జగన్ వీరత్వం ఇదేనా..!?
ఘోరమైన పరాజయం తరువాత కూడా వైకాపా అధినేత వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డిలో మార్పేమీ లేదని, ఆయన తన స్వంత ప్రయోజనాలకే పెద్దపీట వేస్తారని, ప్రజలకు సంబంధించిన విషయాలు ఆయనకు పట్టవని మరోసారి అది నిరూపితమైందని కొందరు వైకాపా నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత అయినా పార్టీ నిర్ణయాల్లోనూ, విధాన నిర్ణయాలను నాయకులతో కానీ, కార్యకర్తలతో కానీ చర్చిస్తారని భావిస్తే..అదేమీ జరగడం లేదని, అన్నీ ఒంటెత్తుపోకడలేనని వారు అంతర్గతంగా అధినేత తీరుపై ధ్వజమెత్తుతున్నారు. అప్పటికీ ఇప్పటికీ మార్పేమీ లేదని, అప్పుడు ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడూ పెత్తనం చేస్తున్నారని, అధికారంలో ఉన్నప్పుడూ ఆయనే అంతా హవా నడిపించారు..సకలశాఖల మంత్రిగా వ్యవహరించారు.. మిగతా విషయాలు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలు చూసుకున్నారు. ఇప్పుడీ అదే జరుగుతోందని పార్టీని నమ్మకున్న కొందరు నాయకులు వాపోతున్నారు. మొన్నటికి మొన్న స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను జగన్ ఆవిష్కరించకుండా సజ్జలతో ఆవిష్కరింపచేశారని, ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండి...జాతీయ జెండాను కూడా ఆవిష్కరించే తీరిక ఆయనలో లేదా...? ఈ పనీ తన పాలేరుతోనే చేయించాలా..? అంటూ కొందరు నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు పార్టీని నడిపే తీరు ఇదేనా..ఎప్పుడూ ఆ సజ్జల రెడ్డి లేకపోతే మరో రెడ్డి తప్ప..పార్టీలో ఇక ఇతర నాయకులు లేరా..? అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. ఇది ఇలా ఉంటే..ఉపరాష్ట్రపతి ఎన్నికలో పార్టీ విధానం గురించి ఎవరినీ చర్చించకుండానే, బిజెపి అడగకుండానే ఎన్టీఏకుమద్దతు ప్రకటించారని, దీని వల్ల పార్టీ ప్రజల్లో పలుచన అవుతుందనే సృహ కూడా ఆయనలో లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనను జైలుకు పంపుతారేమో అన్న భయంతో ఆయనే ముందుగా ఎన్టీఏకు మద్దతు ప్రకటించారని, మొన్నటి ఎన్నికల్లో ఇదే ఎన్టీఏతో పోటీ చేసి ఓడిపోయిన పార్టీగా మళ్లీ అదే ఎన్టీఏకు మద్దతు ఇవ్వడం ఏమిటని వారు తమలో తాము ప్రశ్నించుకుంటున్నారు. కాగా...జగన్ నిర్ణయంపై కాంగ్రెస్ ఎద్దేవా చేస్తోంది. మోడీ, షాలకు భయపడి జగన్...ఎన్టీఏకు మోకరిల్లుతున్నారని, ఇలాంటి వ్యక్తుల వల్ల జరిగేదేమీఉండదని వారు విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా..సోనియాను ఎదిరించిన ధీరుడు, ఢిల్లీని వణికించిన వీరుడూ..అంటూ వైకాపా కార్యకర్తలు డబ్బా కొట్టుకుంటారని, కానీ..ఇప్పుడు మోడీ, షాలు ముందు ఎందుకు సాగిలపడుతున్నాడని ప్రత్యర్థులు ఎద్దేవా చేస్తున్నారు. ఇదేనా..ఆయన వీరత్వం..అంటూ..ఎగతాళి చేస్తుండగా..మరి కొందరు మాత్రం మన వీరుడి ప్రతాపం స్వంత బాబాయి, స్వంత చెల్లి, తల్లి, బాబాయి కూతురుపైనే..కదా..అంటూ.. ఎద్దేవా చేస్తున్నారు. మొత్తం మీద జగన్ వ్యవహారశైలిపై స్వంత పార్టీ నాయకులే విమర్శలు, వ్యంగ్యోక్తులు విసురుకుంటున్నారు.