I&PRలో బదిలీలు...!
రాష్ట్ర సమాచారశాఖలో భారీగా బదిలీలు చోటు చేసుకున్నాయి. కింది స్థాయి సిబ్బంది నుంచి రీజనల్ జాయింట్ డైరెక్టర్స్, రీజనల్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్స్, డిప్యూటీ డైరెక్టర్స్, సూపరిండెంట్స్ ఇంకా దిగువస్థాయి అధికారులను బదిలీ చేశారు. ఆరోగ్య, ఇతర కారణాలతో బదిలీలు కోరుకున్నవారికి దీనిలో ప్రాధాన్యత ఇచ్చారు. ఎంతో కాలంగా బదిలీల కోసం వేచి చూస్తోన్నవారికి బదిలీ కావడంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి కొందరు మాత్రం తమను తమ స్థానాల్లో కొనసాగించినందుకు, అదే స్థాయిలో ప్రాధాన్యతను ఇస్తోన్నందుకు ఉల్లాసాన్ని వ్యక్త పరిచారు. కాగా..గత జగన్ ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన కొందరు అధికారులను అప్పట్లో పోస్టింగ్‌లు ఇవ్వకుండా ప్రభుత్వం జీఎడికి సరెండర్ చేసింది. ఇలా సరెండర్ చేసిన అధికారుల్లో జాయింట్ డైరెక్టర్, మరో ఆర్ ఐ ఉన్నారు. వీరిద్దరూ గతంలో సమాచారశాఖ కమీషనర్‌గా పనిచేసిన విజయ్‌కుమార్‌రెడ్డికి అత్యంత సన్నిహితులని ప్రచారం సాగింది. వీరు అప్పట్లో విజయ్‌కుమార్‌రెడ్డితో కలిసి పలు అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల తరువాత వీరిద్దరినీ జీఎడికి సరెండర్ చేశారు. అప్పటి నుంచి వారికి మళ్లీ పోస్టింగ్‌లు ఇవ్వలేదు. వీరు పలు మార్గాల ద్వారా తమకు పోస్టింగ్‌లు ఇవ్వాలని ప్రభుత్వంపై ఒత్తిడి చేసినా..వారికి పోస్టింగ్‌లు దక్కలేదు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై ప్రభుత్వ ఎసీబీ,విజిలెన్స్ విచారణ చేయిస్తోంది. ఈ విచారణ ఇంకా ఒక కొలిక్కి రాలేదు. అప్పటి సమాచారశాఖ కమీషనర్ విజయ్‌కుమార్‌రెడ్డి ఈ కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఆయనతో పాటు మరి కొందరు అధికారులు అవినీతి కేసుల్లో ఉన్నారని ఏసీబీ పేర్కొంటోంది. అయితే..ఈ కేసులో ఏమీ తేలకుండానే ఆరోపణలు ఎదుర్కొంటున్న జెడి, ఆర్ ఐలకు ఇప్పుడు పోస్టింగ్‌లు ఇచ్చారని ప్రచారం సాగుతోంది.
వివాదాస్పదులకు మళ్లీ అక్కడే పోస్టింగా...!?
ప్రభుత్వం సాధారణ బదిలీల్లో ఆర్‌జెడి, జెడి, ఆర్ ఐ, డిప్యూటీ డైరెక్టర్లను బదిలీ చేసినట్లు జీవో నెం. 1130ని విడుదల చేసింది. అయితే..ఈ ఆర్‌టి-1130లో ఎటువంటి ఉత్తర్వులు లేవు. అయితే వీరి పోస్టింగ్‌ల కోసం ఫైనాన్ష్ డిపార్ట్‌మెంట్‌కు పంపినట్లు ఉత్తర్వుల్లో ఉంది. కాగా..వీరిలో వివాదాస్పదమైన జాయింట్ డైరెక్టర్ తనకు మళ్లీ సమాచారశాఖ ప్రధాన కార్యాలయంలోనే పోస్టింగ్ కావాలని పట్టుపడుతున్నట్లు తెలుస్తోంది. తనకు మళ్లీ అక్కడే పోస్టింగ్ ఇస్తే..తన వ్యతిరేకులపై కక్ష తీర్చుకుంటానని బహిరంగగానే సవాళ్లు విసురుతున్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే ప్రభుత్వం మాత్రం జాయింట్ డైరెక్టర్‌ను ప్రెస్ అకాడమీకి కానీ, లేదా..ఒంగోలు ఆర్‌జెడిగా కానీ పంపించాలని భావిస్తోంది. అయితే..ఆ జాయింట్ డైరెక్టర్ మాత్రం తన పట్టును వీడకుండా..తాను చెప్పిన చోటే పోస్టింగ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి గత జగన్ ప్రభుత్వంలో సమాచారశాఖను అంతా తానై నడిపించిన సదరు వివాదాస్పద అధికారికి జర్నలిస్టు వర్గాల్లోనూ తీవ్ర వ్యతిరేకత ఉంది. ఆ అధికారికి ఇప్పుడు మళ్లీ పోస్టింగ్ ఇస్తున్నారన్న ప్రచారం జర్నలిస్టు వర్గాలను తీవ్ర అసంతృప్తికి గురిచేస్తోంది. వైకాపాకు ఆ అధికారి అనుబందంగా పనిచేస్తారనే విమర్శలు ఉన్నాయి. అటువంటి అధికారిని కూటమి ప్రభుత్వం ఏడాదిగా పక్కన పెట్టింది. అయితే..ఇప్పుడు మళ్లీ ఆ అధికారికి ఎందుకు పోస్టింగ్ ఇస్తున్నారనే మాట జర్నలిస్టు వర్గాల ద్వారా వినిపిస్తోంది. ఏడాది పాటు పనిచేయకుండా జీతం ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు..కేసు విషయంలో ఏమీ తేలకుండా పోస్టింగ్ ఇవ్వాల్సిన అవసరం ఏమిటి..? అనేప్రశ్న కూడా ఉత్ఫన్నం అవుతోంది. మొత్తం మీద..సమాచారశాఖ బదిలీలన్నీ పారదర్శకంగా సాగినా..ఈ వివాదాస్పద అధికారుల పోస్టింగ్ విషయమే జర్నలిస్టు వర్గాల్లో చర్చ జరుగుతోంది.