I&PR డైరెక్టర్‌గా ప్రఖర్‌జైన్
రాష్ట్ర సమాచారశాఖ డైరెక్టర్‌గా ఆర్‌టిజిఎస్ ప్రధాన కార్యనిర్వహణాధికారిగా బాధ్యతలు నిర్వహిస్తోన్న ప్రఖర్‌జైన్‌ను ప్రభుత్వం నియమించింది. ఈయన ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారు. 2021 ఐఏఎస్ బ్యాచ్ అధికారి. అత్యంత జూనియర్ అధికారి అయిన తెలుగేతర అధికారికి సమాచారశాఖ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులను జారీ చేశారు. ప్రస్తుతం సమాచారశాఖ డైరెక్టర్‌గా ఉన్న హిమాన్ష్ శుక్లా నెల్లూరు కలెక్టర్‌గా బదిలీ కావడంతో ఆయన స్థానంలో ప్రఖర్‌జైన్‌కు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. దీనితో పాటు ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ టెలివిజన్ & థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా కూడా ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించింది. ప్రభుత్వం నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ ఆయన సమాచారశాఖ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం హిమాన్ష్ శుక్లా బదిలీ తరువాత నూతనంగా సమాచారశాఖ బాధ్యతలు ఎవరికి అప్పగించాలనే దానిపై కసరత్తు చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దీనిపై వివిధ వర్గాల నుంచి సమాచారం తెప్పించుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో మరింతగా అధ్యయనం చేయడానికి వీలుగా ముందుగా ప్రఖర్‌జైన్‌కు బాధ్యతలు అప్పగించారని, తరువాత పూర్తి స్థాయి కమీషనర్‌ను నియమిస్తారనే ప్రచారం ఉంది. ఇప్పటికే సమాచారశాఖలో చాలా అంశాలు పెండింగ్‌లో ఉన్నాయి. ముఖ్యంగా అక్రిడిటేషన్ల వ్యవహారం ఇంత వరకూ తేలలేదు. గత వైకాపా ప్రభుత్వం ఇచ్చిన అక్రిడిటేషన్లే ఇప్పటికీ కొనసాగుతున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర అయినా జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు ఇవ్వలేకపోయారనే విమర్శలు ఉన్నాయి. మరోవైపు గత ప్రభుత్వంలో సమాచారశాఖలో జరిగిన అవినీతిపై విచారణ ముందుకు సాగడం లేదు. అవినీతిపై విచారణ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఈ శాఖపై పెద్దగా దృష్టిపెట్టడం లేదనే విమర్శలు జర్నలిస్టు వర్గాల నుంచి వస్తున్నాయి.