ఎవరి కోసమో... ఈ చట్టం....!?
నేరం చేస్తే..ప్రధాని మంత్రినైనా పదవి నుంచి తప్పించేస్తాం..అంటూ కేంద్ర ప్రభుత్వ పెద్దలు తెస్తోన్న చట్టంపై అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం చేయబోతోన్న ఈ చట్టం ప్రకారం ప్రధాని మంత్రి కానీ, కేంద్ర మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ, కేంద్రపాలిత ముఖ్యమంత్రులు కానీ..ఏదైనా క్రిమినల్ కేసులో జైలుకు వెళ్లి 30రోజులకుపైగా జైలులో ఉంటే..వాళ్ల పదవి దానంతట అదే ఊడిపోతుంది. ఈ చట్టం ఈ సమావేశాల్లో ఆమోదించాలని కేంద్రం భావిస్తోంది. అయితే..ఈ చట్టం ప్రతిపక్షాలను ఉద్దేశించి తెస్తున్నారని, కొన్ని రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలను అస్థిరం చేయడానికి లేక అక్కడ ఉన్న ముఖ్యమంత్రులను మార్చడానికే ఇది తెస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. కొందరిని టార్గెట్ చేయడానికే ఇటువంటి చట్టాలు చేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. గతంలో కొందరు ముఖ్యమంత్రులు జైలుకు వెళ్లినా ముఖ్యమంత్రి పదవిని వదులుకోకపోవడంతో..ఇప్పుడు ఈ విధమైన చట్టాన్ని తెస్తున్నారని అధికార పార్టీ నేతలు అంటున్నారు. ఇదేదో కొందరిని టార్గెట్ చేయడానికి కాదని వాళ్లుచెబుతున్నా..బిజెపి పెద్దలను ప్రతిపక్షాలు నమ్మడం లేదు. నిజంగా అవినీతి, క్రిమినల్ కేసుల్లో ఉన్నవాళ్లను శిక్షించే ఉద్దేశం బిజెపి పెద్దలకు ఉంటే..ఇప్పటికే లక్షల కోట్లు దిగమింగిన వారిని ఎందుకు వదిలేశారనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.
జగన్‌ను ఎందుకు వదిలేశారు..?
క్రిమినల్, అవినీతి కేసుల్లో ఉన్న నాయకులను శిక్షించాలనే కోరిక బిజెపి పెద్దలకు ఉంటే..ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డిపై చర్యలు ఎందుకు తీసుకోలేదు. చర్యలు తీసుకోకపోయినా..ఆయనకు ఎందుకు మద్దతు ఇచ్చారనే ప్రశ్న అన్ని వర్గాల నుంచి వస్తోంది. వీళ్లకు నేరగాళ్లను శిక్షించాలనే చిత్తశుద్ధి ఉంటే జగన్ ముఖ్యమంత్రి అయ్యేవాడా..? అనే ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి. లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలతో పాటు, తన స్వంత బాబాయి హత్య కేసులో విమర్శలు ఎదుర్కొంటున్న జగన్‌ను ఎందుకు కాపాడారు..? వివేకానందరెడ్డి కేసులో సీబీఐ చేతులు ఎందుకు కట్టేశారు.? వేల కోట్ల లిక్కర్ స్కామ్‌పై ఈడి దర్యాప్తు ఎందుకు చేయరనే ప్రశ్నలు దూసుకువస్తున్నాయి. ఆంధ్రా సంగతి పక్కన పెట్టినా..తెలంగాణలో జరిగిన ఫోన్‌ట్యాపింగ్, కాళేశ్వరం అవినీతిపై చర్యలేవి...? దాదాపు 21 కేసుల్లో నిందితునిగా ఉన్న జగన్మోహన్‌రెడ్డి ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటే..అప్పుడెప్పుడూ ఆయనను శిక్షించాలి..ఆయనను పదవి నుంచి తప్పించాలనే ఆలోచనే బిజెపి పెద్దలకు రాలేదా..? ఇప్పుడు హఠాత్తుగా నేర రాజకీయనాయకులపై చర్యలు తీసుకోవాలనే ఎందుకు వచ్చింది..? ఇదెవరినో ఇబ్బంది పెట్టడానికి తప్ప వాళ్లలో ఎటువంటి చిత్తశుద్ది లేదని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. మొత్తం మీద..బిజెపి పెద్దలు తెస్తోన్న ఈ చట్టం ద్వారా ఎవరికి మూడుతుందో చూడాలి మరి.