ఓవల్ టెస్టులో భారత్ విజయం
ఓవల్ టెస్టులో భారత్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత ఉత్కంఠత కలిగించిన మ్యాచ్‌ల్లో ఇదొకటి కావచ్చు. నిన్న ఇంగ్లాండ్ బ్యాటర్ల హోరుతో మ్యాచ్ ఇంగ్లాండ్ సులభంగా గెలుస్తుందని భావించారు. ఈరోజు ఆటలో ఇంగ్లాండ్ గెలుపుకు 35పరుగులు కావాల్సి ఉండగా వారి చేతిలో నాలుగు వికెట్లు ఉన్నాయి. దాదాపు ఐదో రోజు మ్యాచ్‌లో వారిదే పైచేయి. నాలుగు వికెట్లతో 35 పరుగులు చేయడం పెద్ద పని కాదని అందరూ భావించారు. అయితే...భారత్ బౌలర్లు ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌ను ఐదో రోజు ముప్పు తిప్పలు పెట్టారు. ముఖ్యంగా హైదరాబాదీ బౌలర్ సిరాజ్ అయితే..ఇంగ్లాండ్‌కు చుక్కలు చూపించాడు. మొదట ప్రమాదకర బ్యాట్స్‌మెన్ జేమీ స్మిత్‌ను ఔట్ చేసి భారతశిబిరంలో గెలుపుపై ఆశలు కల్పించాడు. స్మిత్ ఔట్ అయిన కాసేపటికే ఓవర్ టన్‌ను ఎల్బీడబ్ల్యుగా సిరాజే పెవిలియన్‌కు పంపించాడు. మరో బ్యాటర్ టంగ్‌ను ప్రసిద్ధకృష్ణ క్లీన్ బౌల్డ్ చేయడంతో భారత్ విజయం అంచుకు చేరింది. అయితే..చేతి గాయంతో బౌలింగ్‌కు దూరంగా ఉన్న వోక్స్ కట్టుతోనే బ్యాటింగ్ రావడం, మరోవైపు అట్కిక్‌సన్ పట్టుదలతో బ్యాటింగ్ చేయడంతో భారత్ ఓడిపోతుందేమోనన్న భయం అభిమానుల్లో కలిగింది. బంతి బంతికి ఉత్కంఠతనే. ఈ లోపు అట్కిసన్ ఇచ్చిన క్యాచ్‌ను బౌండరీ లైన్ వద్ద ఆకాశ్ వదిలేయడం...మరోవైపు లక్ష్యం ఎనిమిది పరుగులకు చేరడంతో..మ్యాచ్ ఇక ఇంగ్లాండ్‌దే అనే భావన వ్యక్తం అయింది. అయితే..సిరాజ్ మరో అద్భుత బంతితో అట్కిసన్‌ను బౌల్డ్ చేయడంతో భారత్ 6 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌పై విజయం సాధించి టెస్టును గెలిచింది. దీంతో ఐదు టెస్టుల సీరిస్ 2-2తో డ్రా అయింది. వాస్తవానికి టెస్ట్ సీరిస్ మొత్తంమీద భారత్ ఆధిపత్యం సాధించినా...గెలుపుకు అనేక అవకాశాలు వచ్చినా..యువ భారత్ అనుభవ లేమితో వదిలేసింది. మొత్తం మీద ఈ సీరిస్ టెస్ట్ క్రికెట్ మజాను అభిమానాలకు మరోసారి రుచిచూపించింది.