టిస్తుంటే..ఈ సంఘ నాయకులు మాత్రం తమ ప్రతిపాదనలను మార్చడం లేదు. కేవలం ప్రతిపాదనలే కాదు..ఆయా సంఘాల నుంచి ఎంపిక చేసిన పేర్లను చూసి జర్నలిస్టులు, అధికారులు విస్తుపోతున్నారు. వీరు అక్రిడిటేషన్ కమిటీ సభ్యులా..? అసలు పత్రికలే లేని వారు..ఉన్నా..రెగ్యులారిటీ లేని వారి పేర్లను అక్రిడిటేషన్ కమిటీల్లో ప్రతినిధులుగా నియమిస్తారా..? వీరిలో కొందరిపై క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయి. ఇలాంటి వారిని కమిటీల్లో నియమిస్తారా...? అంటూ..ఆశ్చర్యపోతున్నారు. కొన్ని సంఘాల నేతలు సొమ్ములకు కక్కుర్తిపడి సొమ్ములు ఇస్తే..దారినపోయే దానయ్యలను కూడా అక్రిడిటేషన్ కమిటీల్లోసభ్యులుగా ప్రతిపాదనలు ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. వాస్తవానికి ఈసారి అక్రిడిటేషన్ కమిటీల్లో యూనియన్ల ఎంపికే లోపభూయిష్టంగా జరిగిందన్న విమర్శలు ఉన్నాయి.
ఏక వ్యక్తి సంఘానికి రెండు కమిటీల్లో స్థానమా..!?
ఈసారి అక్రిడిటేషన్ కమిటీల్లో ఆయా సంఘాలు, అసోషియేషన్ల ఎంపిక పరమ రోతగా జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. ఒకే సభ్యుడు అధ్యక్షుడిగా ఉన్న ఒక సంఘానికి రెండు చోట్ల స్థానం కల్పించారు. పెద్ద మీడియా, చిన్న పత్రికల సంఘంలోనూ వారికి అవకాశం ఇచ్చారు. వాస్తవానికి ఆ సంఘంలో పెద్దగా జర్నలిస్టులు లేరు. కానీ..వేల మంది తమ సంఘంలో ఉన్నారంటూ..ఆ సంఘం నేత విన్యాసాలు చేశారు. దీనికి సమాచారశాఖ అధికారులు సహకరించారనే ఆరోపణలు ఉన్నాయి. సమాచారశాఖ అధికారులతో సదరు సంఘనేత కుమ్మక్కు అయి..రెండు చోట్లా తన సంఘం వచ్చే విధంగా చక్రం తిప్పారనే విమర్శలు ఉన్నాయి. వాస్తవానికి స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్ అసోషియేషన్‌లో ఇంతకు ముందు ఒకే సంఘం ఉండేది. అయితే ఈసారి దాన్ని రెండుకు పెంచారు. రాష్ట్ర సమాచారశాఖ మంత్రి పార్థసారధి ఆదేశాలకు అనుగుణంగా ఈ విభాగంలో రెండు సంఘాలకు అవకాశం ఇచ్చారు. అయితే మంత్రి వేరే ఉద్దేశ్యాలతో..రెండు సంఘాలకు అవకాశం ఇస్తే..దాన్ని అధికారులు, సదరు సంఘం నేత..తమకు అనుకూలంగా మార్చుకున్నారు. బిగ్ అసోషియేషన్‌తో పాటు..స్మాల్ అండ్ మీడియం కేటగిరిలోనూ తన సంఘమే వచ్చే విధంగా అధికారులతో కుమ్మక్కు అయి..సదరు సంఘనేత చక్రం తిప్పారు. ఇప్పుడూ ఈ సంఘనేతే..ఎలక్ట్రానిక్ మీడియా విభాగానికి చెందిన జర్నలిస్టులను పత్రికా సంఘం తరుపున కమిటీల్లో స్థానం కల్పించమని ప్రతిపాదనలు పంపారు. దీనిపై అధికారులు అభ్యంతరం వ్యక్తం చేసినా..తనను వాళ్లు ఏమీ చేయలేరని తాను ఇచ్చిన పేర్లనే లిస్టులో చేర్చాలని ఒత్తిడి తెస్తున్నారు. అయితే..సమాచారశాఖ డైరెక్టర్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని అధికారులకు చెబుతూ..పత్రికా విభాగంలో పనిచేసేవారినే నియమించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. దీంతో..అధికారులు ఆ సంగతిని సదరు సంఘనేతకు చెప్పినా..ఆ నేత పట్టించుకోవడం లేదు. దీంతో..అక్రిడిటేషన్ కమిటీలు ఆలస్యం అవుతున్నాయి. వాస్తవానికి రాష్ట్ర అక్రిడిటేషన్ కమిటీ సమావేశం ఈ నెల 30వ తేదీన పెట్టుకోవాలని అధికారులు నిర్ణయించారు. కానీ..ఈ నేత నిర్వాకం వల్ల ఇప్పుడు అది వాయిదా పడే అవకాశం ఉంది.
నిబంధనలకు తూట్లు పొడిచిన అధికారులు...!
వాస్తవానికి ఈ సంఘానికి రాష్ట్ర అక్రిడిటేషన్ కమిటీల్లో స్థానమే దొరకదు. ఆ సంఘం తమకు ఉన్న సభ్యుల కంటే..ఎక్కువగా సభ్యులు ఉన్నట్లు బోగస్ జాబితాను అధికారులకు అందచేశారు. ఈ జాబితాను ఎటువంటి పరిశీలన చేయకుండానే అధికారులు ఆమోదించారు. అదేమంటే..కార్మికశాఖ నుంచి తమకు ఈ సంఘానికే ఎక్కువ మంది ఉన్నట్లు సర్టిఫికెట్ వచ్చిందని, అందుకే ఆ సంఘాన్ని రెండు విభాగాల్లో నామినేటెడ్ చేశామని చెబుతున్నారు. వాస్తవానికి కార్మికశాఖ నుంచి ఎటువంటి ధృవీకరణ పత్రాన్ని సమాచారశాఖ అధికారులు తీసుకోలేదు. సదరు సంఘం ఇచ్చిన జాబితానే కార్మికశాఖ సమాచారశాఖకు పంపించింది. కానీ నిబంధనలు ఏమి చెబుతున్నాయంటే...జర్నలిస్టు సంఘం సమర్పించిన జర్నలిస్టు ఆమోదిత జాబితా కార్మిక శాఖ ధ్రువీకరణతో సమర్పించాలి. కానీ ఇక్కడ అదేమీ జరగలేదు. కేవలం సదరు యూనియన్ ఇచ్చిన జాబితానే తిరిగి కార్మికశాఖ సమాచారశాఖకు పంపించింది. ఇప్పుడు దీన్నే అధికారులు కార్మికశాఖ ఇన్ని వేల మంది ఉన్నారని దృవీకరణ చేశారని వాదిస్తున్నారు. వాస్తవానికి ఆ సంఘంలో కనీసం వంద నుంచి రెండు వందల మంది కూడా లేరు. ఆ విషయం అధికారులకు కూడా తెలుసు. నిజానికి ఆ సంఘానికి అన్ని వేల మంది జర్నలిస్టులు ఉంటే..అక్రిడిటేషన్ కమిటీల సభ్యుల పేర్లు ఇంత వరకూ ఎందుకు పంపలేదు. ఒక వేళ పంపినా వాళ్ల పత్రికల పేర్లు, ఇతర వివరాలు ఎందుకు ఇవ్వలేదు..? పత్రికా సంఘంగా గుర్తింపు పొంది ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల పేర్లు కమిటీలకు ఎందుకు సిఫార్సు చేస్తున్నారు..? ఇన్నివేల మంది జర్నలిస్టులు ఉంటే..వాళ్లలో ప్రింట్ మీడియాలో పనిచేసేవారే లేరా..? ఎందుకు అధికారులతో ఇన్నిసార్లు చెప్పించుకుంటున్నారు..? దీన్ని ఆధారంగా తీసుకున్నా..ఆ సంఘం ఎంత బోగస్సో తెలిసిపోతుంది. కొందరు అధికారులు... ఆ సంఘం నేతతో కుమ్మక్కు కావడమే ఈ పరిస్థితికి కారణమనే ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. ఇప్పటికే దీనిపై కొందరు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. మరి కొందరు కూడా అదే బాటలో నడుస్తున్నారు. బోగస్ సంఘానికి రెండు చోట్లా ప్రాతినిధ్యమా..? అంటూ జర్నలిస్టులు నోరెళ్లబెడుతున్నారు. అధికారులు ఇప్పటికైనా చేసిన తప్పును సరిదిద్దుకోవాలి. లేకుంటే..ఇప్పటికే జర్నలిస్టు వర్గాల్లో సమాచారశాఖ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ప్రభుత్వ పెద్దలను, సమాచారశాఖ డైరెక్టర్‌ను కొందరు అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారనే విమర్శలు, ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అదే విధంగా ప్రభుత్వానికి చెడ్డపేరు తేవడానికే కొందరు అధికారులు ఈ రకంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.