TTD EOగా సింఘాల్
తిరుమల తిరుపతి దేవస్థానం ఇఓగా అనిల్‌కుమార్ సింఘాల్‌ను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఇఓగా ఉన్న శ్యామలరావును బదిలీ చేసింది. సింఘాల్ గతంలోనూ టీటీడీ ఈఓగా పనిచేశారు. గత కొంతకాలంగా పోస్టింగ్ కోసం ఎదురు చూస్తోన్న సింఘాల్‌ను ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన టీటీడీ ఇఓగా మరోసారి నియమించింది. కేంద్రంలోని బిజెపి పెద్దల ఆశీస్సులతో ఆయనకు ఈ పోస్టు దక్కినట్లు ఐఏఎస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కేంద్ర హోంమంత్రి సిఫార్సుతోనే ఆయనకు ప్రాధాన్యత కలిగిన పోస్టు ఇచ్చారనే ప్రచారం ఉంది. కాగా ప్రస్తుతం ఇఓగా ఉన్న శ్యామలరావును జీఎడి ముఖ్యకార్యదర్శిగా నియమించారు. గత కొన్నాళ్లుగా ఆయనను బదిలీ చేస్తారనే ప్రచారం ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత శ్యామలరావును టీటీడీ ఇఓగా నియమించారు. అయితే ఈయన కాలంలోనే కల్తీ నెయ్యి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తరువాత తిరుపతిలో జరిగిన తొక్కిసలాట కూడా ఈయన హయాంలోనే జరిగింది. అప్పట్లో టీటీడీ ఈఓ, టీటీడీ ఛైర్మన్ నాయుడు బహిరంగంగానే పలు విమర్శలు చేసుకుని సంచలనం సృష్టించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారిద్దరి మధ్య సయోధ్య కుదిర్చారనే వార్తలు వచ్చాయి. అయితే ఐఏఎస్‌ల బదిలీలు ఎప్పుడు జరిగినా శ్యామలరావు బదిలీ ఖాయమనే ప్రచారం ఉంది. దీన్ని నిజం చేస్తూ ఈ రోజు ఆయనను బదిలీ చేశారు. అయితే..ఆయనకు అత్యంత ప్రాధాన్యత కలిగిన జీఎడీ (పొలిటికల్) ప్రధాన కార్యదర్శి పోస్టులో నియమించారు. కాగా వైద్య,ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న కృష్ణబాబును రోడ్లు,భవనాలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించారు. గత కొన్నాళ్లుగా ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు కృష్ణబాబుకు మధ్య విబేధాలు ఉన్నాయని, ఆయనను మార్చాలని సత్యకుమార్ ముఖ్యమంత్రిని కోరుతున్నారనే ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో కృష్ణబాబును బదిలీ చేశారు. కాగా జిఎడి పొలిటికల్ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ముఖేష్‌కుమార్ మీనాను ఎక్సైజ్ శాఖ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. జిఎడీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ముఖేష్‌కుమార్ మీనా ఇటీవల ఉద్యోగుల రిజర్వేషన్ల విషయంలో వ్యవహరించిన తీరుతో ఆయనను బదిలీ చేశారంటున్నారు. పౌరసరఫరాలశాఖ కమీషనర్‌గా ఉన్న సౌరభ్‌గౌర్‌ను వైద్యశాఖ కార్యదర్శిగా నియమించారు. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న జి.అనంతరామును గవర్నర్ కార్యదర్శిగా ప్రభుత్వ నియమించింది.ఇప్పటి వరకూ గవర్నర్ కార్యదర్శిగా ఉన్న హరిజవహర్‌లాల్‌ను దేవా దాయశాఖ కార్యదర్శిగానూ, మైనార్టీశాఖ కమీషనర్‌గా ఉన్న సిహెచ్ శ్రీధర్‌ను మైనార్టీశాఖ కార్యదర్శిగా నియమించారు. పరిశ్రమలశాఖ కార్యదర్శిగా ఉన్న ప్రవీణ్ కుమార్‌ను ఢిల్లీలోని ఎపి భవన్ రెసిడెంట్ కమీషనర్‌గానూ, లేబర్ కమీషనర్‌గాఉన్న వి.శేషగిరిబాబును లేబర్ శాఖ కార్యదర్శిగానూ, రోడ్లు,భవనాలశాఖ కార్యదర్శిగా ఉన్న కాంతిలాల్ దండేను ఇఎఫ్ఎస్&టి కార్యదర్శిగా నియమించారు.