లోకేష్ సిఎం ప్రచారం… వెనుక...బిజెపి...!?
రాష్ట్రంలో ముఖ్యమంత్రి మారిపోతున్నారని, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును పదవి నుంచి దించేసి ఆయన కుమారుడు, రాష్ట్ర ఐటి, విద్యాశాఖ మంత్రి లోకేష్‌ను ముఖ్యమంత్రి చేస్తున్నారని, ఉగాది నాటికి ఆయనను సిఎం చేయడం ఖాయమని, ఇటీవల సోషల్ మీడియా ఊదరగొట్టింది. చిన్నా చితకా యూట్యూబ్ ఛానెళ్లతోపాటు, ఒక ప్రధాన పత్రికకు చెందిన ఛానెల్ కూడా లోకేష్ సిఎం అంటూ ఒకటే హడావుడి చేసింది. టిడిపి అనుకూల యూట్యూబ్ ఛానెల్స్‌తో పాటు, వైకాపా, బిజెపి అనుకూల ఛానెల్స్ కూడా ఇదే పాట పాడాయి. ఇంకేముంది లోకేష్ సింఎ అయినట్లే అంటూ..ఒకటే రొదన చేశాయి. లోకేష్‌ను సిఎం చేయడానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఒప్పుకున్నారని, ఢిల్లీలో ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలు కూడా సరే అన్నారని ఒకరికి మించి మరొకరు ప్రచారం చేశారు.
లోకేష్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే..ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేంద్రానికి వెళతారని, దక్షిణాదిన ఎన్‌డిఏ కన్వీనర్‌గా ఉంటారని, చంద్రబాబు రాష్ట్రపతి అయిపోతారని, లోకేష్ తన మంత్రులను కూడా ఎంపిక చేసుకున్నారంటూ ఉగాదికి పట్టాభిషేకం అంటూ ముహూర్తం కూడా పెట్టేశారు. ఉగాది తన పనితాను చేసుకుని వెళ్లిపోయింది. కానీ..వారు చెప్పిందేమీ నిజం కాలేదు. అయితే..ఇంత ప్రచారం జరుగుతున్నా..అటు టిడిపి నేతలు కానీ, జనసేన నేతలు కానీ ఎక్కడా నోరు విప్పలేదు. అయితే..గియితే..జనసేన ముసుగులో ఉన్న కొందరు కాపు నేతలు పవన్‌కళ్యాణ్‌కు అన్యాయం చేస్తున్నారని, కాపులకు అన్యాయం చేస్తున్నారని యూట్యూబ్ ఛానెల్స్‌లో వీరంగాలు వేశారు. అయితే..వాస్తవాలు తెలిసిన టిడిపి, జనసేన నేతలు ఎక్కడా నోరు విప్పలేదు. కాగా ఇప్పుడు హడావుడి తగ్గిన తరువాత....టిడిపి నేతలు..అసలేమి జరిగిందో..తీరిగ్గా తెలుసుకుంటున్నారు. అసలెందుకు ఈ ప్రచారం జరిగింది...ఈ ప్రచారం చేసిన వాళ్లెవరు..? అనేదానిపై టిడిపి అధిష్టానం విచారణ చేయిస్తే ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయట.
బిజెపి సోషల్ మీడియా...!
లోకేష్ సిఎం అంటూ హడావుడి చేసిన వారిలో ఆశ్చర్యకరంగా బిజెపి సోషల్ మీడియా ఉందట. లోకేష్ సిఎం అంటూ జరిగిన ప్రచారంలో 50శాతం బిజెపి హ్యాండిల్స్ నుంచి జరిగినవేనట. బిజెపి సోషల్ మీడియా ఈ ప్రచారాన్ని ఎందుకు చేసిందో తెలియదు కానీ...లోకేష్‌ను సిఎం చేస్తున్నారంటూ వాళ్లు చేసిన ప్రచారం రాష్ట్రంలో హోరెత్తింది. టిడిపి, జనసేనల మధ్య చిచ్చు పెట్టేందుకే ఈ ప్రచారం చేశారా..? లేక దీని వెనుక వేరే ఎత్తులు ఏమైనా వేశారా అనేది తెలియదు కానీ..ఈ ప్రచారాన్ని మొదలుపెట్టి పీక్‌కు తీసుకెళ్లింది మాత్రం బిజెపినే. కూటమిలో భాగస్వామిగా ఉంటూ బిజెపి ఎందుకు ఈ విధంగా వ్యవహరించిందో ఎవరికీ అర్థం కావడం లేదు. కాగా బిజెపి చేసిన ప్రచారాన్ని టిడిపి సోషల్ మీడియా కార్యకర్తలు, నాయకులు కూడా అందుకున్నారు. చేసిన ప్రచారంలో వీరి వంతు దాదాపు 20శాతం ఉందట. ఒక టిడిపి బద్దశత్రువు వైకాపా కూడా ఇదే పాట పాడింది. ఈ పార్టీ వంతు 30శాతం అట. తనకున్న సోషల్ మీడియా బలంతో వైకాపా టిడిపి, జనసేన మధ్య విభేదాలు సృష్టించడానికి దీన్ని బాగా ఉపయోగించుకుంది. వారిద్దరినీ విడగొడితేనే వచ్చే ఎన్నికల్లో తనకు ఎంతో కొంత ఉపయోగం ఉంటుందని, లేకపోతే..తన పరిస్థితి మళ్లీ ఇదే స్థాయిలో ఉంటుందనే భావనతో వచ్చిన అవకాశాన్ని వాళ్లు వదిలిపెట్టకుండా ప్రచారం చేశారట. వాస్తవానికి ముఖ్యమంత్రిగా మరొకరు ఉంటే జగన్మోహన్‌రెడ్డికి, ఆయన పార్టీకి అసలు ఇష్టం ఉండదు. మరి అటువంటి పార్టీ సోషల్ మీడియా ఇలా ప్రచారం చేసిందంటే..దానికి కారణం కూటమి మధ్య చిచ్చు పెట్టడానికే. మరోవైపు ఈ విషయంలో జనసేన సోషల్‌మీడియా చాలా సంయమనం పాటించిందట. లోకేష్ సిఎం అనే ప్రచారాన్ని ఆ పార్టీ పెద్దగా పట్టించుకోలేదు. ఆ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి 3శాతం మంది మాత్రమే ఈ ప్రచారాన్ని చేశారట. మొత్తం మీద..లోకేష్ సిఎం అనే ప్రచారం వెనుక బిజెపి, వైకాపా వారిదేనని తేలిపోయింది. ఇలా ప్రచారం చేయడానికి వాళ్లకు ఉన్న కారణాలు వారికి ఉన్నాయి. కానీ..ఆశ్చర్యకరంగా కొంతమంది టిడిపి వాళ్లూ దీనిలో భాగస్వాములై ఈ ప్రచారాన్ని ఉధృతం చేసి...వారి వలలో పడ్డారనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి.