వందేళ్ల వ‌య‌స్సు దాటిన వారు... దాదాపు ల‌క్ష‌మంది...!?

15, Sep 2025

నిండునూరేళ్లూ జీవించు..అంటూ పెద్ద‌లు దీవిస్తుంటారు. కానీ..ప్ర‌స్తుత రోజుల్లో వందేళ్లు బ‌త‌క‌టం..క‌ష్ట‌మైన ప‌నే. పొల్యూష‌న్‌, అంటువ్యాధులు, ధీర్ఘ‌కాలిక వ్యాధులు, గుండెపోట్లు, ప‌క్ష‌వాతాల‌తో...ముక్కుప‌చ్చాల‌ర‌ని వారు కూడా మృత్య‌వాత ప‌డుతున్నారు. ముఖ్యంగా భార‌త‌దేశంలో ఇటీవ‌ల కాలంలో గుండెపోట్లు విప‌రీతంగా పెరిగిపోయాయి. దీనికార‌ణంగా ఎక్కువ మంది మృత్యువాత ప‌డుతున్నారు. కార‌ణాలు ఏవైనా..భార‌త‌దేశంలో వందేళ్లు జీవించేవారు చాలా త‌క్కువ మందే. అయితే..జ‌పాన్‌లో మాత్రం శ‌తాధికులు రోజు రోజుకు పెరిగిపోతున్నారు. తాజాగా జ‌పాన్‌లో వందేళ్ల‌కు పైగా జీవించిన వారి సంఖ్య దాదాపు ల‌క్ష‌కు చేరింద‌ట‌. ఆ దేశ ఆరోగ్య‌, శ్ర‌మ మ‌రియు సంక్షేమ మంత్రిత్వ‌శాఖ విడుద‌ల చేసిన జాబితా ప్ర‌కారం ఆదేశంలో వందేళ్లు దాటిన వారు 99,763 మంది ఉన్నార‌ట‌. అంటే దాదాపు ఈ సంఖ్య ల‌క్ష వ‌ర‌కూ ఉన్న‌ట్లే.  ‘శతాధికులు’ అంటే 100 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గల వ్యక్తులు. ఇది అసాధారణమైన దీర్ఘాయుష్షుకు సూచికగా భావిస్తారు. ఎందుకంటే ప్రపంచ సగటు ఆయుష్షు 100 ఏళ్లకు తక్కువగానే ఉంటుంది. ప్రస్తుతం జపాన్‌లో అత్యంత వయస్సు గల మహిళ శిగెకో కగావా. ఆమె వయస్సు 114 ఏళ్లు. ప్రసవ, స్త్రీ రోగ నిపుణురాలిగా పనిచేసిన ఆమె, రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఒసాకాలోని ఒక ఆసుపత్రిలో వైద్యురాలిగా సేవలందించారు. అత్యంత వయస్సు గల పురుషుడు మిజునో కియోటాకా, ఆయన వయస్సు 111 ఏళ్లు. ఆయన ఇవాటాలో జన్మించారు. తన యువక వయస్సులో చక్రవర్తికి గార్డుగా పని చేశారు. అలాగే 1936లో జరిగిన ఫిబ్రవరి 26 తిరుగుబాటు సంఘటనలో, రెండో ప్రపంచ యుద్ధంలో కూడా సేవలందించారు.  జపాన్ ఆరోగ్య మంత్రి టాకమారో ఫుకోకా శతాధికులను అభినందిస్తూ, “సమాజ అభివృద్ధికి వారు అందించిన ఎన్నో సంవత్సరాల కృషికి ఇది కృతజ్ఞత” అని పేర్కొన్నారు. ప్రపంచంలో ఇతర దేశాలతో పోలిస్తే జపాన్ ప్రజలు ఎక్కువకాలం ఆరోగ్యంగా జీవించడానికి పలు కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వీటిలో ముఖ్యంగా కూరగాయల అధిక వినియోగం, ప్రతిరోజు వ్యాయామం, వంటలో వేర్వేరు పద్ధతులు, సూప్‌ల వినియోగం ఉన్నాయి. అలాగే జపాన్ టీ సంస్కృతి వ్యాధులను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. సోయా పదార్థాలు, తాజా ఆహార పదార్థాల వినియోగం కూడా దీర్ఘాయుష్షుకు తోడ్పడుతున్నాయి.


(0)
(0)

Comments