మహిళల పేరుతో పురుషుల లూఠీ...!?
అవినీతికి హద్దేలేదన్నట్లుంది భారతదేశంలో...? ఎలాగైనా అవినీతి చేసైనా, అక్రమంగానైనా సంపాదించాలనేదే ధ్యేయంగా కొందరు వక్రమార్కంలో పయనిస్తున్నారు. మహిళలకు ప్రభుత్వం కేటాయించిన ఓ సంక్షేమ పథకంలో భారీగా పురుషులు చేరి కోట్లు కొల్లగొట్టారు. ప్రభుత్వ నిబంధనలలో కేవలం మహిళలకే ఈ సంక్షేమ పథకం అని ప్రకటించినా..పురుషులు ఎలా ఆ పథకం నుంచి లబ్ది పొందారో..అర్థం కావడం లేదు. సదరు పథకాన్ని అమలు చేసే ఐఏఎస్ అధికారి అయినా...పురుషుల పేర్లు పథకంలోకి వచ్చినప్పుడైనా వారిని ఆపలేకపోయారంటే..దానిలో ఎంత అవినీతి జరిగిందో..? ఎన్ని అక్రమాలు, అరాచకాలు జరిగాయో..? మహారాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ముఖ్యమంత్రి లడ్కీ బహిన్ యోజన అనే సంక్షేమ పథకాన్ని ప్రత్యేకం రూపొందించింది. ఈ పథకంలో అర్హులు కేవలం మహిళలే. అయితే..ఈ పథకంలో దాదాపు 14వేల మంది పురుషులు చేరి దాదాపు రూ.21.44కోట్లును కొల్లగొట్టారు. మహిళలు అదీ ఆర్థికంగా చితికిపోయిన వారి కోసం ఉద్దేశించిన ఈ పథకంలో పురుషులతో పాటు, ప్రభుత్వ మహిళా ఉద్యోగులు, ఆర్ధికంగా సుస్థిరంగా ఉన్న మహిళలు అనుచిత ప్రయోజనం పొందారని బయటపడింది. ఈ వ్యవహారంపై సంపూర్ణ విచారణ జరిపించాలని మహారాష్ట్ర ప్రతిపక్షం డిమాండ్ చేస్తోంది. అసలు మహిళల కోసం ఉద్దేశించిన పథకంలోకి పురుషులు ఎలా ప్రవేశించారనే దానిపై విచారణ జరిపించాలని, కనీసం పేర్లను చూసైనా, లేక ఆధార్ కార్డుల్లో వివరాలను చూసినా..వారు పథకానికి అర్హులు కాదని తేలిపోతుంది. అయినా ప్రభుత్వ అధికారులు అంత గుడ్డిగా ఎలా వ్యవహిరించారో అర్థం కావడం లేదు. దేశంలో వేల కోట్లు కొందరు దోచుకుంటుంటే..అధికారులు మాత్రం తాము దోచుకుంటే తప్పేముందన్నట్లు దోపిడీకి తెరతీసినట్లు తెలుస్తోంది.