రూ.15వేలా...లేక రూ.13వేలా...!?
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయబోతోన్న తల్లికివందనం సొమ్ములపై పలువురి పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ రోజు నుంచి తల్లికి వందనం అమలు చేయబోతున్నామని ప్రభుత్వం ప్రకటించింది. అర్హులైన చదువుకునే విద్యార్ధులందరి తల్లి ఎకౌంట్లలో రూ.15వేలు వేస్తామని ప్రభుత్వం చెబుతోంది. దీని కోసం దాదాపు రూ.8745 కోట్లు విడుదల చేసినట్లు, దీని ద్వారా 67,27,164 మంది విద్యార్ధులకు లబ్ది చేకూరబోతోందని ప్రభుత్వం ప్రకటించిందతి. గత జగన్ ప్రభుత్వం కన్నా తల్లికివందనం కింద రూ.2352 కోట్లు అదనంగా చెల్లించబోతున్నామని ప్రభుత్వ ప్రకటనలో పేర్కొంది. ప్రభుత్వ ప్రకటన విద్యార్థి తల్లిదండ్రుల్లో ఆనందాన్ని నింపింది. అయితే..ఇప్పుడు ప్రభుత్వం నేరుగా రూ.15వేలను తల్లిదండ్రుల ఖాతాలో వేయబోవడం లేదని, దానిలో మరుగుదొడ్ల నిర్వహణ కింద రూ.1000/-, పాఠశాల నిర్వహణ కింద మరో వెయ్యిరూపాయలు మినహాయించుకుంటారని కొన్ని వార్తా పత్రికల్లో వార్తలు వచ్చాయి. అదే నిజమైతే విద్యార్థుల ఖాతాల్లో రూ.13వేలు మాత్రమే పడతాయి. గతంలో జగన్ కుటుంబానికి ఒక విద్యార్థికి మాత్రమే రూ.15వేలు ఇస్తూ, దానిలో రెండు వేలు కోత పెట్టారనే విమర్శలు ఎదుర్కొన్నారు. కూటమి ప్రభుత్వం తాము అలా చేయమని, అర్హులైన ప్రతి విద్యార్థికి రూ.15వేలు ఇస్తామని ప్రకటించింది. అయితే..ఇప్పుడు రెండు రకాల వార్తలు వస్తోన్న నేపథ్యంలో ప్రభుత్వం దీనిపై వివరణ ఇస్తే బాగుంటుంది. వాస్తవానికి ప్రకటించిన విధంగానే రూ.15వేలు ఇస్తేనే విద్యార్థుల తల్లిదండ్రుల్లో సంతోషం నెలకొంటుంది. గతంలో వైకాపాను విమర్శించిన టిడిపి కూటమి వాళ్లు చేసిన పనే చేస్తే వాళ్లకూ..వీళ్లకూ తేడా లేదనే భావన ప్రజల్లో వ్యక్తం అవుతుంది. వేలాదికోట్లు ఖర్చు చేస్తూ కూడా సంతృప్త స్థాయి లేకపోతే..కూటమి ప్రభుత్వానికి ఇబ్బందే. అధికారుల మాటను పక్కన పెట్టి ప్రభుత్వ పెద్దలు ముందు అనుకున్నట్లుగానే రూ.15వేలు ఇస్తేనే ప్రజలు సంతోషిస్తారు. అలా కాకుంటే..వైకాపా నుంచి విమర్శలు, సుద్దులు చెప్పేవారి నసుగుడు తప్పదు.