I&PR కస్తూరికి పోస్టింగ్
వైకాపా ప్రభుత్వ హయాంలో రాష్ట్ర సమాచారశాఖలో జాయింట్ డైరెక్టర్‌గా పనిచేసి తరువాత జిఏడీకి అటాచ్ చేయబడిన తేళ్ల కస్తూరి బాయికి రాష్ట్ర ప్రభుత్వం దాదాపు ఏడాది తరువాత మళ్లీ పోస్టింగ్ ఇచ్చింది. ఆమెను ఒంగోలు రీజనల్ జాయింట్ డైరెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం గత రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. గత కొంత కాలంగా ఆమె పోస్టింగ్ కోసం యత్నిస్తోంది. అయితే గత వైకాపా ప్రభుత్వ హయాంలో రాష్ట్ర సమాచారశాఖలో జరిగిన అవినీతిపై విచారణ జరుగుతోన్న నేపథ్యంలో ఆమెకు పోస్టింగ్ ఇవ్వలేదు. అయితే..సమాచారశాఖ అవినీతిపై ఇంత వరకూ ఏమీ తేలకపోయినా..ప్రభుత్వం ఆమెకు పోస్టింగ్ ఇచ్చింది. అసలు ఏడాది క్రితం ఆమెను ఎందుకు జిఎడికి అటాచ్ చేశారు..? ఏడాది ఖాళీగా ఉంచి..ఇప్పుడు ఏమీ తేలకుండానే పోస్టింగ్ ఎందుకు ఇచ్చినట్లు..? అంటే..ఆమెపై ఉన్న ఆరోపణల్లో పసలేదని ప్రభుత్వం భావిస్తోందా..? లేక సమాచారశాఖలో అవినీతే జరగలేదు..? అందరూ నీతిపరులే..? అని ప్రభుత్వం సర్టిఫికెట్ ఇస్తోందా..? అసలు ఏమీ లేకపోయినప్పుడు ఆమెను ఇన్నాళ్లు ఖాళీగా ఎందుకు ఉంచారు..? ఒకవైపు అధికారుల కొరత అని చెప్పే ప్రభుత్వం అప్పుడే ఆమెకు పోస్టింగ్ ఇవ్వాల్సింది. రాజకీయ ఒత్తిడితోనే..కుల సంఘాల ఒత్తిడికో భయపడి పోస్టింగ్ ఇస్తే..అవినీతిపై చర్యలు తీసుకుంటాం..అని చెబితే..ఈ ప్రభుత్వాన్ని ఎవరూ నమ్మరు.
వైకాపా హయాంలో సమాచారశాఖ కమీషనర్‌గా పనిచేసిన విజయ్‌కుమార్‌రెడ్డి అవినీతికి, అక్రమాలకు పాల్పడ్డారని ఆయనకు పలువురు శాఖకు చెందిన అధికారులు సహకరించారనే దానిపై ఏసీబీ, విజిలెన్స్ విచారణ జరుగుతోంది. ఈ విచారణ ఇంకా ఒక కొలిక్కి రాలేదు. తనను ఈ కేసుల్లో అరెస్టు చేయవద్దని విజయ్‌కుమార్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఆయనకు కోర్టు నుంచి ఉపశమనమేమీ లభించలేదు. ఒకవేళ ఏసీబీ, విజిలెన్స్ ఆయనను అరెస్టు చేయదలచుకుంటే చేసుకునే అవకాశం ఉంది. అయితే..ప్రభుత్వం మాత్రం ఈ కేసు విషయంలో సాచివేత ధోరణిని అవలంభిస్తోంది. ఒకవైపు సమాచారశాఖలో భారీగా అక్రమాలు, అవినీతి జరిగిందని ఏసీబీ, విజిలెన్స్ ప్రాధమికంగా తేల్చింది. అయితే మరోవైపు మాత్రం ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై ఇంత వరకూ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అప్పట్లో కమీషనర్‌గా పనిచేసిన విజయ్‌కుమార్‌రెడ్డిపై ఇంత వరకూ ఈగ కూడా వాలలేదు. ఆయనను ఎవరు కాపాడుతున్నారో తెలియదు కానీ..రాష్ట్ర సమాచారశాఖలో జరిగిన అవినీతిపై ప్రభుత్వ పెద్దలు పెద్ద సీరియస్‌గా ఉన్నట్లు అనిపించడం లేదు.
ఒకవైపు విజయ్‌కుమార్‌రెడ్డిపై చర్యలు లేవు..మరోవైపు ఆయనకు సన్నిహితులనుకున్నవారికి వరుసగా పోస్టింగ్‌లు ఇచ్చుకుంటూ పోతున్నారు. మరోవైపు మాత్రం సమాచారశాఖలో జరిగిన అవినీతిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర సమాచారశాఖమంత్రి కొలుసు పార్థసారధి అసెంబ్లీలో చెప్పారు. అయితే..ఆయన దీనిపై చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. పైగా అవినీతిపరులపై చర్యలు తీసుకునే ఉద్దేశ్యం కూడా ఆయనకు ఉన్నట్లు కనిపించడం లేదు. పైగా విజయ్ కుమార్‌రెడ్డితో కుమ్మక్కాయరనే ఆరోపణలు ఉన్న అధికారులకు మళ్లీ పోస్టింగ్‌లు ఇస్తున్నారు. అవినీతిపై చర్యలు ఇలానానా..? ప్రభుత్వ పెద్దలు..దీనిపై దృష్టిపెట్టకపోవడంతో..మంత్రి కార్యాలయం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్ర సమాచారశాఖ అవినీతిపై వివిధ మాద్యమాల్లో భారీ స్థాయిలో కథనాలు వచ్చాయి. అయితే..వాటిని మంత్రి ఏమాత్రం ఖాతరు చేయనట్లుంది. మొత్తం అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్న అధికారులకు ఒకరి తరువాత ఒకరికి పోస్టింగ్‌లు ఇచ్చుకుంటూ వెళుతున్నారు. పైగా ఈ అధికారులందరూ వైకాపాకు మద్దతుదారులనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఏది ఏమైనా..సమాచారశాఖను నిర్వహించడంలో మంత్రి కొలుసు పార్థసారధి దారుణంగా విఫలమయ్యారనే మాట జర్నలిస్టు వర్గాల్లో వినిపిస్తోంది. ఏడాదిన్నరగా అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వలేదు...కానీ అవినీతి మకిలిం అంటుకున్నవారిని మాత్రం ప్రోత్సహిస్తున్నారనే మాట..సర్వత్రా వినిపిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ప్రభుత్వంలో కీలకమైన మంత్రి నారా లోకేష్‌లు సమాచారశాఖను గాలికి వదిలేశారని, దాంతో శాఖలో వైకాపా మద్దతుదారుల హవా మళ్లీ మొదలైందని,వీరి వల్ల జర్నలిస్టు వర్గాలు ప్రభుత్వానికి దూరమయ్యేఅవకాశాలున్నాయి.