జ‌గ‌న్‌-ష‌ర్మిల మ‌ధ్య రాజీ చేస్తారా...!?

23, Mar 2026

దివంగ‌త ముఖ్య‌మంత్రి వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర్‌రెడ్డి కుటుంబ‌స‌భ్యుల మ‌ద్య జ‌రుగుతోన్న ఆస్తి వివాదం రాజ‌కీయంగా సంచ‌ల‌నం సృష్టిస్తోంది. వై.ఎస్ కుమారుడైన జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి, ఆయ‌న కుమార్తె ష‌ర్మిల మ‌ధ్య జ‌రుగుతోన్న ఆస్తుల పంప‌కం వివాదం తీవ్ర దుమారాన్ని రేపుతోంది. ఈ వివాదంపై వై.ఎస్ అభిమానులు, వైకాపా స‌గ‌టు కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు ఆందోళ‌న, ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. అన్నాచెళ్ల‌ళ్ల మ‌ద్య జ‌రుగుతోన్న వివాదాన్ని ప‌రిష్క‌రించ‌డానికి ఎవ‌రైనా ముందుకు వ‌స్తారా...?  వారిద్ద‌రి మ‌ధ్య రాజీ చేస్తారా..? అనేదానిపై వారు చ‌ర్చించుకుంటున్నారు. వీరిద్ద‌రి మ‌ధ్య జ‌రుగుతోన్న ఆస్తుల పోరాటంలో రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ప‌రువుపోతోంద‌ని, ఆయ‌న‌ను గౌర‌వించేవారు ఇప్పుడు ఆయ‌న ప‌ట్ల కూడా చుల‌క‌న‌గా మాట్లాడుతున్నార‌ని, ఆయ‌న వ్య‌వ‌హార‌శైలి కుమారుడి ప‌ట్ల ఆయ‌న వ్య‌వ‌హ‌రించిన తీరును గుర్తు చేస్తూ ఎద్దేవా చేస్తున్నార‌ని, వీరి వ‌ల్ల చ‌నిపోయిన వై.ఎస్‌.కూడా అవ‌మానాలు ప‌డుతున్నార‌నే బాధ వారిలో వ్య‌క్తం అవుతోంది. ఆయ‌న ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు స్వంత కొడుక్కి ప్ర‌భుత్వ ఆస్తుల‌న్నీ దోచిపెట్టార‌ని, అంత‌కు ముందు ఎన్నిక‌ల ఖ‌ర్చులు పెట్ట‌లేక ఆస్తులు అమ్ముకోవ‌డానికి సిద్ధ‌మైన వై.ఎస్ కుటుంబం ఆయ‌న ముఖ్య‌మంత్రి అయిన త‌రువాత ఇన్ని వేల‌కోట్లు ఎలా సంపాదించార‌ని, ఇదంతా వై.ఎస్‌.దోపిడీ వ‌ల్లే సాధ్య‌మైయింద‌ని ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఎప్ప‌డో ప‌దేళ్ల క్రితం చ‌నిపోయిన వై.ఎస్ ఇప్పుడు ఆయ‌న వార‌సుల వ‌ల్ల మ‌ళ్లీ దూష‌ణ‌లు, తిట్లు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని వారు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. కాగా అన్నాచెళ్లెళ్ల మ‌ధ్య జ‌రుగుతోన్న ఆస్తుల వివాదంలో చివ‌ర‌కు త‌ల్లి అయిన విజ‌య‌మ్మ కూడా ష‌ర్మిల వైపే నిల‌బ‌డ‌డంతో...జ‌గ‌న్ వ్య‌వ‌హారంపై తీవ్ర దుమారం రేగుతోంది. స్వంత చెల్లికి, త‌ల్లికి న్యాయం చేయ‌లేని వాడు..రాష్ట్రంలో ప్ర‌జ‌ల‌నేమి ఉద్ద‌రిస్తాడ‌ని వారు ఎద్దేవా చేస్తున్నారు. పైగా స్వ‌తం చెల్లి, త‌ల్లిపైకి కిరాయి వ్య‌క్తుల‌ను వ‌దిలి వారి చేత బండ‌బూతులు తిట్టిస్తున్నార‌ని, దీంతో జ‌గ‌న్ వ్య‌వ‌హార‌శైలి ఏమిటో స్ప‌ష్టంగా తెలిసిపోయింద‌ని వారు అంటున్నారు.




అస‌లేమిటీ ఆస్తుల వివాదం...!

దివంగ‌త రాజ‌శేఖ‌ర్‌రెడ్డి త‌న త‌రువాత త‌న ఆస్తుల‌ను కుమారుడు, కుమార్తె సంతానానికి స‌మానంగా పంచాల‌ని కోరార‌ని, అయితే జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి మాత్రం ష‌ర్మిల‌కు ఆస్తులు ఇవ్వ‌డం లేద‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. వీటిని విజ‌య‌మ్మ కూడా దృవీక‌రించారు. త‌న భ‌ర్త బ‌తికి ఉన్న‌ప్పుడు కూడా ఇదే చెప్పేవార‌ని, త‌న మ‌న‌మ‌లైన న‌లుగురికి ఆస్తుల‌ను స‌మానంగా పంచాల‌ని ఆయ‌న కోరుకున్నార‌ని ఆమె అంటున్నారు. అయితే..దీన్ని జ‌గ‌న్ మ‌నుషులు, ఆయ‌న పార్టీ నాయ‌కులు కొట్టేస్తున్నారు. వై.ఎస్ సంపాదించిన ఆస్తుల‌ను జ‌గ‌న్ స‌మానంగానే పంచి ఇచ్చార‌ని, అంతే కాకుండా చెల్లెలు కోర‌కుండానే రూ.200 కోట్ల దాకా..న‌గ‌దును కూడా ఆమెకు ఇచ్చామ‌ని, ఇంత కంటే..ఇచ్చేదేముంద‌ని వారు ప్ర‌శ్నిస్తున్నారు. తండ్రి చెప్పిన విధంగానే ఆస్తుల‌ను పంచాన‌ని, తాను సంపాదించుకున్న ఆస్తుల్లో ష‌ర్మిల‌కు వాటా ఎందుకు వ‌స్తుంద‌ని జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ప్ర‌శ్నిస్తున్నారు. అయితే..వై.ఎస్ బ‌తికి ఉన్న‌ప్పుడే జ‌గ‌న్ భారీగా ఆస్తుల‌ను సంపాదించార‌ని, అది అంతా తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని సంపాదించి క‌నుకే..దానిలో ష‌ర్మిల‌కు వాటా ఉంద‌ని ష‌ర్మిల‌, ఆమె త‌ల్లి వాదిస్తున్నారు. తండ్రి ఆనాడు ఆస్తుల‌ను పంచ‌లేద‌ని, ఇప్పుడు జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి చెబుతోన్న ఆస్తుల‌న్ని ఉమ్మ‌డివేన‌ని, వాటిలో ష‌ర్మిల‌కు న్యాయ‌మైన వాటా ఉంద‌న వారు వాదిస్తున్నారు. దీనిపై కోర్టుల్లో కేసులు కూడా న‌డుస్తున్నాయి. 



2019 ఎన్నిక‌ల‌కు ముందు జ‌గ‌న్‌, ఆయ‌న చెల్లి, త‌ల్లి అంద‌రూ క‌లిసే ఉన్నారు. అప్ప‌ట్లో జ‌గ‌న్‌ను ముఖ్య‌మంత్రి చేయ‌డానికి వీరంతా..తీవ్రంగా కృషి చేసి విజ‌యం సాధించారు. అయితే..జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ఆస్తులు పంచ‌లేద‌ని, పైగా రాజ‌కీయంగా ష‌ర్మిల‌కు అన్యాయం చేశార‌నే వాద‌న ఉండేది. ఆమెకు క‌డ‌ప పార్ల‌మెంట్ సీటు కోరుకుంటే ఇవ్వ‌లేద‌ని, పైగా ఆస్తుల‌ను స‌రిగా పంచ‌కుండా అన్యాయం చేశార‌నే ప్ర‌చారం ఉండేది. దీన్ని నిజం చేస్తూ ష‌ర్మిల తెలంగాణ‌కు వెళ్లి రాజ‌కీయ‌పార్టీని ప్రారంభించారు. అయితే అక్క‌డ పెద్ద‌గా స‌క్సెస్ కాక‌పోవ‌డంతో ఆమె మ‌ళ్లీ ఆంధ్రాకు వ‌చ్చి జ‌గ‌న్‌పై సూటిగా విమ‌ర్శ‌లు గుప్పించారు. 2024 ఎన్నిక‌ల్లో ఆయ‌న ఓట‌మికి ఆమె కూడా కృషి చేశారు. అయితే...ఓడినా జ‌గ‌న్ మాత్రం ఆమెకు ఆస్తులు ఇవ్వ‌డానికి ఒప్పుకోవ‌డం లేదు. దీంతో..ష‌ర్మిల త‌న అన్న‌పై సంచ‌ల‌న విమ‌ర్శ‌లు చేశారు. ఇటువంటి అన్న ఎవ‌రికీ ఉండ‌కూడ‌ద‌ని, అన్న అనే ప‌దానికి ఆయ‌న కళంకమ‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు. దీనిపై వైకాపా నుంచి కూడా అంతే ఘాటుగా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకుంటూ కుటుంబ ప‌రువును బ‌జారుకు తెచ్చార‌ని వారి అభిమానులు వాపోతున్నారు. అయితే..ఇప్పుడు జ‌గ‌న్ ఆమె ఎన్ని విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు చేసినా..ఆమెకు ఆస్తి ఇవ్వ‌డానికి నిరాక‌రిస్తూనే ఉన్నారు. అయితే..ఇప్పుడు ఆయ‌న మొండిగా వ్య‌వ‌హ‌రిస్తే..వైకాపాకు తీవ్ర న‌ష్టం జ‌రుగుతుంద‌ని, ఇప్ప‌టికైనా..ఆమెతో రాజీకి రావాల‌ని ఆయ‌న పార్టీ నాయ‌కులు కోరుతున్నారు. ఆమెకు ఎంతో కొంత ఇచ్చి రాజీ చేసుకుంటేనే ఆయ‌న‌కు మంచిద‌ని, అన్ని విష‌యాల్లో ఎదురుదాడి మంచిది కాద‌ని, ఇప్ప‌టికే త‌ల్లీ కూతుళ్లు ఒకే మాట‌పై ఉన్నార‌ని, రేపు త‌ల్లి విజ‌య‌మ్మ కూడా ష‌ర్మిల వ‌లే విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు గుప్పిస్తే...రాజ‌కీయంగా ప‌త‌నం కావ‌డం ఖాయ‌మ‌ని, ఇప్ప‌టికైనా జ‌గ‌న్ రాజీ మార్గం చూసుకోవాల‌ని వారు అంత‌రంగిక సంభాష‌ణ‌ల్లో అంటున్నారు. అయితే..ఇప్పుడు వారిద్ద‌రి మ‌ధ్య‌రాజీ చేసే వ్య‌క్తులు ఎవ‌రు..? జ‌గ‌న్‌కు చెప్పేవాళ్లు ఎవ‌ర‌నే దానిపై ప‌లు ప్ర‌శ్న‌లు ఎదురువుతున్నాయి. రాజ‌శేఖ‌ర్‌రెడ్డికి స‌న్నిహితంగా ఉన్న వ్య‌క్తులు దీనికి పూనుకోవాల‌ని, వారు కాకుంటే కుటుంబ స‌మావేశాన్ని నిర్వ‌హించి దీనికో పుల్‌స్టాప్ పెట్టాల‌ని వారు కోరుతున్నారు. మ‌రి వారు అనుకున్న‌ట్లు..ఈ ఆస్తుల గొడ‌వ‌కు పుల్‌స్టాప్ ప‌డుతుందా...?  ప్ర‌స్తుతానికైతే..అలాంటి సూచ‌న‌లేమీ క‌నిపించ‌డం లేదు. 


(0)
(0)

Comments

తాజా పోల్

జ‌గ‌న్ మ‌ళ్లీ గెలుస్తార‌నే భ‌యంతోనే రాజ‌ధాని అమ‌రావ‌తిపై అసెంబ్లీలో తీర్మానం చేశారా?

VOTE PLEASE