I&PR డైరెక్టర్ హిమాన్ష్ శుక్లా బదిలీ
రాష్ట్ర సమాచారశాఖ డైరెక్టర్ హిమాన్ష్ శుక్లాను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయనను నెల్లూరు కలెక్టర్‌గా ప్రభుత్వం నియమించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆయనను రాష్ట్ర సమాచారశాఖ డైరెక్టర్‌గా ప్రభుత్వం నియమించింది. అప్పటి నుంచి ఆయన సమాచారశాఖ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. యువ ఐఏఎస్‌గా ఆయన సమాచారశాఖను సమర్థవంతంగానే నిర్వహించారు. ఆయన శాఖ బాధ్యతలు చేపట్టేనాటికి...శాఖ అస్తవ్యస్థంగా ఉంది. గత ప్రభుత్వ హయాంలోనే జరిగిన అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్, ఏసీబీ దర్యాప్తు చేయించడం, కొందరు అధికారులను జీఎడీకి అటాచ్ చేయడం, మరి కొందరిని విచారణకు పిలుస్తుండడంతో..అక్కడ పనిచేయడం కత్తిమీద సాములానే అప్పట్లో ఉంది. గత ప్రభుత్వ పాపాలలో భాగస్వాములైన వారిని దూరం పెట్టి, మిగతా అధికారులతో ఆయన డిపార్ట్‌మెంట్ ను నడిపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు లోకేష్‌ల పనితీరును ఆకలింపు చేసుకుని, ఆధునిక టెక్నాలజీని ఉపయోగిస్తూ...వారిని దృష్టిలో పడ్డారు. ఒకవైపు శాఖను చక్కదిద్దుతూనే మరోవైపు సిఎంఓలో తలలో నాలుకలా వ్యవహరించారు. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబుకు అత్యంత ఇష్టమైన వ్యక్తిగా మారారు. ముఖ్యమంత్రి నిర్వహించే ప్రతి సమీక్షలోనూ శుక్లా తప్పకుండా ఉండేస్థాయికి ఎదిగారు. అయితే..ఎప్పటి నుంచో కలెక్టర్‌గా పనిచేయాలనే తలంపుతో ఉన్న శుక్లాకు ప్రభుత్వం ఇప్పుడు అవకాశం కల్పించింది. జిల్లా కలెక్టర్‌గా తానేమిటో రుజువు చేసుకోవాలనే తపన ఆయనలో ఉంది. కాగా సమాచారశాఖ డైరెక్టర్‌గా ఆయన నిజమైన జర్నలిస్టులకు తలలో నాలుకలా వ్యవహరించారు. ఒక మెస్సేజ్ పంపితేచాలు స్పందించేవారు. జర్నలిస్టులు అడిగిన సమాచారాన్ని ఎంతో వేగంగా అందించేవారు. గతంలో ఏ కమీషనర్ ఈ విధంగా స్పందించిన దాఖాలు లేవు.
చిన్నపత్రికలకు ఆపద్భాంధవుడు...!
గతంలో సమాచారశాఖకు అధిపతులుగా పనిచేసేవారు చిన్నపత్రికలను చిన్నచూపు చూసేవారు. ముఖ్యంగా వైకాపా హయాంలో చిన్నపత్రికలను కనీసం సమాచారశాఖ గుమ్మం కూడా తొక్కనీయలేదు. ఐదేళ్ల జగన్ పాలనలో చిన్నపత్రికలకు ఒక్కటంటే ఒక్క యాడ్ ఇచ్చిన పాపానపోలేదు. ఒకవేళ ఇచ్చినా..వాటి బిల్లులు ఇప్పటిదాకా ఇవ్వలేదు. సరి కదా..గత టిడిపి ప్రభుత్వ హయాంలో ఇచ్చిన యాడ్స్ సొమ్ములే ఇవ్వలేదు. అదేమంటే..ఆ ప్రభుత్వం ఇచ్చిన యాడ్స్ కు తాము సొమ్ములు ఇవ్వమని నిసిగ్గుగా చెప్పుకున్నారు. అయితే..శుక్లా సమాచారశాఖ డైరెక్టర్‌గా వచ్చిన తరువాత చిన్నపత్రికలకు న్యాయం జరిగిందని చెప్పవచ్చు. ఆయన డైరెక్టర్‌గా వచ్చిన తరువాత ప్రభుత్వం ఏ సందర్భంలో యాడ్స్ ఇచ్చినా..చిన్నపత్రికలకూ ఇచ్చేశారు. అంతేనా..ఒకేసారి..వారికి ఏడు బిల్లులకు సొమ్ములు చెల్లించేశారు. గతంలో ఏ కమీషనర్ ఈవిధంగా చిన్నపత్రికలకు సహకారం అందించినవారు లేరు. శుక్లా మాత్రం చిన్నపత్రికల వాళ్ల ఇబ్బందులను గమనించి, ఆయనే స్వయంగా ఆర్థికశాఖ చుట్టూ తిరిగి వారికి బిల్లులు ఇప్పించారు. పెద్ద పత్రికలవాళ్లు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఏదో విధంగా వారి బిల్లులు తెచ్చుకుంటారు..చిన్నవాళ్లు తెచ్చుకోలేరని ఆయనే చొరవ తీసుకుని వారికి బిల్లులు పడే విధంగా కృషిచేశారు. ఈవిషయంలో ఆయనను అభినందించకుండా ఉండలేం. మొత్తం మీద చిన్నపత్రికలకు ఆయన అపద్భాంధవుడనే చెప్పాలి.
సున్నితమైన జిల్లాకు కలెక్టర్...!
కాగా ఇప్పుడు కలెక్టర్‌గా ఆయన రాజకీయంగా అత్యంత సున్నితమైన జిల్లాకు వెళుతున్నారు. వాస్తవానికి నెల్లూరు జిల్లా చాలా ప్రశాంతమైన జిల్లా. అయితే..రాజకీయంగా మాత్రం చాలా సున్నితమైనది. ఒకవైపు అధికారపక్షం, మరోవైపు బలమైన ప్రతిపక్షం ఉండడం..ఈ జిల్లాలో కలెక్టర్‌గా పనిచేయడం కత్తిమీద సాములాంటిదే. టిడిపిలోని వర్గాలు, వైకాపా నాయకులు పెట్టే ఇబ్బందులను జిల్లా కలెక్టర్‌గా ఉన్న వ్యక్తి కాచుకోవాలి. ఎక్కడ ఎటువంటి పొరపాట్లు జరిగినా..కలెక్టర్‌కు ఇబ్బందులు తప్పవు. గతంలో ఈ జిల్లాలో కలెక్టర్‌గా పనిచేసిన వాళ్లను అక్కడి రాజకీయ నాయకులు నానా రకంగా ఇబ్బంది పెట్టారు. మరి ఇటువంటి జిల్లాలో హిమాన్ష్‌శుక్లా ఏవిధంగా పనిచేస్తారో చూడాలి.