రేపటి నుండి ‘తల్లికివందనం’ అమలు
కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్కో హామీని నెరవేర్చుకుంటూ వస్తోంది. తాము అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ హామీలను నెరవేరుస్తామని ప్రకటించింది. ఇచ్చిన హామీ మేరకు పలు పథకాలను అమలు చేస్తోంది. సూపర్ సిక్స్‌లో ప్రధాన హామీ అయిన సామాజిక పెన్షన్లను మూడు వేల నుంచి నాలుగు వేలకు పెంచి తొలి హామీని నెరవేర్చింది. అదే విధంగా మూడు ఉచిత సిలిండర్లను పంపిణీ చేస్తోంది. దీనితో పాటు ప్రధాన హామీ అయిన ‘తల్లికివందనం’ పథకాన్ని రేపటి నుంచి అమలు చేయబోతోంది. రాష్ట్రంలో చదువుకునే ప్రతి విద్యార్థికి ఏడా రూ.15000/- ‘తల్లికివందనం’ పేరిట ఇస్తామని హామీ ఇచ్చింది. ఒక ఇంటిలో ఎంత మంది చదువుకునే పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని ప్రకటించింది. ఈ మేరకు కూటమి పాలన ఏడాది పూర్తి అవుతున్న సందర్భంగా ప్రధాన హామీని రేపటి నుంచి అమలు చేయబోతోంది. ‘తల్లికివందనం’ పథకాన్ని అమలు చేయడం లేదని, చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి ఆరోపిస్తున్నారు. ఆయనతో పాటు ఆయన పార్టీ నాయకులు, మరి కొందరు కూడా ఇదే అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు. ‘తల్లికివందనం’ అమలు చేయకపోవడం వల్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని, దాని వల్ల వచ్చే ఎన్నికల్లో కనీసం 10శాతం ఓట్లు కూటమి పోగొట్టుకుంటుందని కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ ఒకటే ఊదరగొటుతున్నాయి.
ఒక వైపు ప్రభుత్వం బడులు తెరిచిన వెంటనే ఈ పథకాన్ని అమలు చేస్తామని చెబుతున్నా..వీళ్లు మాత్రం ఆ పథకం అమలు చేయడం లేదని, ఇక చేరని ఒకటే..నస మొదలు పెట్టారు. వీరంతా ఎందుకు ఈ విధంగా చేస్తున్నారో తెలియదు కానీ..ప్రభుత్వంపై వ్యతిరేకతను పెంచడానికి ‘తల్లికివందనం’ పథకాన్ని ఒక ఆయుధంలా మార్చుకున్నారు. చంద్రబాబు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పథకాన్ని అమలు చేయరని, తద్వారా రాజకీయ లబ్ది పొందాలని వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డి భావించారు. అయితే...ఆయన ఆశలు అడియాసలు చేస్తూ..కూటమి ప్రభుత్వం అనుకున్నట్లుగానే రేపటి నుంచి పథకాన్ని అమలు చేయబోతోంది. దీని ద్వారా చదువుకునే ప్రతి ఒక్కరికి రూ.15వేలు లభించబోతున్నాయి. బడులు ప్రారంభమయ్యే రోజునే తల్లుల ఎకౌంట్‌లో ‘తల్లికివందనం’ వేయడం ద్వారా..తల్లిదండ్రులకు, విద్యార్థులకు ఉపయోగంగా ఉంటుంది. గత జగన్ ప్రభుత్వంలో అమ్మ ఒడి సొమ్ములను జనవరిలో వేసేవారు. దీంతో..పండుగ రోజుల్లో చాలా మంది వివిధ ఖర్చులకు ఆ సొమ్ములను వాడుకునే వారు. దాని వల్ల ప్రభుత్వ ఉద్దేశ్యం నెరవేరేది కాదు. సంక్రాంతి రోజుల్లో కొందరు ఆ సొమ్ములను కోడి పందేలకు, మద్యం వినియోగానికి ఉపయోగించారు. దీని వల్ల ప్రభుత్వం అనుకున్న లక్ష్యాలను సాధించలేకపోయింది. పైగా అప్పట్లో విద్యార్థికి రూ.15000/- ఇస్తామని ప్రకటించి...దానిలో రూ.2వేలు ఇతర అవసరాలకు విద్యార్థి నుంచి తీసుకునేవారు. అయితే కూటమి ప్రభుత్వం మాత్రం ముందుగా ప్రకటించినట్లు రూ.15వేలు ఖచ్చితంగా ఇవ్వబోతోంది. ఇన్నాళ్లూ ఈ పథకం అమలు చేయరని చెప్పిన వాళ్లకు చంద్రబాబు ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చినట్లే..!