ఇది కదా..టెస్ట్ క్రికెట్ మజా అంటే...!?
చాలా మంది క్రికెట్ అభిమానులే టెస్ట్ క్రికెట్‌లో ఏముంటుంది...? ఢిఫెన్స్..ఢిపెన్స్..అప్పుడో పరుగు..అప్పుడో పరుగు..? ఎప్పటికో..ఓ ఫోర్..చూసీ చూసీ బోర్ కొడుతుంది...అంటూ..టెస్ట్ మ్యాచ్‌లను అసలు పట్టించుకోరు. ఎడాపెడా ఫోర్లు, సిక్స్‌లు కొట్టే 20-20 మ్యాచ్‌లనే వారు ఇష్టపడతారు. అయితే..ఇప్పుడు ఇండియా-ఇంగ్లాండ్‌ల మధ్య జరుగుతోన్న ఐదు టెస్టుల మ్యాచ్‌లను చూసిన వారు..ఇది కదా..క్రికెట్ మజా..అంటూ....ఉద్వేగానికి గురవుతున్నారు. పోటాపోటీగా జరుగుతోన్న ఈ మ్యాచ్‌లు..అభిమానులను అలరిస్తున్నాయి. ఐదు రోజుల మ్యాచ్‌లు నిజంగా ఐదు రోజుల పాటు జరుగుతూ ఉత్కంఠతను కల్గిస్తున్నాయి. ప్రతి సెషన్‌లోనూ.. ఎవరిది పైచేయి...ఎవరు గెలవడానికి అవకాశం ఉంటుంది..అంటూ టెస్టు మొదలైన మొదటిరోజూ నుంచి అభిమానులను అలరిస్తోంది ఈ సిరీస్. వాస్తవానికి ఇండియా ఇంగ్లాడ్ టూర్‌కు వెళ్లినప్పుడు క్రికెట్ అభిమానులు ఎవరూ..పెద్దగా దీన్ని పట్టించుకోలేదు. అయితే..తొలి టెస్టులోనే కుర్రాళ్ళతో కూడిన ఇండియా క్రికెటర్లు ఇంగ్లాండ్‌ను ఎదుర్కొన్న తీరు చూసి ముచ్చటపడిపోయారు. తొలి టెస్టులో ఇండియా ఓడిపోయినా..ఇండియా క్రికెటర్లు ఆడిన తీరు వారిని ముగ్ధులను చేసింది. తొలి టెస్టులో ఓడిపోయినా..రెండో టెస్టులో పుంజుకుని బ్రిటీష్ జట్టును ఓడించడంతో మ్యాచ్‌లపై మరింత ఆసక్తి పెరిగింది. రెండో టెస్టులో భారత కెప్టెన్ చేసిన డబుల్ సెంచరీ, రెండో ఇన్నింగ్స్ సెంచరీ నభూతో నభవిష్యత్తు అన్నట్లున్నాయి. రెండో మ్యాచ్ తరువాత జరిగిన మూడో టెస్టులో భారత్ ఆడిన తీరు టెస్టు మ్యాచ్‌లకే వన్నె తెచ్చింది. ఒక దశలో నాలుగో రోజే ఓడిపోతుందనుకున్న భారత్‌ను గెలుపు తీరాల వరకూ వచ్చి ఓడిపోయినా..అభిమానాలకు మాత్రం అసలైన క్రికెట్ విందును పంచింది. చివరి వరుస బ్యాటర్లతో టీమిండియా ఆల్‌రౌండర్ జడేజా చేసిన విన్యాసం క్రికెట్‌లోని అసలు మజా ఏమిటో అభిమానులకు మరోసారి రుచిచూపించింది.
ఇక నాలుగో టెస్టు గురించి చెప్పేదేముంది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ భారీ ఆధిక్యతను సాధించడం,రెండో ఇన్నింగ్స్‌లో సున్నాకే రెండు వికెట్లు కోల్పోవడంతో.. ఇకేముంది..నాలుగో రోజే భారత్ పని అయిపోతుందని అందరూ అంచనా వేశారు. అయితే..ఓపెనర్ రాహుల్, కెప్టెన్ గిల్‌లు చేసిన పోరాటం..అసమాన్యమైన ఇన్నింగ్స్‌ల్లో ఒకటిగా నిలిచిపోతుంది. సున్నాతో ప్రారంభమైన భారత్‌ను వారు నెమ్మదిగా నిలబెట్టి డ్రాకు కూడా అవకాశం లేని మ్యాచ్‌ను అద్భుతంగా డ్రా చేశారు. చివరికి ఇంగ్లాండ్ ఆటగాళ్లందరూ డ్రా చేసుకుందాం..రండి..అంటూ...కాళ్ల బేరానికి వచ్చారంటే...భారత్ ఆటగాళ్ల పోరాట పటిమి ఏమిటో ప్రపంచం కళ్లారా చూసింది. నాలుగో రోజు రాహుల్, గిల్‌లు ఇంగ్లాండ్‌ను అడ్డుకుంటే..ఐదో రోజు జడేజా, సుందర్‌లు గెలుపుపై కన్నేసిన ఇంగ్లాండ్ ఆశలను తమ ఆట తీరుతో ఆవిరిచేశారు. ఐదో రోజు..ప్రారంభమైన కాసేపటికే నిన్న ఇన్నింగ్స్‌ను నిలబెట్టిన రాహుల్ అవుట్ కావడంతో..భారత్ మ్యాచ్‌ను డ్రా చేయడం అసాధ్యమనే భావన వ్యక్తం అయింది. అయితే..ఒక వైపు గిల్ ఆడుతుండడంతో భారత్ భరోసాతోనే ఉంది. అయితే..సెంచరీ చేసిన గిల్ అవుట్ అవడంతో..ఇక ఈ మ్యాచ్ ఇంగ్లాండ్‌దేనన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అయింది. అయితే..వారి అంచనాలను పటాపంచలు చేస్తూ జడేజా, వాషింగ్టన్ సుందర్‌లు..భారత్‌ను మరోసారి నిలబెట్టారు. అసలైన టెస్టు మ్యాచ్ ఎలా ఉంటుందో అభిమానులకు చూపిస్తూ మ్యాచ్ ఇంగ్లాండ్ పరం కాకుండా అడ్డుకున్నారు. ఇక చివరకి 15 ఓవర్లల్లో మ్యాచ్ ముగిసిపోతుందనుకున్న సమయంలో మ్యాచ్‌ను డ్రా చేసుకుందామని ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్‌స్టోక్ ప్రతిపాదించాడు. అయితే..అప్పటికే సెంచరీల ముందు ఉన్న జడేజా, సుందర్‌లు నిరాకరించడంతో ఆటగాళ్ల మధ్య వాగ్వివాదం జరిగింది. మ్యాచ్‌ను డ్రాగా ప్రకటించాలంటూ.. స్టోక్..లేదూ..ఆడాలంటూ జడేజా, సుందర్‌లు భీష్మించడంతో..చివరకు మళ్లీ మ్యాచ్‌ను కొనసాగించాల్సి వచ్చింది. జడేజా, సుందర్‌లు తమ సెంచరీలను పూర్తి చేసుకోవడంతో..మ్యాచ్‌ను డ్రాగా ప్రకటించారు. అయితే...జడేజా,సుందర్‌లకు బౌలింగ్ చేసిన ఇంగ్లాండ్ బౌలర్లు ఆటస్ఫూర్తిని విరుద్ధంగా బౌలింగ్ చేయడం ప్రేక్షకులకు నిరాశ కలిగించింది.మొత్తం మీద..టెస్టు మ్యాచ్ మజాను చూపిస్తోన్న ఈ సీరిస్ నిజంగా టెస్టు క్రికెట్‌పై అభిమానులకు మరింత ఆసక్తిని కల్గిస్తుందనిచెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.