ఐఏఎస్‌ల బదిలీలు...!?
రాష్ట్ర ప్రభుత్వం మరి కొందరు కీలకమైన ఐఏఎస్‌లను బదిలీ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిలో కొన్ని జిల్లాల కలెక్టర్లుతో పాటు, ఒకటీ రెండుశాఖల ప్రధాన కార్యదర్శులు కూడా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఇటీవల కాలంలో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొందరు ఐఏఎస్‌లు కుట్రలు పన్నుతున్నారని, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డికి అనుకూలంగా లాబీలు చేస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఐఏఎస్ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. అదే సమయంలో ఎవరెవరు జగన్‌కు అనుకూలంగా ఉన్నారనే దానిపై ప్రభుత్వం రహస్యంగా విచారణ జరుపుతోందని, ఇప్పటికే కొందరిని గుర్తించారని, వీరిని అప్రధాన్యత పోస్టులకు బదిలీ చేయడమో..లేక జిఏడికి అటాచ్ చేయడమో చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ప్రభుత్వ వర్గాలతో పాటు, టిడిపి పార్టీ వర్గాలు కూడా అంటున్నాయి. అయితే..ఎవరెవరిని తప్పిస్తారనే దానిపై స్పష్టత లేదు. కాగా కీలకమైన మున్సిపల్‌శాఖలో బదిలీలు ఉంటాయంటు న్నారు. మున్సిపల్‌శాఖ ప్రధాన కార్యదర్శి సురేష్ కుమార్‌ను బదిలీ చేస్తారంటున్నారు. ఆయన బదిలీకి ప్రధాన కారణం..ఆయనకూ మున్సిపల్ మంత్రి నారాయణకు పడకపోవడమేనంటున్నారు. రెండు రోజుల క్రితమే సిఆర్‌డిఏ కమీషనర్‌గా ఉన్న కన్నబాబును ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన ఆకస్మిక బదిలీ ఎందుకు జరిగిందో ఎవరికీ అర్థం కావడం లేదు. వాస్తవానికి ఆయన మంత్రి నారాయణతో మంచి సంబంధాలు కలిగి ఉన్నారు. అయినా..ఆయనను ఎందుకు బదిలీ చేశారనే దానిపై రకరకాలైన చర్చలు జరుగుతున్నాయి. రాజధాని పనులు చేస్తోన్న ఒక కాంట్రాక్టర్ ఆయనను బదిలీ చేయించారనే ప్రచారం ఉండగా, బిల్లుల చెల్లింపులు, ఇతర వ్యవహారాలు ఆయన బదిలీకి కారణం అంటున్నారు. అయితే..ఆయనే బదిలీ చేయించుకున్నారని, మరో ఆరు నెలల్లో ఆయన రిటైర్ కానున్నారు. ఈ పరిస్థితుల్లో కీలకమైన సిఆర్‌డిఏలో ఉంటే..లేనిపోని తలనొప్పులు వస్తాయనే భావనతో ఆయన పక్కకు తప్పుకున్నారంటున్నారు. కాగా..ఇప్పుడు మున్సిపల్‌శాఖ ప్రధాన కార్యదర్శిని తప్పిస్తే..ఆయన స్థానంలో ఎవరిని తీసుకువస్తారనే దానిపై చర్చ సాగుతోంది. అదే విధంగా కర్ణాటక క్యాడర్‌కు చెందిన ఓ మహిళా ఐఏఎస్‌ను ఇక్కడ నియమిస్తారని, ఆమె కర్ణాటక నుంచి ఇక్కడకు వచ్చేందుకు కేంద్రం అనుమతించిదంటున్నారు. ఆమెను ఇక్కడకు రాకుండా సిఎంఓలో పనిచేసే ఓ అధికారి ఇటీవల వరకూ అడ్డుకున్నారని, అయితే నూతన సిఎస్ ఆమెకు అడ్డంకులను తొలగించారని ఆమె ఇక్కడ రావడం ఖాయమని విశ్వసనీయమైన వర్గాలు చెబుతున్నాయి.
కాగా గుంటూరు జిల్లా కలెక్టర్‌ను బదిలీ చేస్తారనే వార్తలు జోరుగా వస్తున్నాయి. ఆమెను విద్యాశాఖలోకి తీసుకుంటారని సోషల్‌మీడియా హోరెత్తిస్తోంది. నిన్నటి వరకూ లోకేష్ శాఖలో విద్యాశాఖ డైరెక్టర్‌గా పనిచేసిన విజయరామ రాజును సిఆర్‌డిఏ కమీషనర్‌గా నియమించడంతో ఆయన స్థానంలో అన్సారియాను నియమిస్తారనే ప్రచారం సాగుతోంది. కాగా అల్లూరుసీతారామరాజు జిల్లా కలెక్టర్‌గా ఉన్న ఎ.ఎస్.దినేష్‌కుమార్‌ను APEDBలో నియమిస్తారనే ప్రచారం ఉంది. దినేష్‌కుమార్ పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, ఆయనను కీలకమైన EDBలో నియమిస్తే ఇంకా మెరుగైన ఫలితాలను సాధిస్తారనే భావనతో ఆయనను బదిలీ చేస్తారంటున్నారు. ప్రస్తుతం EDB CEOగా ఉన్న సాయికాంత్ వర్మను కలెక్టర్‌గా నియమిస్తామని సిఎం చంద్రబాబు హామీ ఇచ్చారంటున్నారు. ఆయనకు కలెక్టర్‌గా అవకాశం వస్తుందనే ప్రచారం ఉంది. అదే విధంగా APIIC, Managing Directorగా ఉన్న Abhishikth Kishoreనూ కలెక్టర్‌గా నియమిస్తారంటున్నారు. వీరిద్దరిలో ఎవరికి అవకాశం వస్తుందో చూడాలి. కాగా రాయలసీమకు చెందిన ఓ కలెక్టర్‌నూ బదిలీ చేస్తారంటున్నారు. అదే సమయంలో గోదావరి జిల్లాలకు చెందిన ఒకరిద్దరు కలెక్టర్లను బదిలీ చేయవచ్చనే ప్రచారం ఉంది. దీనితో పాటు రాష్ట్ర సచివాలయంలో కీలక మంత్రి వద్ద పనిచేస్తోన్న మరో ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులపై కూడా బదిలీ వేటు పడవచ్చని తెలుస్తోంది. కాగా రాజధాని ప్రాంతానికి చెందిన మంత్రి శాఖలో కీలకంగా ఉన్న మరో యువ ఐఏఎస్ అధికారి కూడా బదిలీ అవుతారనే ప్రచారం ఉంది. ఆయనకూ మంత్రికి పొసగడం లేదని, మంత్రి చెప్పిన పనులు ఆ యువ ఐఏఎస్ అధికారి చేయడం లేదని, తనను తప్పించాలని ఆ యువ ఐఏఎస్ అధికారి సిఎంఓ అధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఈసారి జరిగే బదిలీల్లో వైకాపా ముద్రపడిన అధికారులను ఖచ్చితంగా పక్కన పెడతారే ప్రచారం జోరుగా సాగుతోంది.