భగ్నప్రేమికుడు చంద్రబాబు...!?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కాలేజీలో చదువుకునే రోజుల్లో ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకోబోతుంటే..ఆఖరి నిమిషంలో ఆగిపోయిందట. అంతేనా...ఆయన ఎన్టీఆర్ కుమార్తెను పెళ్లి చేసుకోబోయే ముందు క్షణంలో కూడా..సదరు యువతి చంద్రబాబు పెళ్లి వద్దకు వచ్చిందట. ఆమెతో ప్రేమను మరిచిపోలేక..చంద్రబాబు కుమిలిపోయాడట...? విరహగీతాలు పాడుకున్నారట...ఆయనను వై.ఎస్ ఓదార్చాడట..? ఇదేనా..ఇంకా ఉంది ఎన్టీఆర్ కుమార్తెను చంద్రబాబుకు ఇవ్వడానికి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డే ఒప్పించాడట...? ఆయనే చంద్రబాబు, భువనేశ్వరి పెళ్లిని దగ్గర ఉండి చేశాడ...? అంతే కాదు..చంద్రబాబు, వైఎస్సార్ ప్రాణమిత్రులట...? ఒకరిని విడిచి ఒకరు ఉండలేరట...? ఒకరి కోసం ఒకరు త్యాగాలు చేశారట..? ఇద్దరూ ఒకే పార్టీలో ఉండి..అప్పటి ముఖ్యమంత్రుల అవినీతిని బట్టబయలు చేశారట..? ఏమిటి..ఇవన్నీ నిజమే అనుకుంటున్నారా..? కానే కాదు..ఇవి నిన్న విడుదల అయిన మయసభ అనే వెబ్ సిరీస్‌లోని అణిముత్యాలు..? దేవ కట్టా అనే దర్శకుడు తీసిన ఈ వెబ్ సిరీస్ రాజకీయ, చంద్రబాబు, వై.ఎస్ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. చంద్రబాబు, వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డిలు మిత్రులంటూ..వారి రాజకీయ జీవితాన్ని ఆవిష్కరించేందుకు ఈ వెబ్ సిరీస్‌ను తీసినట్లున్నారు. ఈ వెబ్ సిరీస్‌లో ఎక్కడా నేరుగా చంద్రబాబు, రాజశేఖర్‌రెడ్డి పేరులను ఉచ్ఛరింపకపోయినా...ఈ వెబ్ సిరీస్ వాళ్లదేనని రాజకీయ పరిజ్ఙానం కొంచెం ఉన్న ఎవరికైనా..అర్థం అవుతోంది. అయితే..దర్శకుడు తనకు ఉన్న స్వేచ్ఛను ఇష్టారాజ్యంగా వాడుకున్నట్లు కనిపిస్తోంది. చంద్రబాబు, వై.ఎస్‌ల మధ్య అపూర్వస్నేహం ఉన్నట్లు ప్రేక్షకులను నమ్మించడానికి ఎడాపెడా సీన్లు రాసుకున్నారు. చంద్రబాబు పెళ్లి జరిపించడం, ముఖ్యమంత్రులను దించేయడం, ఢిల్లీలోని హైకమాండ్‌ను వీరిద్దరే పదే పదే కలవడం..అదీ ఇందిరాగాంధీ లాంటి నేత...? ఇలా ఒకటేమిటి...? సవాలక్ష సీన్లు..పదే పదే రాసేసుకున్నారు. వాళ్లద్దరూ ఒకరి ఇంటికి ఒకరు రావడం, వారి భార్యలు అన్నయా..అంటూ సంబోధించడాలు..అబ్బో ఎన్నెన్నో ఎబ్బెట్టు దృశ్యాలు...? వాస్తవంలో జరిగిన సంఘటనల్లో కొన్నిటిని తీసుకుని, తరువాత తమ ఇష్టం వచ్చినట్లు మార్చుకున్నారు. వారి ఊహలకు అందిన మేర...ఆ నాయకులు ఎలా ఉంటే బాగుటుందో..అలా...ఎంత కావాలంటే అంత ఎలివేషన్స్ పదే పదే ఇచ్చుకున్నారు. ఇద్దరి అభిమానులను సంతోషపెట్టడానికేనేమో..? వారి ద్వారా ఆదాయం సంపాదించుకునేందుకు లేనిపోని...సీన్లు అనేవారూ ఉన్నారు. అయితే కొన్ని సీన్లు మాత్రం వాస్తవానికి దగ్గరగా ఉన్నాయి. పరిటాల రవి తమ్ముడు హరిని పోలీసులు ఎన్‌కౌంటర్ చేసినప్పుడు దానిపై చంద్రబాబు వై.ఎస్‌ను ప్రశ్నించిన సన్నివేశంలో..హరి నక్సలైట్ అని, సమాజానికి నష్టం చేకూరే వ్యక్తిఅని..అలాంటి వ్యక్తిని పోలీసులు ఎన్‌కౌంటర్ చేస్తే తప్పేమిటన్నట్లు వై.ఎస్ చంద్రబాబును ఎదురు ప్రశ్నిస్తారు..అలా ఎన్‌కౌంటర్ చేయాల్సివస్తే..అది ఫస్ట్ మీ ఇంట్లో నుంచి మొదలు కావాలని చంద్రబాబు ఎదురు కౌంటర్ ఇచ్చే సన్నివేశం వాస్తవానికి దగ్గరగా ఉన్నట్లునిపిస్తుంది. అదే విధంగా..వెన్నుపోటు...అనేది జీవిత కాలపు మచ్చని..దాన్నితాను భరించడానికి సిద్ధంగా ఉన్నానని చంద్రబాబు క్యారెక్టర్ చెప్పడం..కూడా ఆసక్తిని రేకెత్తించింది. రాజారెడ్డి పాత్ర పోషించిన వ్యక్తి అద్భుతంగా నటించారు. వంకలేని విధంగా ఆయన చేశారు. నిజంగా రాజారెడ్డి అలానే ఉంటాడేమో..? అన్నట్లు చేశాడు. అదేమో రెడ్ల పార్టీ... మాకులం వాళ్లు...మాకు మేలు చేయరు..? ఇందిరాగాంధీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు నిజంగా అభ్యంతరకరమే..? మొత్తం మీద...రాజకీయాలపై ఆసక్తి ఉన్నవారికి ఇది ఆసక్తి కలిగించేదే...!