జన్మలో జగన్ సిఎం కాలేడుఃఉండవల్లి
తెలుగుదేశం, జనసేన పార్టీలు రెండూ కలిసి ఉంటే...వైకాపా అధినేత వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి జన్మలో మళ్లీ సిఎం కాలేడని మాజీ ఎంపి, జగన్ మేలు కోరే ఉండవల్లి అరుణ్‌కుమార్ పేర్కొన్నారు. తెలుగుదేశం, జనసేనపార్టీలు రెండూ 2029లో కలిసి పోటీ చేస్తే 50శాతం పైన ఓట్లు వస్తాయని, అందువల్ల వైకాపా అధికారంలోకి వచ్చే ప్రసక్తేలేదని ఆయన చెప్పారు. ఈ కూటమికి 50శాతం ఓట్లు వస్తే కనీసం 145 నుంచి 155 సీట్లు వస్తాయని ఆయన అన్నారు. అదీ కాకుండా 2029లోపల వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఈడీ కేసుల్లో జైలుకు వెళతారని, సీబీఐ 22 కేసులు పెట్టిందని, వీటిలో ఏదైనా ఒకదానిలో అయినా జైలు శిక్ష పడితే ఆయన డిస్క్‌క్వాలిఫై అవుతారని, తద్వారా మరో పదేళ్ల వరకూ ఆయన పోటీ చేసే అవకాశం ఉండదని, శాసనసభకు పోటీ చేసే అవకాశం ఉండదు కనుక జగన్ మళ్లీ సిఎం అయ్యే అవకాశమే లేదని ఉండవల్లి చెప్పారు. తాను పదే పదే జగన్ జన్మలో సిఎం కాలేడని చెబుతున్నా..అది జనంలోకి వెళ్లడం లేదని దీన్ని కూటమి నాయకులు, కార్యకర్తలు వాడుకోవడం లేదని ఉండవల్లి చెబుతున్నారు. గతంలో 2014-19 మధ్య తాను అప్పటి టిడిపి ప్రభుత్వంపై ఏ విమర్శలు చేసినా జగన్ అండ్ కో బాగా వాడుకున్నారని, దాని వల్లే..అప్పట్లో వైకాపాను జనం నమ్మారని, దానితో వారికి ఘనవిజయం లభించిందని ఆయన అంటున్నారు. కాగా ఉండవల్లి చెప్పిన దాంట్లో చాలా వాస్తవం ఉంది. ఆయన జగన్‌కు వ్యతిరేకంగా మాట్లాడే మాటలను టిడిపి కూటమి ఉపయోగించుకుంటే బాగానే ఉంటుంది. కానీ..ఆయనను ఉపయోగించుకోవాలనే ఆసక్తి టిడిపి పెద్దలకు ఏలేనట్లు ఉంది.