జర్నలిస్టు కృష్ణంరాజు అరెస్టు
అమరావతి మహిళలను వేశ్యలంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టు కృష్ణంరాజును పోలీసులు అరెస్టు చేశారు. ఆయన గత కొన్నాళ్ల నుంచి పరారీలో ఉన్నారు. అయితే..ఈరోజు ఆయనను భీమిలి వద్ద అమరావతి పోలీసులు అరెస్టు చేశారు. అక్కడ నుంచి ఆయనను విజయవాడకు తరలిస్తున్నారు. రేపు కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ కేసులో సాక్షి యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా ఆయనకు న్యాయమూర్తి 14రోజుల పాటు రిమాండ్ విధించారు. గత వారంలో సాక్షి ఛానెల్‌లో కొమ్మినేని నిర్వహించిన షోలో కృష్ణంరాజు అమరావతి మహిళలను ఉద్ధేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. అమరావతి చుట్టుపక్కల ఉండే మహిళలందరూ వేశ్యవృత్తిలో జీవిస్తున్నారంటూ. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి వేశ్యల రాజధాని అయిందంటూ కృష్ణంరాజు వ్యాఖ్యానించగా, దానికి కొమ్మినేని మద్దతు ఇచ్చారు. ఏదో పత్రికలో ఆ వార్త వచ్చిందని, తాను కూడా చూశానని కొమ్మినేని కృష్ణంరాజును బలపరిచారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉద్యమిస్తున్నారు. వీరిద్దరిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా పలు పోలీస్‌స్టేషన్లలో కేసులు పెడుతున్నారు. ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుని కొమ్మినేనిని అరెస్టు చేసింది. కొమ్మినేని అరెస్టు తరువాత కృష్ణంరాజు పరార్ అయ్యారు. తనను ఈ కేసులో అరెస్టు చేయకుండాముందస్తు బెయిల్ ఇవ్వాలని ఆయన కోర్టు మెట్లు ఎక్కారు. అయితే..అక్కడ నుంచి ఎటువంటి ఆర్డర్స్ రాకముందే...ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. మహిళలను ఉద్దేశించి వీరిద్దరూ చేసిన వ్యాఖ్యలు తీవ్రదుమారాన్ని రేపుతున్నాయి. జాతీయ మహిళా హక్కుల సంఘం వీరిపై సుమోటోగా కేసు నమోదు చేసింది. కాగా..తాను చేసిన వ్యాఖ్యలను కృష్ణంరాజు సమర్థించుకుంటూ వీడియోలు విడుదల చేస్తున్నారు.