“ఓటు చోరీ” వివాదంలో కీలక మలుపుః కాంగ్రెస్ మంత్రి రాజీనామా
రాహుల్‌గాంధీకి చిక్కులు తెచ్చిపెట్టిన స్వంత మంత్రి
బిజెపికి అస్త్రం అందించిన కాంగ్రెస్ నేతలు...!
ఎదురుదాడి చేస్తోన్న బిజెపి-ఇబ్బందుల్లో కాంగ్రెస్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ చేస్తోన్న “ఓటు చోరీ” వివాదంలో కీలక మలుపు తిరిగింది. ఎన్నికల సంఘం, బిజెపి కలిసి ఓట్లను చోరి చేసి అనేక రాష్ట్రాల్లో గెలిచారని, దీనిపై విచారణ జరిపించాలని రాహుల్‌గాంధీ ఉద్యమాన్ని నిర్వహిస్తున్నారు. అయితే..ఈ వివాదంలో ఆయనకు స్వంత పార్టీ మంత్రి నుంచే ఎదురుదెబ్బ తగిలింది. ఈరోజు ఉదయం కర్ణాటకకు చెందిన కో-ఆపరేషన్ మినిస్టర్ రాజన్న విలేకరులతో మాట్లాడుతూ మహదేవపురలో జరిగిన ఓటర్ల జాబితా అవకతవకలు కాంగ్రెస్ హయాంలోనే జరిగాయని, అప్పుడు పార్టీ నేతలు ఎందుకు కళ్లుమూసుకున్నారని ఆయన బహిరంగానే వ్యాఖ్యానించారు. ఇక్కడ అవకతవకలు కాంగ్రెస్ హయాంలోనే జరిగాయి. అప్పుడే చర్యలు తీసుకుంటే ఇప్పుడీ సమస్యలు వచ్చేవి కావంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ అగ్రనేతలకు ఇబ్బందులు సృష్టించాయి. ఒకవైపు ఎన్నికల సంఘంపై రాహుల్‌గాంధీ పోరాటం చేస్తుంటే..స్వంత పార్టీ మంత్రి ఆయనకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడంతో..కాంగ్రెస్ అధిష్టానం వెంటనే ఆయనను మంత్రివర్గం నుంచి తొలగించమని ముఖ్యమంత్రి సిద్ధిరామయ్యకు ఆదేశాలు జారీ చేసింది. సిఎం సిఫార్సును గవర్నర్ థావర్చంద్ గెహ్లత్ వెంటనే ఆమోదించారు. సిద్ధిరామయ్యకు అత్యంత సన్నిహితుడైన రాజన్న చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్‌లోని అంతర్గత రాజకీయాలు మరోసారి వీధికెక్కే పరిస్థితిని తీసుకువచ్చింది. దానికి మించి ఎన్నికల అక్రమాలపై పోరాడుతోన్న రాహుల్‌గాంధీకి తీవ్ర నష్టాన్ని కల్గచేశాయి. కాగా ఎన్నికల్లో అక్రమాలు చేశారని ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ చేస్తోన్న పోరాటంతో..కొద్దిగా ఇబ్బంది పడ్డ అధికార బిజెపికి ఇప్పుడు కాంగ్రెస్ మంత్రి చేసిన వ్యాఖ్యలు ఊపిరిపోశాయి. ఎన్నికల అక్రమాల్లో కాంగ్రెస్‌దే పైచేయి అని వారు ఎదురుదాడి చేస్తున్నారు. కాగా ఈ “ఓటు చోరీ” వివాదంలో ఇది కీలక మలుపు అని, ఎన్నికల సంఘం అక్రమాలపై ఒక నిష్పక్షపాత చర్చ నుంచి ఇది దారి మల్లిందని, ప్రజాస్వామ్యహితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కొన్నేళ్లగా ఈవిఎంలు, ఎన్నికల సంఘం అక్రమాలతో వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికలపై కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రాహుల్‌గాంధీ చేసిన ఆరోపణలతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎన్నికల అక్రమాలపై ఎంతో కొంత చర్చతో పాటు, ఎన్నికలపై జరుగుతోన్న అనుమానాలు నివృతి అవుతాయని భావిస్తుండగా, కర్ణాటక కాంగ్రెస్‌లోని వర్గ రాజకీయాలు దీనిపై సమ్మెటదెబ్బ వేశాయి.